న్యూఢిల్లీ: టెలికం యూజర్ల సంఖ్య ఈ ఏడాది మే నెలలో 116.3 కోట్లకు తగ్గింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.49 శాతం క్షీణించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో అమలైన ఏప్రిల్‌లో టెలికం యూజర్ల సంఖ్య 85.3 లక్షల మేర క్షీణించి 116.94 కోట్లకు తగ్గింది. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో యూజర్ల సంఖ్య తగ్గుదల 57.6 లక్షలకు పరిమితమైంది. మొబైల్ టెలిఫోనీ విభాగంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు చెరి 47 లక్షల యూజర్లను కోల్పోయాయి. ఎయిర్‌టెల్ వైర్‌లెస్ కస్టమర్ల సంఖ్య 31.7 కోట్లు, వొడాఫో¯Œ ఐడియా యూజర్ల సంఖ్య 30.9 కోట్లకు క్షీణించింది.
జియో, బీఎస్‌ఎన్‌ఎల్ జోరు..:
జియో 36 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేసింది. మొత్తం మీద 39.2 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల సంఖ్య సైతం 2 లక్షలు పెరిగి 11.9 కోట్లకు చేరింది.
పట్టణ ప్రాంతాల్లో క్షీణత..: పట్టణాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య 92.3 లక్షల మేర తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 36.2 లక్షలు పెరిగింది. మే నెలాఖరు నాటికి మొత్తం మొబైల్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 114.39 కోట్లుగా, ల్యాండ్‌లైన్ యూజర్ల సంఖ్య 1.97 కోట్లుగా ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గుదల మేలోనూ కొనసాగింది. మొత్తం 1.34 లక్షలు క్షీణించింది. అటు జియో మాత్రం 90,000 కొత్త కస్టమర్లను సంపాదించుకుంది.
పెరిగిన బ్రాడ్‌బ్యాండ్...
మొత్తం టెలికం యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు మాత్రం పెరిగారు. వీరి సంఖ్య ఏప్రిల్‌లో 67.3 కోట్లుగా ఉండగా 1.13 శాతం పెరిగి 68.3 కోట్లకు చేరింది. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అత్యధికంగా 66.37 కోట్లుగా ఉండగా, వైర్‌లైన్ కనెక్షన్లు 1.93 కోట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment