Egom
-
జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: జీవోఎంలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. పాలనలో పారదర్శకత కోసం జీవోఎంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జీవోఎం పరిధిలో మిగిలిపోయిన నిర్ణయాలను ఇక నుంచి సంబంధిత శాఖలే చూసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో 21 మంత్రుల బృందాలు (జీవోఎం), 9 సాధికారిక బృందాలు(ఈజీవోఎం)లపై వేటు పడింది. ఇప్పటివరకూ పలురకాలైన అంశాలపై జీవోఎం కమిటీలు అందజేసే నివేదికలతోనే కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. కాగా, ఈ విధానంతో పరిపాలనలో పూర్తి పారదర్శకత ఉండదని భావించిన నరేంద్ర మోడీ సర్కారు దీనికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి శాఖా పరంగానే వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. -
స్పెక్ట్రం వినియోగ చార్జీ 5 శాతం
ఈజీఓఎం భేటీలో ఖరారు 2జీ వేలంలో చేజిక్కించుకునే కొత్త స్పెక్ట్రంకు అమలు న్యూఢిల్లీ: వచ్చే నెల 3 నుంచి వేలం వేయనున్న 2జీ స్పెక్ట్రంకు వినియోగ చార్జీని 5 శాతంగా కేంద్రం నిర్ణయించింది. అంటే కొత్తగా స్పెక్ట్రంను దక్కించుకునే టెలికం కంపెనీలన్నీ తమ స్థూల వార్షికాదాయంలో 5 శాతాన్ని టెలికం శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేతృత్వంలోని సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టెలికం మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. పాత టెల్కోలకు 3-8 శాతం స్థాయిలో స్పెక్ట్రం ఫీజు అమలవుతోంది. దీని సగటు లెక్కిస్తే ఎస్‌యూసీ దాదాపు 4.8%గా ఉంది. తాజా వేలంలో స్పెక్ట్రం కొంటే దీంతో పాటు మరో 5 శాతం చెల్లించాలి. కాగా, స్పెక్ట్రం వాడకాన్ని బట్టి ప్రస్తుతం విధిస్తున్న 5 విభిన్న రేట్లను తొలగించి.. అందరకీ సమానంగా 3 శాతం ఎస్యూసీని అమలు చేయాలని టెలికం కమిషన్ తన సూచనల్లో పేర్కొంది. అయితే, ఈజీఓఎం దీనికంటే ఎక్కువ మొత్తాన్నే ఖరారు చేయడం గమనార్హం. పెట్టుబడులు పెరుగుతాయ్... కొత్త ఫీజు వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గినప్పటికీ... రానున్న 2జీ వేలంలో కంపెనీలు మరింత స్పెక్ట్రంను కొనుగోలు చేసేందుకు ఇది దోహదం చేస్తుందని సిబల్ చెప్పారు. దీనిపై కేబినేట్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వేలంలో 8 కంపెనీలు... 900 మెగాహెర్ట్జ్, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లలో 2జీ స్పెక్ట్రం వేలాన్ని వచ్చే నెల 3 నుంచి టెలికం శాఖ ప్రారంభించనుంది. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు మొత్తం 8 కంపెనీలు... ఆర్‌కామ్, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, టాటా టెలీ, టెలీవింగ్స్(యూనినార్), ఎయిర్‌సెల్, ఐడియాలు దరఖాస్తు చేసుకున్నాయి. మొత్తంమీద వేలం ద్వారా రూ.41,000 కోట్ల మేర ఖజానాకు జమకావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
స్పెక్ట్రం బేస్ రేటు పెంపునకు ఓకే...
న్యూఢిల్లీ: జనవరిలో వేలం వేయనున్న టెలికం స్పెక్ట్రంనకు సంబంధించి బేస్ ధరను 25 శాతం దాకా పెంచే ప్రతిపాదనకు సాధికారిక మంత్రుల బృందం (ఈజీవోఎం) ఆమోద ముద్ర వేసింది. అలాగే సీడీఎంఏ సేవలకు ఉపయోగపడే 800 మెగాహెట్జ్ బ్యాండ్ రిజర్వ్ ధరను కూడా సిఫార్సు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్)కి సూచించింది. రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ సారథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో టెలికం కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ... ఈజీవోఎం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. టెలికం సంస్థల విలీన, కొనుగోళ్ల నిబంధనల అంశం ఈ భేటీలో చర్చకు రాలేదు. జీఎస్ఎం సేవలకు ఉపయోగపడే 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో గరిష్టంగా 5 మెగాహెట్జ్ కోసం బిడ్లు వేయొచ్చు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎంత స్పెక్ట్రం వేలం వేసేదీ టెలికం విభాగంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టెలికం శాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. స్పెక్ట్రం వేలం, వన్ టైమ్ స్పెక్ట్రం ఫీజు, ఇతర ఫీజుల ద్వారా రూ. 40,000 కోట్లు రావొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. స్పెక్ట్రం ట్రేడింగ్‌కి కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సిబల్ పేర్కొన్నారు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి సంబంధించి ప్రతి మెగాహెట్జ్‌కి రూ. 1,496 కోట్ల రిజర్వ్ ధర పెట్టాలని ట్రాయ్ సూచించగా, టెలికం కమిషన్ అంతకన్నా 15 శాతం అధికంగా రూ. 1,765 కోట్లుగా ఉంచాలని సిఫార్సు చేసింది. ఇక 900 మెగాహెట్జ్ బ్యాండ్‌కి ధరను ట్రాయ్ సూచించిన దానికన్నా 25 శాతం ఎక్కువగా ఉంచాలని ఈజీవోఎం నిర్ణయించింది. దీని ప్రకారం ఢిల్లీలో ప్రతి మెగాహెట్జ్‌కి కనీస ధర రూ. 360 కోట్లుగాను, ముంబైలో రూ. 328 కోట్లుగాను, కోల్‌కతాలో రూ. 125 కోట్లుగాను ఉండనుంది. రిజర్వ్ ధరను ఎక్కువ చేసినా కూడా గత వేలం ధరతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని సిబల్ తెలిపారు. గత వేలంలో 1800 మెగాహెట్జ్బ్యాండ్కి సంబంధించి ప్రతి మెగాహెట్జ్‌కి రేటు రూ. 2,800గా నిర్ణయించారు. ఇక తాజాగా, పేమెంట్ నిబంధనలు గతంలో తరహాలోనే ఉంటాయని సిబల్ తెలిపారు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి 30 శాతం, 900 మెగాహెట్జ్‌కి 25 శాతం అప్‌ఫ్రంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఎక్కువే..: మరోవైపు.. టెలికం రంగంలో అంతంత మాత్రంగా ఉన్న లాభదాయకతను బట్టి చూస్తే 1800, 900 మెగాహెట్జ్ బ్యాండ్లకి నిర్ణయించిన కనీస ధర ఇప్పటికీ అధికంగానే ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియాకి చెందిన మొహమ్మద్ చౌదరి పేర్కొన్నారు. పైగా సీడీఎంఏ స్పెక్ట్రం ధరలపై అనిశ్చితి, రూపాయి అస్థిరత తదితర అంశాలు వేలంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నారు.