ఇలా జరుగుతోంది జాగ్రత్త.. ఈపీఎఫ్‌వో వార్నింగ్‌ | EPFO Warning issued for ​​members ignoring it will cost more than expected | Sakshi
Sakshi News home page

ఇలా జరుగుతోంది జాగ్రత్త.. ఈపీఎఫ్‌వో వార్నింగ్‌

Published Fri, Jan 10 2025 10:48 AM | Last Updated on Fri, Jan 10 2025 3:26 PM

EPFO Warning issued for ​​members ignoring it will cost more than expected

మీరు జాబ్ హోల్డర్ అయిఉండి ఈపీఎఫ్‌వో (EPFO) ​​కిందకు వస్తే ఈ వార్త మీకోసమే. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాల (Cyber frauds) కేసుల దృష్ట్యా, దేశంలోని సంఘటిత రంగాలలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్‌వో ​​విజ్ఞప్తి చేసింది.

ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో ఖాతాకు సంబంధించిన రహస్య సమాచారం అంటే యూఏఎన్ నంబర్ (UAN), పాస్‌వర్డ్, పాన్ నంబర్ (PAN), ఆధార్ నంబర్ (Aadhaar), బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ (OTP) వంటి వాటిని ఎవరితోనూ పంచుకోకూడదని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో తన అధికారిక ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్ చేసింది

ఆ వివరాలు చెప్పొద్దు
ఈపీఎఫ్‌వో తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ‘ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి ఖాతాకు సంబంధించిన వివరాలను ఏ ఉద్యోగిని అడగదు. ఒకవేళ ఈపీఎఫ్‌వో ఉద్యోగినని చెప్పుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మీ ఈపీఎఫ్‌వో ​​ఖాతాకు సంబంధించిన యూఏఎన్‌ నంబర్, పాస్‌వర్డ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని అడిగినా.. ఫోన్‌, మెసేజ్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా ఓటీపీలు చెప్పాలని కోరినా ఎలాంటి సమాచారం ఇవ్వవద్దు’ అని అప్రమత్తం చేసింది.

వెంటనే ఫిర్యాదు చేయండి
‘ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. మీరు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి ఈపీఎఫ్‌ ఖాతాలో  దాచుకున్న డబ్బును వారు దోచుకునే ప్రమాదం ఉంది. ఈపీఎఫ్‌వో ఉద్యోగినని చెప్పుకుంటూ ఎవరైనా మిమ్మల్ని యూఏఎన్‌ నంబర్, పాస్‌వర్డ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ అడిగితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు, సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేయండి’ అని సూచించింది.

వ్యక్తిగత డివైజ్‌లనే వాడండి
ఈపీఎఫ్‌ ఖాతాను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి సైబర్ కేఫ్ లేదా పబ్లిక్ డివైజ్‌ని ఉపయోగించొద్దని ఈపీఎఫ్‌వో సూచించింది. ఈపీఎఫ్‌వో  ఖాతాకు సంబంధించిన ఏ పని కోసమైనా ఎల్లప్పుడూ ల్యాప్‌టాప్, కంప్యూటర్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్ వంటి మీ వ్యక్తిగత పరికరాన్నే ఉపయోగించండి. సైబర్ మోసం నుండి సురక్షితంగా ఉండే మార్గాల గురించి ఈపీఎఫ్‌వో ​​తన వెబ్‌సైట్ ద్వారా సభ్యులకు నిరంతరం తెలియజేస్తూనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement