మార్చినాటికి పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31లోగా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) అమల్లోకి తేవాలని టెలికం శాఖ నిర్దేశించుకుంది. దీని వల్ల సర్కిల్ మారినా మొబైల్ నంబరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇతర టెలికం కంపెనీ సర్వీసులకు మారే వీలు లభిస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టెలికం సర్కిల్లో ఉన్న మొబైల్ యూజరు ఒకవేళ తన నంబరు మార్చుకోకుండా వేరే టెలికం కంపెనీకి మారదల్చుకుంటే.. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో మాత్రమే మార్చుకోవడానికి వీలుంది. అదే పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల సర్కిల్స్‌లో సైతం వేరే టెలికం కంపెనీకి మారడానికి వెసులుబాటు లభిస్తుంది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులకు టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తుది ఆమోదముద్ర కోసం టెలికం కమిషన్ నిర్ణయాన్ని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ముందు ఉంచనున్నట్లు వివరించాయి. పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమలుకు సంబంధించి ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసినప్పట్నుంచీ ఆరు నెలల పాటు టెలికం ఆపరేటర్లకు వ్యవధి ఇవ్వాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. మరోవైపు తదుపరి రౌండు స్పెక్ట్రం వేలం ప్రక్రియ నిర్వహణ కోసం వేలంపాటదారు ఎంపిక తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియకు టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసింది. ఆక్షనీర్ల(టెలికం కంపెనీలు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నవంబర్ తొలి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కూడా టెలికం శాఖ మంత్రి ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
95 కోట్లకు టెలికం యూజర్ల సంఖ్య...
* టెలికం వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 95 కోట్లను దాటింది. వీటిల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 92.43 కోట్లుగా ఉందని ట్రాయ్ తెలి పింది. టెలికం యూజర్ల సంఖ్య 95 కోట్లను అధిగ మించడం ఇది రెండోసారి. గతంలో 2012 మార్చిలో ఈ సంఖ్య 95 కోట్లను దాటింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం...
* ఈ ఏడాది జూలైలో 94.64 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 95.18 కోట్లకు పెరిగింది.
* మొబైల్, ఇంటర్నెట్ డాంగిల్ కనెక్షన్‌లతో కలిపి మొత్తం వెర్లైస్ యూజర్ల సంఖ్య 92.4 కోట్లకు చేరింది.
* మొత్తం టెలికం కస్టమర్లలో ప్రైవేట్ కంపెనీల వినియోగదారుల వాటా 90 శాతానికి పైగా ఉంది.