దేశవ్యాప్తంగా 55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్‌లను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తొలగించింది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ దాని దుర్వినియోగం, సైబర్ మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటోంది.
టెలికాం వినియోగదారుల భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటుకు తెలియజేసింది. నకిలీ, ఫోర్జరీ ధ్రువపత్రాలతో పొందిన మోసపూరిత మొబైల్ కనెక్షన్‌లను గుర్తించి తొలగించడానికి ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.
రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ వినియోగదారులు తమ పేరుతో జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్‌లను సరిచూసుకుని మోసపూరితమైన, అవసరం లేని కనెక్షన్‌లను నివేదించడానికి అనుమతించే సంచార్ సాథీ పోర్టల్‌ను రూపొందించినట్లు వివరించారు. మొబైల్ కనెక్షన్‌లను విక్రయించేందుకు ఇప్పటికే ఉన్న కేవైసీ మార్గదర్శకాలను మరింత బలోపేతం చేస్తూ టెలికాం కంపెనీలకు సూచనలిచ్చినట్లు చెప్పారు.
55.5 లక్షల మొబైల్ కనెక్షన్ల తొలగింపు
అంతేకాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎస్సెమ్మెస్ ఆధారిత సైబర్ మోసాలను 36 శాతం కట్టడి చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న చర్యల ఫలితంగా సుమారు 4 లక్షల మంది పౌరులు సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోకుండా రూ. 1,000 కోట్లకు పైగా రక్షణ కల్పించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన అలాగే 55.5 లక్షల మొబైల్ కనెక్షన్‌లు తొలగించినట్లు వివరించారు.
వీటిలో బ్యాంక్‌లు, పేమెంట్ వాలెట్లకు లింక్ అయిన మొబైల్ కనెక్షన్‌లు 9.8 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వినియోగదారులు నివేదించిన 13.4 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లు రీ వెరిఫికేషన్‌లో విఫలమవడంతో డిస్‌కనెక్ట్ చేసినట్లు చెప్పింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నివేదించిన ప్రకారం సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు మొత్తం 2.8 లక్షల మొబైల్ కనెక్షన్‌లు తొలగించడంతోపాటు 1.3 లక్షల మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేసినట్లు కేంద్ర అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment