'జియో ఉచిత ఆఫర్లతో వచ్చే నష్టమేమి లేదు'
న్యూఢిల్లీ : ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా కల్పిస్తూ జియో అందిస్తున్న ప్రమోషనల్ ఆఫర్పై టెలికాం పరిశ్రమ సంపదంతా తుడిచిపెట్టుకు పోనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ జియో లాంటి టెలికాం సంస్థలు అందించే ప్రమోషనల్ ఆఫర్ వల్ల ఇండస్ట్రి ఆర్థిక సంపద ఏమీ తగ్గిపోదని టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పష్టీకరిస్తోంది. గత నెల టెలికాం కమిషన్ ఆదేశాలకు స్పందించిన ట్రాయ్ ఈ మేరకు ఓ డ్రాఫ్ నోట్ను రూపొందించింది. టెలికాం కంపెనీల ప్రమోషనల్ ఆఫర్ల వల్ల పరిశ్రమ ఆర్థికసంపదకు నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు తగ్గుతాయని టెలికాం కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది.
ఈ ప్రమోషనల్ ఆఫర్లపై పునఃసమీక్షించాలని ఆదేశించింది. అయితే టెలికాం పరిశ్రమ సంపదకు ఎలాంటి హాని ఉండదని ట్రాయ్ పేర్కొంది. టారిఫ్, టారిఫ్ ఆర్డర్ల బాధ్యతలన్నీ టెలికాం రెగ్యులేటరీ కిందకు వస్తాయి. సెక్టార్ ను ప్రమోట్ చేస్తూ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ట్రాయ్ బాధ్యతని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కన్జ్యూమర్ల ప్రయోజనాలను రక్షిస్తూ.. మార్కెట్ను డెవలప్ చేయాలనేది ట్రాయ్ యాక్ట్ లో స్పష్టంగా చెప్పి ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
దీని కింద రిలయన్స్ జియోకు ఇచ్చిన అనుమతిని రెగ్యులేటరీ పూర్తిగా సమర్థించుకుంటోంది. దీనిపై అటార్ని జనరల్ అభిప్రాయాన్ని కూడా ట్రాయ్ కోరుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రమోషనల్ ఆఫర్లు ఫైనాన్సియల్ సెక్టార్ కు తీవ్రంగా దెబ్బకొడతాయని ఆందోళన వ్యక్తంచేస్తూ టెలికాం సెక్రటరీ జే ఎస్ దీపక్ అధినేతగా ఉన్న టెలికాం కమిషన్ ట్రాయ్కి ఓ లేఖ రాసింది. రెండు ప్రమోషనల్ ఆఫర్లు వెల్కమ్ ఆఫర్, హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద రిలయన్స్ జియో ఉచిత వాయిస్, డేటా కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది.