భువనేశ్వర్: యాస్ తుపానుతో రాష్ట్రంలో రూ.610 కోట్ల నష్టం సంభవించింది. రూ. 520 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు నష్టపోగా ప్రభుత్వేతర ఆస్తులకు రూ.90కోట్ల నష్టం వాటిల్లిందని పలు విభాగాల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు వివరించారు. యాస్ తుపాను నష్టం, పునరుద్ధరణ కార్యకలాపాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆన్‌లైన్‌లో గురువారం సమీక్షించారు.
అధికారులకు అభినందనలు
ప్రభుత్వ అధికారులు, ప్రభావిత జిల్లా యంత్రాంగం అద్భుతమైన కార్యాచరణతో ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తులను పరిరక్షించారని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలు అత్యంత స్వల్ప వ్యవధిలో ముగించడం విశేషమని మెచ్చుకున్నారు. యాస్ తుపాను తీరం తాకే ముందు, తాకే సమయం, తదనంతర పరిస్థితుల్లో చేపట్టిన సమగ్ర విపత్తు నిర్వహణ దస్తావేజులతో భద్రపరిస్తే భావి విపత్తు నిర్వహణ వ్యవహారాల్లో మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు.
జల దిగ్బంధంలో 500 గ్రామాలు
సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో మాట్లాడుతు యాస్ తుపాను ప్రభావంతో సమగ్రంగా 150 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమద్రపు నీరు పొలాల్లోకి వచ్చి పంటలకు నష్టం కలిగించింది. తుపాను తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగు నీరు సరఫరా పునరుద్ధరణకు 1,000 డీజీ సెట్లతో ట్యాంకర్లు, పీవీసీ ట్యాంకులు వినియోగించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో ప్రాణ హాని నినాదంతో యాస్ తుపాను విపత్తు నిర్వహణ కోసం నిరంతరం కృషి చేసినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు.
పంటలపై తుపాను ప్రభావం
యాస్ తుపాను తీవ్రతతో కోస్తా ప్రాంతంలోని పొలాల్లోకి సముద్రపు నీరు చొరబడింది. దీని ప్రభావం ఖరీఫ్ సాగుపై పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితులపై ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం, కేంద్రీయ వరి పరిశోధన సంస్థ పరిశోధన చేసి రైతాంగానికి సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎస్సార్సీ ప్రతిపాదించారు.
ముగిసిన విద్యుత్ పునరుద్ధరణ
యాస్ తుపానుతో 30 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ప్రభావితమయ్యారని ఆ విభాగం కార్యదర్శి తెలిపారు. 99.8 శాతం వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కార్యకలాపాలు ముగిశాయి. 230 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పునరుద్ధరించారు. విద్యుత్ విభాగానికి రూ.150 కోట్ల నష్టం సంభవించిందని వివరించారు.
రహదారులు ఛిన్నాభిన్నం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మే 31వ తేదీ నాటికి గొట్టపు బావులు, కుళాయి నీరు సరఫరా, పారిశుద్ధ్యం కార్యకలాపాలు ముగించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీరు విభాగం తెలిపింది. యాస్ తుపాను 8 నగర, పట్టణ ప్రాంతాల్లో 58 రహదారుల్ని ఛిన్నాభిన్నం చేసింది. తుపాను ఉద్ధృతితో సముద్ర తీరం, నదీ గట్లు కోతకు గురవడంతో జల వనరుల విభాగానికి రూ.108 కోట్లు, రోడ్లు–భవనాల శాఖకు రూ.246 కోట్లు, గ్రామీణ అభివృద్ధి విభాగానికి రూ.60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా విభాగాలు వివరించాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్‌చంద్ర మహాపాత్రో, ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా, యాస్ ప్రభావిత జిల్లాలు బాలాసోర్, భద్రక్, మయూర్‌భంజ్, కేంద్రాపడా కలెక్టర్లు, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పాల్గొన్నారు.
యాస్ తుపానుతో ఒడిశాలో తీవ్ర నష్టం
Published Fri, Jun 4 2021 9:43 AM | Last Updated on Fri, Jun 4 2021 2:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment