కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ సేవల కోసం నిర్దేశించిన స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలాన్ని మే 20న ప్రారంభించనుంది. వీటి ప్రాథమిక ధరను రూ.96,317.65 కోట్లుగా నిర్ణయించింది. వేలానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికాం విభాగం ఇటీవల నోటీసు జారీ చేసింది.
దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టనున్నారు. అదే సమయంలో కొన్ని టెలికాం కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రానికి ఈ ఏడాది గడువు తీరనుండడంతో ఆ ఫ్రీక్వెన్సీలనూ ఈ వేలంలో జత చేయనున్నారు. దీంతో ప్రస్తుతం 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్ట్జ్‌తో పాటు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణయించారు. తుది బిడ్డర్ల జాబితా మే 9న విడుదల చేస్తారు. నమూనా వేలం మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. వాస్తవ వేలాన్ని మే 20 నుంచి చేపడతారు.
బిడ్డింగ్‌ను వేలంలో గెలుచుకున్నవారికి 20 ఏళ్ల పాటు స్పెక్ట్రమ్ కేటాయిస్తారు. 20 సమాన వార్షిక వాయిదాల్లో ఇందుకు చెల్లింపులు చేయాలి. దీనికి వడ్డీ రేటు 8.65 శాతంగా నిర్ణయించారు. కనీసం 10 ఏళ్ల అనంతరం స్పెక్ట్రమ్ సరెండర్ అవకాశం ఇస్తారు. ఈసారి వేలంలో స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్‌యూసీ) లేవు. బ్యాంకు హామీలనూ సమర్పించాల్సిన అవసరం లేదు.
స్పెక్ట్రమ్ అంటే?
సెల్‌ఫోన్లు, రేడియోలు వంటి వైర్‌లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార బట్వాడాకు విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్‌ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్‌లుగా వర్గీకరించారు.
ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’
గతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment