
టెలికాంకు షాకిచ్చిన జీఎస్‌టీ
ముంబై: టెలికాం సేవలపై 18శాతం పన్ను రేటు నిర్ణయించడంపై అపుడే దుమారం మొదలైంది. దీనిపై టెలికం పరిశ్రమ పెద్దలు నిరాశ వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఇటు పరిశ్రమపైనా. అటు వినియోగదారులపైనా భారాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. దీంతో దేశీయంగా టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయనే ఆందోళన వ్యక్తం చేశారు.
నాలుగు పన్నుల రేట్లను ఖరారు చేస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. పన్ను విధానంపై ఈ నెల 18, 19 తేదీల్లో జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్సమావేశంలో సర్వీసెస్ పన్నుల శ్లాబ్‌లను ఖరారు చేసింది. ముఖ్యంగా టెలికాం, బీమా, హోటళ్ళు, రెస్టారెంట్లుపై పన్ను రేట్లను ఫైనల్ చేసింది. జులై 1 నుంచి జీఎస్‌టీ ను అమలు చేయనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం చెప్పారు. అయితే టెలికాం సేవలపై 18శాతం పన్ను నిర్ణయించడంపై మార్కెట్లో చర్చకు దారి తీసింది.
ముఖ్యంగా టెలికాం పరిశ్రమం 18 శాతం పన‍్నురేటుపై నిరాశ వ్యక్తం చేసింది. జీఎస్‌టీ స్వాగతించినప్పటికీ,తమకు 18శాతం ప్రకటించిన రేటుతో తాము నిరాశకు గురయ్యామని తెలిపింది. ఇది ఇప్పటికే నష్టాల్లో టెలికాం పరిశ్రమపై మరింత భారాన్ని పెంచుతుందని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 15 శాతం కాకుండా 18శాతంగా నిర్ణయించడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన మందగించటం, డిజిటల్ ఇండియా, క్యాష్‌లెస్ ఇండియాలాంటి ఇతర ప్రధాన కార్యక్రమాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. అత్యవసర సేవలుగా ఉన్న టెలికాం రంగానికి మరిన్ని పన‍్ను మినహాయింపులు, ప్రయోజాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.చివరి మైలువరకు ప్రతిఒక్కరికీ కనెక్టివిటీ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పరిశ్రమ నిర్వరామంగా కృషి చేసిందని మాథ్యూస్ పేర్కొన్నారు
కాగా శ్రీనగర్‌లో నిర‍్వహించిన తాజా జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశాల్లో నాలుగు అంచెల పన్నుల రేట్లను ఖరారు చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే.