ఇక పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ | Telecom panel game for full number portability | Sakshi
Sakshi News home page

ఇక పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ

Published Sat, Jun 14 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

ఇక పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ

ఇక పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ

పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ సవరణ ప్రతిపాదనకు ఓకే
* నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం సేవల విస్తృతిపై దృష్టి
* టెలికం కమిషన్ నిర్ణయాలు

 
న్యూఢిల్లీ: దేశంలో ఏ ప్రాంతానికి వె ళ్లినా, ఆపరేటరును మార్చినా మొబైల్ నంబరును మార్చుకోవాల్సిన పని లేకుండా పూర్తి స్థాయి మొబైల్ నంబరు పోర్టబిలిటీకి (ఎంఎన్‌పీ) టెలికం కమిషన్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంఎన్‌పీ విధానం ప్రకారం ఆపరేటరు మారినా ఒకే నంబరును కొనసాగించుకునే వెసులుబాటు ఒక సర్కిల్‌కి మాత్రమే పరిమితమైంది. టెలికం కమిషన్ నిర్ణయంతో.. సర్కిల్ మారినా కూడా దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు లభిస్తుంది.  పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమలు విషయంలో బ్యాంకు గ్యారంటీలు తదితర అంశాల గురించి ట్రాయ్ నుంచి మరింత అదనపు సమాచారాన్ని టెలికం కమిషన్ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
శుక్రవారం సమావేశమైన  అంతర -మంత్రిత్వ శాఖల టెలికం కమిషన్.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలను ఆమోదించింది. 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్‌వోఎఫ్‌ఎన్) ప్రాజెక్టు గడువును 2017 మార్చి దాకా పొడిగిస్తూ సవరించిన ప్రతిపాదనకు ఓకే చెప్పింది. దాదాపు రూ. 20,000 కోట్ల ఈ ప్రాజెక్టు 2015 సెప్టెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, పవర్‌గ్రిడ్, రెయిల్‌టెల్‌తో ఏర్పాటు చేసిన భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ఇందులో సింహభాగం పనులు చేపడుతోంది.
 
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్లు..
తొమ్మిది నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో టెలిఫోన్ సేవలు విస్తరించేందుకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలన్న యోచనకు టెలికం కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం నెట్‌వర్క్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 2,900 కోట్ల వ్యయం కాగలదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ తుది ఆమోదానికి పంపనున్నారు.

 ఎన్‌వోఎఫ్‌ఎన్ ఇన్‌ఫ్రాను వినియోగించుకునే గవర్నమెంట్ యూజర్ నెట్‌వర్క్ (గన్) అనే వైఫై ప్రాజెక్టుకు కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసింది. దీనికి రూ. 25,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. అటు ప్రభుత్వోద్యోగులకు శిక్షణ కల్పించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. దీనిపై క్యాబినెట్ తుదినిర్ణయం తీసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement