న్యూఢిల్లీ: టెలికం రంగ సంస్థ రిలయన్స్ జియో(reliance jio) అక్టోబర్‌లో 37.6 లక్షల మంది వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. టెల్కోలు కీలకంగా వ్యవహరించే క్రియాశీల మొబైల్ సబ్‌స్క్రైబర్స్ జియోకు 38.47 లక్షల మంది పెరిగారు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నెలవారీ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) 19.28 లక్షల మంది వైర్‌లెస్ చందాదార్లను కొత్తగా దక్కించుకుంది. యాక్టివ్ కస్టమర్లు దాదాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. క్రియాశీల చందాదార్లు 7.23 లక్షల మంది తగ్గారు.
రిలయన్స్ జియో మొత్తం వైర్‌లెస్ వినియోగదార్ల సంఖ్య అక్టోబర్ నాటికి 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే వొడాఫోన్ ఐడియా మొత్తం వైర్‌లెస్ యూజర్ బేస్ 21.24 కోట్ల నుంచి అక్టోబర్‌లో 21.04 కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 106.6 కోట్లుగా ఉంది. మొత్తం బ్రాడ్‌బ్యాండ్ (broadband) చందాదారులు అక్టోబర్ 2024 చివరి నాటికి 0.31 శాతం తగ్గి 94.14 కోట్లుగా ఉన్నారు. మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య 119.06 కోట్ల నుండి 0.21 శాతం తగ్గి 118.82 కోట్లకు క్షీణించింది.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..
తెలుగు రాష్ట్రాల వైర్‌లైన్‌లో జియో వృద్ధి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో (ఏపీ టెలికం సర్కిల్) వైర్‌లైన్ విభాగంలో అక్టోబర్‌లో గణనీయంగా వృద్ధి సాధించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ట్రాయ్ (TRAI) గణాంకాల ప్రకారం రెండు రాష్ట్రాల్లో నికరంగా 69,930 కనెక్షన్లు కొత్తగా జతయినట్లు వివరించింది. దీంతో సెప్టెంబర్‌లో 17,49,696గా ఉన్న సబ్‌స్కైబర్ల సంఖ్య అక్టోబర్‌లో 18,19,626కి చేరినట్లు సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment