ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్న రిలయన్స్ జియో వల్ల ఇటు టెలికాం కంపెనీలకే కాదు, అటు ప్రభుత్వానికి భారీగానే నష్టం వాటిల్లుతోంది. జియో ఉచిత డేటా, ఉచిత వాయిస్ సర్వీసులతో ప్రభుత్వం రూ.685 కోట్లను వదులుకోవాల్సి వచ్చిందని టెలికాం కమిషన్ వెల్లడించింది.. నిర్దేశించిన సమయానికి మించి ఆఫర్లను అందిస్తుండటంతో సెక్టార్ నష్టపోతున్నట్టు పేర్కొంది. ఈ విషయంపై మొట్టమొదటిసారి స్పందించిన టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, జియో బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషనల్ ఆఫర్లు, ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ప్రభుత్వంపై పడిన ప్రభావాన్ని వివరించింది. పరిశ్రమ వృద్ధికి తోడ్పడేలా ప్రస్తుత నిబంధనలను సమీక్షించాలని, ప్రమోషనల్ టారిఫ్‌లకు సంబంధించిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి కమిషన్ సూచించింది.