న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కంటెంట్ అందించే విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నియంత్రించే దిశగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు టెలికం కమిషన్ (టీసీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన సమావేశంలో ఆమోదించింది. రిమోట్ సర్జరీ, అటానామస్ కార్లు మొదలైన కీలక అప్లికేషన్స్, సర్వీసులకు మాత్రం నెట్ న్యూట్రాలిటీ నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. టెలికం కమిషన్ చైర్మన్ అరుణ సుందరరాజన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ చేసిన సిఫార్సులను టెలికం కమిషన్ (టీసీ) ఆమోదించింది. కొన్ని క్రిటికల్ సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది‘ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధనల అమలు, పర్యవేక్షణ కోసం టెలికం శాఖ (డాట్) ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడర్స్, టెలికం ఆపరేటర్లు, పౌర సమాజ సభ్యులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు సభ్యులుగా ఉంటారు. కీలకమైన సర్వీసులకు సంబంధించిన డేటా ట్రాఫిక్ నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన విధానాల గురించి టెలికం శాఖ .. ట్రాయ్ సిఫార్సులు కోరనుంది.
సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని వెబ్‌సైట్లు, సర్వీసులకే ప్రాధాన్యమిస్తూ మిగతా వాటిని బ్లాక్ చేయడం లేదా నెట్ వేగాన్ని తగ్గించేయడం వంటి పక్షపాత ధోరణులతో వ్యవహరించకుండా తటస్థంగా ఉండేలా చూడటం .. నెట్ న్యూట్రాలిటీ ప్రధాన ఉద్దేశం. ఇంటర్నెట్ కంటెంట్‌ను అందించడంలో వివక్ష ధోరణులకు దారి తీసేలా.. ఏ సంస్థలతోనూ సర్వీస్ ప్రొవైడర్లు ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ట్రాయ్ సిఫార్సు చేసింది. అలాగే నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కంటెంట్‌ను బట్టి ఇంటర్నెట్ వేగాన్ని నియంత్రించడం వంటి పక్షపాత దోరణులకు పాల్పడకుండా నిర్దిష్ట ఆంక్షలు ఉండేలా లైసెన్సింగ్ నిబంధనల్లోనూ మార్పులు చేయాలని కూడా సూచించింది.
‘డిజిటల్ కమ్యూనికేషన్స్’కు ఆమోదం
కొత్త టెలికం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తీసుకునే దిశగా జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్‌డీసీపీ) 2018కి కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసినట్లు సుందరరాజన్ తెలిపారు. ‘భౌతిక మౌలిక సదుపాయాల కన్నా డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రస్తుతం దేశానికి చాలా కీలకమని సమావేశంలో సభ్యులంతా అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. సంస్కరణల ఊతంతో 2022 నాటికి డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కొత్తగా 40 లక్షల ఉద్యోగాల కల్పన, సెకనుకు 50 మెగాబిట్ వేగంతో ప్రజలందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తేవడం మొదలైన లక్ష్యాలను ఎన్‌డీసీపీలో నిర్దేశించుకున్నారు.
పంచాయతీల్లో 12.5 లక్షల వై–ఫై హాట్‌స్పాట్స్
సుమారు రూ. 6,000 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో 2018 డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు 12.5 లక్షల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా కమిషన్ ఓకే చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు, పాఠశాలలను వై–ఫై సర్వీసులతో అనుసంధానించనున్నారు. రోజంతా ప్రజల వినియోగానికి 1–2 వైఫై హాట్‌స్పాట్స్ అదనంగా అందుబాటులో ఉంటాయి. మరోవైపు, టెలికం ఆపరేటర్ల నుంచి టాక్‌టైమ్, డేటా మొదలైనవి కొనుగోలు చేసి తమ బ్రాండ్ కింద రిటైల్‌గా విక్రయించే వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్స్ (వీఎన్‌వో)పై విధిస్తున్న ద్వంద్వ పన్నులను నివారించే ప్రతిపాదనను కూడా టెలికం కమిషన్ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment