గోఎయిర్ విమాన సంస్థ స్లాట్‌లు, విదేశీ ద్వైపాక్షిక హక్కులను తాత్కాలికంగా ఇతర కంపెనీలకు కట్టబెడుతూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది.
గోఎయిర్‌కు చెందిన స్లాట్‌లు, దైపాక్షిక హక్కులను ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలకు పంపిణీ చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే వీటిని సాధారణ పూల్‌లో ఉంచి ఆపై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, అకాసా సంస్థ గోఎయిర్ దుబాయ్ విమానయాన హక్కులను కోరినట్లు తెలిసింది. దీనిపై కేంద్రం అకాసాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
గోఎయిర్ స్లాట్‌లు, దైపాక్షిక హక్కుల కోసం గతంలో బిడ్డింగ్ వేసిన ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టి ఇటీవల తన బిడ్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఈజ్‌మైట్రిప్ స్థిరమైన వృద్ధి సాధించేందుకు వనరులను ఉపయోగించనున్నామని నిశాంత్ చెప్పారు. మళ్లీ గోఎయిర్ కోసం కొత్తగా ఎవరు బిడ్ వేయలేదు. దాంతో సంస్థకు చెందిన స్లాట్‌లు, ఇతర హక్కులను మంత్రిత్వశాఖ ఇతర సంస్థలకు తాత్కాలికంగా కేటాయించింది.
స్లాట్‌లు, దైపాక్షిక హక్కులు..
ఒక నిర్దిష్ట దేశానికి చెందిన విమానయాన సంస్థలు మరొక దేశానికి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఇది ఒక దేశం నుంచి వారానికి ఎన్ని విమానాలు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది. అయితే విమానయాన సంస్థ ఈ హక్కులు కలిగిఉన్నా విమాన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎయిర్‌పోర్ట్‌ల్లో స్లాట్‌లను కలిగి ఉండాలి. ఒక ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి అనుమతించే తేదీ, సమయాన్ని స్లాట్‌గా పేర్కొంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీబీసీఏ అధికారులు, విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలతో కూడిన కమిటీ ఈ స్లాట్‌లను కేటాయిస్తుంది.
టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రతి వారం దాదాపు ఒక కొత్త విమానాన్ని తమ ఫ్లీట్‌లో చేరుస్తున్నాయి. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఈరంగంలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో గోఎయిర్‌కు ఈ స్థితి రావడంపట్ల మార్కెట్ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి.
ఇదీ చదవండి: మరో ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!
వాడియా గ్రూప్ యాజమాన్యంలో గో ఫస్ట్ రుణదాతలకు రూ.6,200 కోట్లకు పైగా బకాయిపడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌లకు వరుసగా రూ.1,934 కోట్లు, రూ.1,744 కోట్లు, రూ.75 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment