న్యూఢిల్లీ: ఇబ్బందికర సందేశాలను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు ప్రారంభించింది. టెలిమార్కెటింగ్ సందేశాల టెంప్లేట్‌ల దుర్వినియోగంపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ శుక్రవారం ఆదేశించింది. కంపెనీల హెడర్‌లు, కంటెంట్ టెంప్లేట్‌లను కొంతమంది టెలిమార్కెటర్లు దుర్వినియోగం చేస్తున్నారని తాము గుర్తించామని తెలిపింది.
‘తాము కోరని వాణిజ్య ప్రకటనలు అందుకోవడం అనేది ప్రజల అసౌకర్యానికి ప్రధాన మూలం. వ్యక్తుల గోప్యతకు ఇవి ఆటంకం కలిగిస్తాయి. వీటిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని ట్రాయ్ తెలిపింది. టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018 కింద మెసేజ్ టెంప్లేట్‌ల దుర్వినియోగాన్ని ఆపడానికి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అధీకృత టెలిమార్కెటింగ్ కంపెనీలు సందేశాల కోసం మొబైల్ నంబర్లకు బదులుగా కంపెనీ పేరును సూచించే హెడర్‌లను ప్రదర్శిస్తాయి.
టెలిమార్కెటింగ్ సందేశాల శీర్షికలు, కంటెంట్ టెంప్లేట్‌ల విధానంలో (కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్) మార్పులు చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఇతర కంపెనీల పేర్లను పోలిన మెసేజ్ టైటిల్స్, హెడర్‌లు వినియోగదార్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ లాభాల కోసం వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రాయ్ స్పష్టం చేసింది.
బ్లాక్‌చెయిన్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదైన అన్ని హెడర్‌లను 30 రోజుల్లోపు తిరిగి ధృవీకరించాలని.. ధృవీకరించని హెడర్‌లను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. 30 రోజుల పాటు ఉపయోగించని అన్ని హెడర్‌లను తాత్కాలికంగా నిష్క్రియం (డీయాక్టివేట్) చేయడానికి 60 రోజుల్లోపు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment