
శాటిలైట్ సేవల లైసెన్స్ నిబంధనలకు అంగీకారం
దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను ఎలాన్‌మస్క్(Elonmusk) ఆధ్వర్యంలోని స్టార్‌లింక్(StarLink) అధికారికంగా అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.
షరతులు సడలించాలని వినతి
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్‌లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, స్టార్‌లింక్, అమెజాన్‌కు చెందిన కూపర్ వంటి గ్లోబల్ సంస్థలకు ఎలాంటి నిబంధనలను సడలించబోమని ప్రభుత్వం తన వైఖరిని గతంలోనే స్పష్టం చేసింది.
చందాదారులను కోల్పోయే ప్రమాదం
ప్రస్తుతం స్టార్‌లింక్ దరఖాస్తును హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. స్టార్‌లింక్ అధికారికంగా దరఖాస్తు పూర్తి చేసిన తరువాత ప్రభుత్వం ఎలాంటి వివరణ కోరలేదు. ఒకవేళ దీనికి ప్రభుత్వం ఆమోదం లభిస్తే ఈ ఏడాది చివరి నాటికి స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్టార్‌లింక్ వంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించడం ద్వారా తమ చందాదారులను కోల్పోయే ప్రమాదం ఉందని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అదానీ గ్రీన్ ఒప్పందంపై శ్రీలంక పునఃసమీక్ష
ప్లాన్ల ధరలు ఇలా..
స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో సహా గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్ల ధర నెలకు 10-500 డాలర్లు(రూ.840-రూ.5,000)గా ఉంటుందని అంచనా. ఈ ధర సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, పరిమిత కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు ఎంతో మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment