ప్రభుత్వ నియమనిబంధనలను పాటిస్తానని ప్రకటించిన మస్క్ కంపెనీ
మార్గదర్శకాల్లో భాగంగా యూజర్ల డేటాను భారత్‌లో నిల్వచేయనున్న సంస్థ
న్యూఢిల్లీ: పలు దేశాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారతీయ విపణిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధంచేసుకుంటోంది. భారత చట్టాల ప్రకారం సంస్థను నడిపేందుకు స్టార్‌లింగ్ ముందుకు వచ్చిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభుత్వ సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ తమ భారతీయ యూజర్ల సమాచారాన్ని దేశీయంగానే నిల్వచేయాల్సి ఉంటుంది. ఇందుకు స్టార్‌లింక్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో స్టార్‌లింక్ ప్రతినిధులు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
శాటిటైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల(జీఎంపీసీఎస్) లైసెన్స్ మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలను పాటిస్తామని సంస్థ తెలిపింది. స్టార్‌లింక్ సంస్థ ఇంకా తమ సమ్మతి పత్రాలను సమర్పించాల్సి ఉంది. సమర్పణ పూర్తయితే సంస్థ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌లో జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకుంది. ఈ రంగంలోని భారత నియంత్రణసంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) సంబంధిత అనుమతులను మంజూరుచేయనుంది. ఆలోపు తమ అభ్యంతరాలపై సరైన వివరణ ఇవ్వాలని స్టార్‌లింక్‌ను ఇన్–స్పేస్ కోరింది. స్టార్‌లింక్‌కు పోటీగా మరో ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ సంస్థలో భాగమైన ‘ప్రాజెక్ట్ కూపర్’సంస్థ సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.
ఈ రెండు సంస్థల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా చెప్పారు. భద్రతా నియమాలకులోబడి సంస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం అన్నారు. అగ్రరాజ్యాధినేతగా తన సన్నిహితుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో భారత్‌సహా కీలక శాటిటైల్ ఇంటర్నెట్ సేవల మార్కెట్లలో మెజారిటీ వాటా కైవసంచేసుకోవాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు.
స్ప్రెక్టమ్ కేటాయింపులు, తుది ధరలపైనే భారత్‌లో స్టార్‌లింక్ భవితవ్వం ఆధారపడిఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే భారతి గ్రూప్‌కు చెందిన వన్‌వెబ్, జియా–ఎస్‌ఈఎస్ సంయుక్త సంస్థ అయిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు లైసెన్సులు ఇచ్చింది. వీటికి ఇంకా స్ప్రెక్టమ్ కేటాయింపులు జరగలేదు. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన సిఫార్సులకు ట్రాయ్ డిసెంబర్ 15వ తేదీలోపు తుదిరూపునివ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment