
శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం డిజిటల్ అంతరాన్ని పూడ్చడంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల, సరైన డిజిటల్ కనెక్టివిటిలేని ప్రాంతాల్లో కమ్యునికేషన్ సేవలను అందించేందుకు తోడ్పడుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే ఎయిర్‌టెల్ కూడా దేశంలోని తన వినియోగదారులకు స్టార్‌లింక్ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది.
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కావాలంటే రెగ్యులేటరీ అనుమతులు అవసరమవుతాయి. అందుకోసం కంపెనీ ట్రాయ్ వద్ద అనుమతులకు అవసరమైన పత్రాలు దాఖలు చేసింది. దీనిపై తుని నిర్ణయం వెలువడకుముందే దేశీయ టెలికాం కంపెనీలు స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కస్టమర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు చేస్తున్న కృషిని హైలైట్ చేస్తుంది. జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్ వంటి ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను స్టార్‌లింక్ భర్తీ చేయనుంది. సాంప్రదాయ ఫైబర్ నెట్‌వర్క్‌లు విస్తరించే అవకాశం ఉన్న ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.
విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జియో యోచిస్తోంది. అందుకు అవసరమైన ఇన్‌స్టలేషన్, యాక్టివేషన్, సర్వీస్ అవసరాలకు అనుగుణంగా కస్టమర్ సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తుంది. వినియోగదారులకు సరసమైన, విశ్వసనీయమైన బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ వోమెన్ ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ..‘జియో బ్రాండ్‌బ్యాండ్ ఎకోసిస్టమ్‌లో స్టార్‌లింక్‌ను అనుసంధానించడం ద్వారా కనెక్టివిటినీ విస్తరిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుగంలో హై-స్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ అవకాశాలను పెంచుతున్నాం’ అన్నారు. స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్, సీఓఓ గ్విన్ షాట్వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశ డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడానికి జియోతో కలిసి పనిచేయడం పట్ల ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం
షరతులకు అంగీకారం
దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్‌లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.
యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్‌లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment