న్యూఢిల్లీ: దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సర్వీసులకు భద్రత కల్పించే దిశగా టెలికం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. సైబర్ సెక్యూరిటీకి భంగం కలగకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు, ఒకవేళ ఉల్లంఘన ఉదంతాలేమైనా తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు మొదలైనవి వీటిలో ఉన్నాయి.
వీటి ప్రకారం ప్రతి టెలికం సంస్థ సైబర్ సెక్యూరిటీ పాలసీని (భద్రత చర్యలు, రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలు, శిక్షణ, ఉత్తమ విధానాలు.. టెక్నాలజీలను వినియోగించడం మొదలైనవి) అమలు చేయాల్సి ఉంటుంది. చీఫ్ టెలికమ్యూనికేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌ని నియమించుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఉల్లంఘన జరిగితే ఆరు గంటల్లోగా ప్రభావిత సిస్టం వివరాలను కేంద్రానికి తెలియజేయాలి. 24 గంటల వ్యవధిలో ఏ ప్రాంతంలో, ఎంత మంది యూజర్లపై, ఎంత సేపు ప్రభావం పడింది, తీసుకున్న దిద్దుబాటు చర్యలేమిటి తదితర వివరాలను ఇవ్వాలి.
అలాగే, మొబైల్ పరికరాల తయారీ సంస్థలు ఆయా ఉత్పత్తులను విక్రయించడానికి ముందే, వాటి ఐఎంఈఐ నంబరును ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీని మెరుగుపర్చే దిశగా టెలికం సంస్థల నుంచి ట్రాఫిక్ డేటా, ఇతరత్రా వివరాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment