న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలోగా కొత్త జాతీయ టెలికం విధానాన్ని (ఎన్‌టీపీ) ఖరారు చేసే ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం చర్చాపత్రాన్ని విడుదల చేసింది. టెలికం ఆపరేటర్లు, పరికరాల తయారీ సంస్థలు, పరిశ్రమ వర్గాలు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు మొదలైన వారితో ప్రాథమికంగా సంప్రతింపులు జరిపిన అనంతరం తమ అభిప్రాయాలను క్రోడీకరించి ఈ చర్చాపత్రాన్ని రూపొందించినట్లు ట్రాయ్ తెలిపింది. జాతీయ టెలికం విధానంలో భాగంగా నిర్దేశించుకున్న కోటి బహిరంగ వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, 2 ఎంబీపీఎస్ కనీస డౌన్‌లోడ్ స్పీడుతో 90 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించి సగటున 20 ఎంబీపీఎస్ స్పీడు సాధించడం తదితర లక్ష్యాలను చర్చాపత్రంలో ట్రాయ్ పొందుపర్చింది.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)పై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు కమ్యూనికేషన్స్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాలు కూడా ఉన్నాయి. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలను పునఃసమీక్షించడం, దేశవ్యాప్తంగా సర్వీసులకు ఒకే లైసెన్సు విధానం, మౌలిక రంగం స్థాయిలో కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రుణ సదుపాయం అందుబాటులో ఉంచడం తదితర వ్యూహాల ద్వారా ఈ లక్ష్యాలు సాధించవచ్చని చర్చాపత్రంలో ట్రాయ్ వివరించింది. చర్చాపత్రంలో పొందుపర్చిన అంశాలపై సంబంధిత వర్గాలు జనవరి 19లోగా తమ అభిప్రాయాలు రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి కొత్త టెలికం విధానాన్ని ఖరారు చేయాలని టెలికం శాఖ యోచిస్తోంది.
కొత్త టెలికం పాలసీపై కసరత్తు
Published Thu, Jan 4 2018 12:23 AM | Last Updated on Thu, Jan 4 2018 8:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment