
న్యూఢిల్లీ: వచ్చే నెలాఖరు నాటికి కొత్త టెలికం విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అప్పటికల్లా దీన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్–ఫ్లయిట్ కనెక్టివిటీ సర్వీసులు ఏడాది కాలంలో సాకారం కాగలవన్నారు. నాలుగేళ్ల ఎన్‌డీఏ పాలనలో సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారాయన.
మరోవైపు, జూన్ 29న జరిగే సమావేశంలో ఈ ముసాయిదాను టెలికం కమిషన్ ముందు ఉంచనున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. నెట్ న్యూట్రాలిటీ, కొత్త టెక్నాలజీ అమలుకు అవసరమైన విధానాలు మొదలైన వాటిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్‌డీసీపీ) 2018 ముసాయిదాను కేంద్రం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటింటికీ 50 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్ రంగంలోకి రూ. 6.5 లక్షల కోట్లు ఆకర్షించడంతో పాటు 40 లక్షల పైచిలుకు కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంతో దీన్ని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment