బెంగాల్ తీరంలో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్న తీరరక్షణ దళం సభ్యులు
న్యూఢిల్లీ: పెను తుపానుగా విధ్వంసం సృష్టించే అవకాశమున్న ‘యాస్’ను ఎదుర్కొనే సంసిద్ధతపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సహాయ చర్యలు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని, ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తుపాను ప్రభావం పడనున్న రాష్ట్రాలను, సంబంధిత కేంద్ర సంస్థలను ఆదేశించారు.
విద్యుత్, టెలికం సేవలు నిలిచిపోతే, సాధ్యమైనంత త్వరగా వాటిని పునరుద్ధరించాలని సూచించారు. తుపాను కారణంగా కోవిడ్– 19 పేషెంట్ల చికిత్సకు, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలగకుండా సమన్వయంతో, ప్రణాళకతో పనిచేయాలని కోరారు. మే 26 సాయంత్రానికి ఉత్తర ఒడిషా, పశ్చిమబెంగాల్ మధ్య యాస్ తుపాను తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తుపాను ప్రభావం పడనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితిని కేంద్ర హోంశాఖ నిశితంగా పరిశీలిస్తోందని, అవసరమైన ప్రాంతాలకు సహాయ బృందాలను తరలించడానికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి 46 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించామని వెల్లడించింది.
మరికొన్ని బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని తెలిపింది. గాలింపు, రక్షణ, సహాయ చర్యల కోసం నౌకాదళం, తీర రక్షకదళం నౌకలు, హెలికాప్టర్లతో సిద్ధంగా ఉందని పీఎంఓ తెలిపింది. అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. సహాయ చర్యల కోసం 11 రవాణా విమానాలను, 25 చాపర్లను సిద్ధంగా ఉంచామని వైమానిక దళం తెలిపింది. ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు, విద్యుత్, టెలీకాం సేవల పునరుద్ధరణ, కోవిడ్ రోగుల చికిత్స, వ్యాక్సినేషన్.. వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరానని అనంతరం ప్రధాని ట్వీట్ చేశారు. అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
సిద్ధంగా ఉన్నాం
తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ చీఫ్ ఎస్‌ఎన్ ప్రధాన్ కోరారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు చర్యలను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. తుపాను ప్రభావం తక్కువ ఉండే అవకాశమున్న ప్రాంతాల్లోనూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అవసరమైన దానికన్నా రెండింతలు సిద్ధంగా ఉండడం వల్ల నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేయవచ్చని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. పశ్చిమబెంగాల్‌లో 12 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కో బృందంలో 47 మంది సుశిక్షిత సిబ్బంది ఉంటారని తెలిపారు. రాష్ట్రాల్లో విపత్తు సహాయక బృందాల సామర్థ్యంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో వారికి సరైన శిక్షణ కూడా లేదన్నారు. ఈ విషయంలో ఒడిశా మాత్రం అద్భుతంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment