
17 ఏళ్ల తర్వాత మళ్లీ మోగెన్
2007 తర్వాత తొలిసారి రూ.262 కోట్ల నికర లాభం
అప్పులు, నష్టాలతో కుదేలైన సంస్థకు సంస్కరణల దన్ను
5జీ సర్వీసుల విస్తరణపైనా కసరత్తు
కాళ్లూ, చేతులు కట్టేసి పరుగుపందెంలో ఉసేన్ బోల్ట్‌తో పోటీపడమంటే అయ్యేపనేనా.. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ పరిస్థితి అలాగే ఉండేది. బ్యూరోక్రసీ బంధనాలతోపాటు స్వయంకృతాపరాధాలు కూడా తోడు కావడంతో కంపెనీ నడక కుంటుపడింది. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు 3జీ, 4జీ, కొత్త ఆవిష్కరణలు, సరళతరమైన టారిఫ్‌లతో దూసుకెళ్తుంటే బీఎస్‌ఎన్‌ఎల్ వెనుకబడిపోయింది.
లాభాల మాట దేవుడెరుగు.. అప్పులు, నష్టాల్లో కూరుకుపోయి మనుగడ కోసం నానాఅవస్థలు పడింది. అలాంటిది.. దశాబ్దంన్నర తర్వాత మళ్లీ బీఎస్‌ఎన్‌ఎల్ లాభాల రింగ్ టోన్ మోగింది. కంపెనీ మళ్లీ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
సాక్షి, బిజినెస్ డెస్క్: ప్రభుత్వ టెలికం విభాగం సర్వీసులను కార్పొరేటీకరించడంతో 2000లో ఏర్పాటైన బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్).. ల్యాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులతో మారుమూల ప్రాంతాలకూ టెలికం సర్వీసులను విస్తరించింది. 2000–2010 మధ్య నాటికి అత్యధిక యూజర్లతో మార్కెట్లో ఆధిపత్యాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత నుంచి యూనినార్, ఎయిర్‌టెల్, రిలయన్స్, వొడాఫోన్ లాంటి ప్రైవేట్ దిగ్గజాలు ఉత్తమ కస్టమర్ సర్వీసులను అందిస్తూ, దూకుడుగా వ్యూహాలను అమలు చేస్తుండటంతో పరిశ్రమపై కంపెనీ పట్టు సడలింది.
కాలం చెల్లిన టెక్నాలజీ, ప్రైవేట్ కంపెనీలతో దీటుగా పోటీపడేందుకు అవసరమైన సాంకేతికత, పరికరాలను సమకూర్చుకోలేకపోవడం, సకాలంలో స్పందించలేని నిస్సహాయ స్థితి.. ఇలాంటి ఎన్నో కారణాలతో కంపెనీ కుదేలైంది. 2006–07లో 31 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 2009 నాటికి 16 శాతానికి పడిపోయింది. 2016లో రిలయన్స్ జియో.. ఉచిత వాయిస్ కాల్స్, అత్యంత చౌకగా డేటా సేవలతో ఎంట్రీ ఇవ్వడమనేది మార్కెట్ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది.
ఇతర ప్రైవేట్ టెల్కోలతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ను కూడా గట్టిగా దెబ్బతీసింది. పెరిగిపోతున్న నష్టా లు, సరైన సమయంలో 4జీ సేవలను తేలేకపోవ డం, ఉద్యోగుల జీతాల భారం పెరిగిపోవడంలాంటి సవాళ్లతో కంపెనీ సతమతమైపోయింది. 2019 నాటికి దాదాపు కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ మద్దతు..
సవాళ్లెన్ని ఉన్నప్పటికీ గ్రామీణ, వ్యూహాత్మక ప్రాంతాల్లో టెలికం సేవలను విస్తరించడంలో కీలకంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కి జవసత్వాలివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. 2019 నుంచి 2022 వరకు మూడు విడతలుగా దాదాపు రూ.3.22 లక్షల కోట్ల విలువ చేసే ప్యాకేజీలిచ్చింది. కేవలం ప్యాకేజీ ఇచ్చి ఊరుకోకుండా సంస్కరణలు కూడా చేపట్టేలా చర్యలు తీసుకుంది.
వ్యయ నియంత్రణ, భారీ స్థాయిలో ఉన్న సిబ్బందిని క్రమబద్దీకరించుకోవడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లాంటి సంస్కరణలు అమలయ్యేలా చూసింది. వ్యయాలను తగ్గించుకునేందుకు 2020లో స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును కంపెనీ అమలు చేసింది. అప్పట్లో ఏకంగా 80,000 మంది వీఆర్‌ఎస్ తీసుకున్నారు. దీనితో ప్రతి నెలా జీతాల బిల్లుల భారం రూ. 600 కోట్ల వరకు తగ్గుతుందని కంపెనీ అప్పట్లో తెలిపింది.
పూర్వ వైభవం దిశగా..
బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేపట్టిన సంస్కరణల ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 16,811 కోట్ల నుంచి రూ.19,130 కోట్లకు పెరిగింది. నష్టాలు రూ. 8,161 కోట్ల నుంచి రూ. 5,367 కోట్లకు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, 2007 తర్వాత.. అంటే 17 ఏళ్ల అనంతరం కంపెనీ తొలిసారిగా లాభాలు చూసింది. రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది.
పోటీ సంస్థల కన్నా చౌకగా, సరళతరమైన ప్యాకేజీలు ఇస్తుండటంతో వినియోగదారులు ప్రైవేట్ కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ బాట పడుతున్నారు. కార్యకలాపాల విస్తరణ, వ్యయ నియంత్రణ చర్యలతో నాలుగో త్రైమాసికంలోనూ ఇదే జోరు కొనసాగిస్తామని కంపెనీ ధీమాతో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 20 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేస్తోంది. 2025 ఆఖరు నాటికి 25 శాతం మార్కెట్ వాటాను నిర్దేశించుకుంది.
బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో..
హై–స్పీడ్ ఇంటర్నెట్‌కి డిమాండ్ పెరగడంతో బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతూ ఫైబర్–టు–ది–హోమ్ సేవలను వేగంగా విస్తరించింది. కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 500 లైవ్ టీవీ చానల్స్ లభించేలా ఫైబర్ ఆధారిత టీవీ సర్వీస్, స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్‌లాంటి వినూత్న సేవలు అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు
65,000 దేశవ్యాప్తంగా ఉన్న టవర్లు
1,00,000 జూన్‌నాటికి లక్ష్యం(నాలుగు మెట్రో నగరాలు, దాదాపు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో 4జీ సర్వీసులున్నాయి)
5జీ సర్వీసుల విస్తరణ
ప్రస్తుతం వైర్‌లెస్ విభాగంలో 9 కోట్ల పైచిలుకు యూజర్లతో దాదాపు 8 శాతం, బ్రాడ్‌బ్యాండ్‌లో సుమారు 43 లక్షల కనెక్షన్లతో 17% మేర మార్కెట్ వాటా ఉంది.

Comments
Please login to add a commentAdd a comment