స్పెక్ట్రం వినియోగ చార్జీ 5 శాతం
ఈజీఓఎం భేటీలో ఖరారు
2జీ వేలంలో చేజిక్కించుకునే
కొత్త స్పెక్ట్రంకు అమలు
న్యూఢిల్లీ: వచ్చే నెల 3 నుంచి వేలం వేయనున్న 2జీ స్పెక్ట్రంకు వినియోగ చార్జీని 5 శాతంగా కేంద్రం నిర్ణయించింది. అంటే కొత్తగా స్పెక్ట్రంను దక్కించుకునే టెలికం కంపెనీలన్నీ తమ స్థూల వార్షికాదాయంలో 5 శాతాన్ని టెలికం శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేతృత్వంలోని సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టెలికం మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. పాత టెల్కోలకు 3-8 శాతం స్థాయిలో స్పెక్ట్రం ఫీజు అమలవుతోంది. దీని సగటు లెక్కిస్తే ఎస్‌యూసీ దాదాపు 4.8%గా ఉంది. తాజా వేలంలో స్పెక్ట్రం కొంటే దీంతో పాటు మరో 5 శాతం చెల్లించాలి. కాగా, స్పెక్ట్రం వాడకాన్ని బట్టి ప్రస్తుతం విధిస్తున్న 5 విభిన్న రేట్లను తొలగించి.. అందరకీ సమానంగా 3 శాతం ఎస్‌యూసీని అమలు చేయాలని టెలికం కమిషన్ తన సూచనల్లో పేర్కొంది. అయితే, ఈజీఓఎం దీనికంటే ఎక్కువ మొత్తాన్నే ఖరారు చేయడం గమనార్హం.
పెట్టుబడులు పెరుగుతాయ్...
కొత్త ఫీజు వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గినప్పటికీ... రానున్న 2జీ వేలంలో కంపెనీలు మరింత స్పెక్ట్రంను కొనుగోలు చేసేందుకు ఇది దోహదం చేస్తుందని సిబల్ చెప్పారు. దీనిపై కేబినేట్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
వేలంలో 8 కంపెనీలు...
900 మెగాహెర్ట్జ్, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లలో 2జీ స్పెక్ట్రం వేలాన్ని వచ్చే నెల 3 నుంచి టెలికం శాఖ ప్రారంభించనుంది. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు మొత్తం 8 కంపెనీలు... ఆర్‌కామ్, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, టాటా టెలీ, టెలీవింగ్స్(యూనినార్), ఎయిర్‌సెల్, ఐడియాలు దరఖాస్తు చేసుకున్నాయి. మొత్తంమీద వేలం ద్వారా రూ.41,000 కోట్ల మేర ఖజానాకు జమకావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.