
చందుర్తి (వేములవాడ): పూజారి సూచించిన చోట.. మూఢ నమ్మకంతో తవ్విన బోరువెల్.. భగీరథ పైపులైన్‌ను పగుల గొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడ పల్లిలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. మూడ పల్లికి చెందిన ఓ రైతు సాగునీటి కోసం బోరు వేయాలని ఓ పూజారిని ఆశ్రయించాడు.
ఆ పూజారి కొబ్బరికాయను చేతిలో పెట్టుకొని.. నీటి ఊటల కోసం పొలంలో కలియతిరిగాడు. సరిగ్గా మిషన్‌భగీరథ పైపులైన్ వెళ్లిన ప్రదేశంలో నీరు ఉందని.. అక్కడ బోరు వేయాలని సూచించాడు. పూజారి సూచనలతో బోరు వేయించగా.. భూమి లోపలి నుంచి వెళ్తున్న మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరంతా వృధాగా పోయింది. పైపులైన్ పగిలినట్లు గుర్తించిన బోర్‌వెల్ వాహన నిర్వాహకుడు.. తమపై ఎక్కడ పోలీస్ కేసు నమోదవుతుందోనన్న భయంతో.. వాహనంతో సహా పరారయ్యాడు. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న అధికారులు పైపులైన్‌కు మరమ్మతులు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించారు.