న్యూఢిల్లీ: కొత్త లైసెన్సింగ్ నిబంధనలపై సిఫార్సుల్లో వాట్సాప్, టెలిగ్రాం వంటి మెసేజింగ్, కాలింగ్ యాప్‌లను మినహాయించడంపై టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీలో తమ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. అలాగే సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సంబంధిత చెల్లింపుల అంశాల గురించి చర్చించాయి.
రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ, వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ ముంద్రా, భారతి ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విఠల్, బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ రాబర్ట్ జె. రవి ఇందులో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సుల్లో సర్వీస్ ఆథరైజేషన్ నుంచి ఓటీటీ యాప్‌లను మినహాయించడంపై అన్ని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించాయి.
వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు ఏజీఆర్ అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నాయి. ఏజీఆర్ లెక్కింపులో గతంలో జరిగిన తప్పిదాలను సవరించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా రూ. 70,320 కోట్ల మేర, భారతి ఎయిర్‌టెల్ రూ. 21,500 కోట్లు ఏజీఆర్ బకాయీలు కట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment