Cyclone Yass
-
‘యాస్’ నష్టం రూ.610 కోట్లు: జల దిగ్బంధంలో 500 గ్రామాలు
భువనేశ్వర్: యాస్ తుపానుతో రాష్ట్రంలో రూ.610 కోట్ల నష్టం సంభవించింది. రూ. 520 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు నష్టపోగా ప్రభుత్వేతర ఆస్తులకు రూ.90కోట్ల నష్టం వాటిల్లిందని పలు విభాగాల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు వివరించారు. యాస్ తుపాను నష్టం, పునరుద్ధరణ కార్యకలాపాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆన్లైన్లో గురువారం సమీక్షించారు. అధికారులకు అభినందనలు ప్రభుత్వ అధికారులు, ప్రభావిత జిల్లా యంత్రాంగం అద్భుతమైన కార్యాచరణతో ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తులను పరిరక్షించారని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలు అత్యంత స్వల్ప వ్యవధిలో ముగించడం విశేషమని మెచ్చుకున్నారు. యాస్ తుపాను తీరం తాకే ముందు, తాకే సమయం, తదనంతర పరిస్థితుల్లో చేపట్టిన సమగ్ర విపత్తు నిర్వహణ దస్తావేజులతో భద్రపరిస్తే భావి విపత్తు నిర్వహణ వ్యవహారాల్లో మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. జల దిగ్బంధంలో 500 గ్రామాలు సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో మాట్లాడుతు యాస్ తుపాను ప్రభావంతో సమగ్రంగా 150 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమద్రపు నీరు పొలాల్లోకి వచ్చి పంటలకు నష్టం కలిగించింది. తుపాను తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగు నీరు సరఫరా పునరుద్ధరణకు 1,000 డీజీ సెట్లతో ట్యాంకర్లు, పీవీసీ ట్యాంకులు వినియోగించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో ప్రాణ హాని నినాదంతో యాస్ తుపాను విపత్తు నిర్వహణ కోసం నిరంతరం కృషి చేసినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. పంటలపై తుపాను ప్రభావం యాస్ తుపాను తీవ్రతతో కోస్తా ప్రాంతంలోని పొలాల్లోకి సముద్రపు నీరు చొరబడింది. దీని ప్రభావం ఖరీఫ్ సాగుపై పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితులపై ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం, కేంద్రీయ వరి పరిశోధన సంస్థ పరిశోధన చేసి రైతాంగానికి సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎస్సార్సీ ప్రతిపాదించారు. ముగిసిన విద్యుత్ పునరుద్ధరణ యాస్ తుపానుతో 30 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ప్రభావితమయ్యారని ఆ విభాగం కార్యదర్శి తెలిపారు. 99.8 శాతం వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కార్యకలాపాలు ముగిశాయి. 230 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించారు. విద్యుత్ విభాగానికి రూ.150 కోట్ల నష్టం సంభవించిందని వివరించారు. రహదారులు ఛిన్నాభిన్నం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మే 31వ తేదీ నాటికి గొట్టపు బావులు, కుళాయి నీరు సరఫరా, పారిశుద్ధ్యం కార్యకలాపాలు ముగించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీరు విభాగం తెలిపింది. యాస్ తుపాను 8 నగర, పట్టణ ప్రాంతాల్లో 58 రహదారుల్ని ఛిన్నాభిన్నం చేసింది. తుపాను ఉద్ధృతితో సముద్ర తీరం, నదీ గట్లు కోతకు గురవడంతో జల వనరుల విభాగానికి రూ.108 కోట్లు, రోడ్లు–భవనాల శాఖకు రూ.246 కోట్లు, గ్రామీణ అభివృద్ధి విభాగానికి రూ.60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా విభాగాలు వివరించాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్‌చంద్ర మహాపాత్రో, ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా, యాస్ ప్రభావిత జిల్లాలు బాలాసోర్, భద్రక్, మయూర్భంజ్, కేంద్రాపడా కలెక్టర్లు, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పాల్గొన్నారు. -
ఆ మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్లు
భువనేశ్వర్/కోల్‌కతా: యాస్ తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన ఒరిస్సా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లకు కలిపి ప్రధాని మోదీ రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. ఇందులో, తక్షణ సాయం కింద ఒడిశాకు రూ.500 కోట్లు, బెంగాల్, జార్ఖండ్‌లకు కలిపి రూ.500 కోట్లు సాయంగా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతోపాటు, తుపాను వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇస్తారని పీఎంవో తెలిపింది. అంతకుముందు, ఒడిశాలో యాస్ తుపాను మిగిల్చిన విషాదం, వాటిల్లిన నష్టంపై ప్రధాని మోదీ స్వయంగా సమీక్ష నిర్వహించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ గణేష్ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగి పాల్గొన్నారు. తుపాన్ల సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా ఒడిశా సర్కారు డిమాండ్ చేసింది. సమావేశం అనంతరం ప్రధాని బాలాసోర్, భద్రక్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి బెంగాల్‌కు వెళ్లారు. రూ.20 వేల కోట్ల ప్యాకేజీ కోరిన మమత తుపానుతో రాష్ట్రంలో సంభవించిన నష్టం వివరాలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. బెంగాల్లో తుపాను పరిస్థితిని సమీక్షించేందుకు మోదీ కోల్‌కతాకు వచ్చారు. దిఘాలో సీఎం మమతా బెనర్జీతో 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు.తుపానుతో రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు మమత చెప్పారు. -
Cyclone Yass: ‘యాస్’ విధ్వంసం
బాలాసోర్/కోల్‌కతా: అత్యంత తీవ్ర తుపాను ‘యాస్’ ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. పెను గాలులు, భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్, టెలికం సేవలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. పళ్ల తోటలు, పంటపొలాలు నాశనమయ్యాయి. దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా ఒడిశాలో నలుగురు, బెంగాల్లో ఒకరు చనిపోయారు. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశాలోని ధమ్ర పోర్ట్ సమీపంలో తుపాను తీరం దాటింది. మధ్యాహ్నానికి బలహీనపడి జార్ఖండ్ దిశగా వెళ్లింది. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్ జిల్లాల్లో పలు తీర ప్రాంత గ్రామాల్లోకి సముద్ర నీరు చొచ్చుకువచ్చింది. ఆయా ప్రాంతాల్లో స్థానికుల సహకారంతో సహాయ చర్యలు చేపట్టామని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే జెనా తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో చెట్లు కూలి ఇద్దరు, ఇల్లు కూలి ఒక వృద్ధురాలు చనిపోయారు. తీరప్రాంతాల నుంచి 5.8 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. పశ్చిమబెంగాల్లో.. తమ రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ఈ తుపాను ప్రభావం చూపిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 కోట్ల విలువైన సహాయసామగ్రిని పంపిణీ చేశామన్నారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శంకర్‌పుర్, మందర్మని, తేజ్పూర్‌ల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సముద్ర తీరాల్లో అలలు అల్లకల్లోలం సృష్టించాయి. కొన్నిచోట్ల కొబ్బరి చెట్ల ఎత్తులో కెరటాలు విరుచుకుపడ్డాయి. శంకరపుర్లోని తీర ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాల అలల ధాటికి కొట్టుకుపోయింది. పౌర్ణమి కావడంతో అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. హూగ్లీ నది పోటెత్తడంతో కోల్‌కతా పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. రానున్న 24 గంటల పాటు తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం, దక్షిణ 24 పరగణ, బంకుర, ఝార్గం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ బుధవారం హెచ్చరించింది. ఒడిశాలో.. యాస్ ప్రభావంతో ఒడిశాలో, ముఖ్యంగా భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ నోటీస్ జారీ చేసింది. -
Cyclone Yaas: 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం
సాక్షి, అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్న 'యాస్' తుపాను ఒడిశాలోని పారాదీప్‌కు 220 కిలోమీటర్ల దూరంలో.. బాలాసోర్‌కు ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో బెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయదిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యిందని తెలిపారు. యాస్ తుపాను రేపు ఉత్తర ఒడిశా - బెంగాల్ సాగర్‌ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు అధికారులు. తుపాను ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలు, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తుపాను ప్రభావం వల్ల గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. ఈ క్రమంలో విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండోనెంబర్ ప్రమాద హెచ్చరికలు.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. -
అతి తీవ్ర తుపానుగా మారనున్న 'యాస్' తుపాను
న్యూఢిల్లీ : తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. 'యాస్' తుపాను మరో 12 గంటల్లో బలపడి తీవ్ర తుపానుగా.. 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో 620 కి.మీ దూరంలో.. పోర్ట్‌బ్లేయర్‌కు వాయవ్య దిశలోనూ.. 530 కి.మీ ఒడిశాలోని పారదీప్‌కు అగ్నేయ దిశలో.. 620 కి.మీ వాయవ్య దిశలో బెంగాల్ వైపు కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయవ్య దిశగా తుపాన్ పయనిస్తోంది. 26న ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటనుంది. గంటకు 155 కి.మీ నుంచి 185 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. తీరం దాటిన తర్వాత రాంచీ వైపుగా తుపాను పయనించనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు తుపాను హెచ్చరికలు సాక్షి, శ్రీకాకుళం : 'యాస్' తుపాను ప్రభావం నేపథ్యంలో కలెక్టర్ తుపాను హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం నుంచి తీరం వెంబడి..గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఆయన తెలిపారు. ఆక్సిజన్ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా చూడాలని, రైతులు పంటలను కోత కోసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా.. విద్యుత్ పునరుద్ధరణ, వైద్య శిబిరాల ఏర్పాటుపై సిద్ధంగా ఉండాలన్నారు. -
Narendra Modi: సత్వరం తరలించండి
న్యూఢిల్లీ: పెను తుపానుగా విధ్వంసం సృష్టించే అవకాశమున్న ‘యాస్’ను ఎదుర్కొనే సంసిద్ధతపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సహాయ చర్యలు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని, ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తుపాను ప్రభావం పడనున్న రాష్ట్రాలను, సంబంధిత కేంద్ర సంస్థలను ఆదేశించారు. విద్యుత్, టెలికం సేవలు నిలిచిపోతే, సాధ్యమైనంత త్వరగా వాటిని పునరుద్ధరించాలని సూచించారు. తుపాను కారణంగా కోవిడ్– 19 పేషెంట్ల చికిత్సకు, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలగకుండా సమన్వయంతో, ప్రణాళకతో పనిచేయాలని కోరారు. మే 26 సాయంత్రానికి ఉత్తర ఒడిషా, పశ్చిమబెంగాల్ మధ్య యాస్ తుపాను తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తుపాను ప్రభావం పడనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితిని కేంద్ర హోంశాఖ నిశితంగా పరిశీలిస్తోందని, అవసరమైన ప్రాంతాలకు సహాయ బృందాలను తరలించడానికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి 46 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని వెల్లడించింది. మరికొన్ని బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని తెలిపింది. గాలింపు, రక్షణ, సహాయ చర్యల కోసం నౌకాదళం, తీర రక్షకదళం నౌకలు, హెలికాప్టర్లతో సిద్ధంగా ఉందని పీఎంఓ తెలిపింది. అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. సహాయ చర్యల కోసం 11 రవాణా విమానాలను, 25 చాపర్లను సిద్ధంగా ఉంచామని వైమానిక దళం తెలిపింది. ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు, విద్యుత్, టెలీకాం సేవల పునరుద్ధరణ, కోవిడ్ రోగుల చికిత్స, వ్యాక్సినేషన్.. వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరానని అనంతరం ప్రధాని ట్వీట్ చేశారు. అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. సిద్ధంగా ఉన్నాం తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ కోరారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు చర్యలను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. తుపాను ప్రభావం తక్కువ ఉండే అవకాశమున్న ప్రాంతాల్లోనూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన దానికన్నా రెండింతలు సిద్ధంగా ఉండడం వల్ల నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేయవచ్చని గత అనుభవాలు చెబుతున్నాయన్నారు. పశ్చిమబెంగాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కో బృందంలో 47 మంది సుశిక్షిత సిబ్బంది ఉంటారని తెలిపారు. రాష్ట్రాల్లో విపత్తు సహాయక బృందాల సామర్థ్యంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో వారికి సరైన శిక్షణ కూడా లేదన్నారు. ఈ విషయంలో ఒడిశా మాత్రం అద్భుతంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు.