టెలికం షేర్ల జోరు | Sensex Gains 186 Points; Nifty Stops At 11,940 | Sakshi
Sakshi News home page

టెలికం షేర్ల జోరు

Published Wed, Nov 20 2019 2:16 AM | Last Updated on Wed, Nov 20 2019 2:16 AM

Sensex Gains 186 Points; Nifty Stops At 11,940 - Sakshi

ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే తక్కువకే పరిమితం చేయాలన్న ప్రతిపాదన వచ్చే క్యాబినెట్‌ సమావేశంలోనే చర్చకు రానున్నదన్న వార్తల కారణంగా మంగళవారం కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో  స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది.  అమెరికా–చైనాల మధ్య కనీసం మినీ ఒప్పందమైనా కుదిరే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు పెరగడం కలసి వచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు లాభపడటం, ముడి చమురు ధరలు 0.8 శాతం తగ్గడం  సానుకూల ప్రభావం చూపించాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌  186 పాయింట్లు పెరిగి 40,470 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 11,940 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇన్‌ఫ్రా, ఇంధన, టెలికం షేర్లు లాభపడ్డాయి. వాహన, లోహ, కన్సూమర్‌ షేర్ల పతనంతో లాభాలు పరిమితమయ్యాయి.

కొనసాగిన టెలికం పరుగు.. 
టెలికం షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. వచ్చే నెల నుంచి డేటా, వాయిస్‌ టారిఫ్‌లను పెంచనున్నామని ప్రకటించడంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాల లాభాలు కొనసాగాయి. ఇంట్రాడే లో ఏడాది గరిష్ట స్థాయి, రూ.445కి ఎగసిన  ఎయిర్‌టెల్‌ చివరకు 7.3% లాభంతో రూ.439 వద్ద ముగిసింది. వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 35 శాతం లాభంతో రూ.6 వద్దకు చేరింది. టారిఫ్‌లు పెరిగితే టెలికం కంపెనీలు భారీగా ఉన్న తమ రుణాలను తీర్చివేసే అవకాశం ఉంటుందని, ఫలితంగా బ్యాంక్‌ బకాయిలు తగ్గుతాయనే అంచనాలతో బ్యాంక్‌ షేర్లు కూడా లాభపడ్డాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి కాగా, ప్రమోటర్లు తమ వాటా షేర్లను పూర్తిగా అమ్మేయడంతో యెస్‌ బ్యాంక్‌ షేర్‌ 2.6% నష్టంతో రూ.64 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే కావడం గమనార్హం.

రిలయన్స్‌ రికార్డ్‌...
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) షేర్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,515ను తాకింది. చివరకు 3.5% లాభం తో రూ.1,510  వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసేనాటికి ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.9,57,086 కోట్లకు పెరిగింది. మార్కెట్‌ క్యాప్‌ విషయంలోనూ ఈ కంపెనీ కొత్త రికార్డ్‌ సృష్టించింది.  రూ.9.5 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ క్యాప్‌ సాధంచిన తొలి భారత కంపెనీ ఇదే. మరోవైపు అత్యధిక మార్కెట్‌క్యాప్‌ ఉన్న భారత కంపెనీ కూడా ఇదే. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్‌ 34 శాతం ఎగసింది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement