కాల్ డ్రాప్‌కి రూపాయి పరిహారం..
టెల్కోలకు ట్రాయ్ ఆదేశం
♦ జనవరి 1 నుంచి అమల్లోకి
♦ దీనివల్ల రోజుకు రూ. 150 కోట్ల భారం..
♦ టెలికం కంపెనీల ఆక్రోశం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో డ్రాప్ అయిన ప్రతి కాల్‌కి టెలికం కంపెనీలు రూ. 1 చొప్పున మొబైల్ యూజర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రోజుకు గరిష్టంగా మూడు కాల్ డ్రాప్స్‌కి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు టెలికం వినియోగదారుల హక్కుల పరిరక్షణ నిబంధనలను సవరిస్తూ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. టెలికం నెట్‌వర్క్‌లో సమస్యల కారణంగా కాల్ పూర్తి కాకుండా మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అయిపోవడాన్ని కాల్ డ్రాప్‌గా వ్యవహరిస్తారు.
ట్రాయ్ నిర్ణయాన్ని స్వాగతించిన టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్.. పెనాల్టీల భారం పడకుండా చూసుకునేందుకైనా టెల్కోలు ఇకపై సర్వీసులు మరింత మెరుగుపర్చుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్ డ్రాప్ సమస్య పరిష్కారంపై కంపెనీలు శ్రద్ధ పెట్టాలని, పెనాల్టీ విధించాల్సిన అవసరం తలెత్తకూడదని తాను ఆశిస్తున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం కాల్ డ్రాప్ అయిన పక్షంలో యూజరు ఖాతాకు జమ చేసిన పరిహారాన్ని సదరు కస్టమర్లకు నాలుగు గంటల్లోగా ఆపరేటరు తెలియజేయాల్సి ఉంటుంది.
పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల విషయంలో తదుపరి బిల్లులో చూపించాల్సి ఉంటుంది. కీలకమైన ముంబై నగరంలో ఏ ఆపరేటరు కూడా కాల్ డ్రాప్స్ విషయంలో నిర్దేశిత ప్రమాణాలను పాటించడం లేదని ట్రాయ్ అధ్యయనంలో తేలింది. ఇక ఢిల్లీలోనూ కేవలం కొన్ని సంస్థలే ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి దిగ్గజాలూ ఈ విషయంలో వెనుకబడ్డాయి.
ఇది సరైన పరిష్కారం కాదు: టెల్కోలు
కొత్త నిబంధనలపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇది సరైన పరిష్కారమార్గం కాదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత పరిష్కారాలు కొత్త సమస్యలు దారి తీయొచ్చన్నారు. దేశంలో సగం మంది యూజర్లకు కాల్ డ్రాప్ సమస్య ఎదురైన పక్షంలో కనీసం రోజుకు రూ. 150 కోట్ల చొప్పున టెలికం కంపెనీలు పరి హారం కట్టాల్సి వస్తుందని సీవోఏఐ అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టతనివ్వాలంటూ ట్రాయ్‌ను కోరనున్నట్లు మాథ్యూస్ చెప్పారు. అప్పటికీ స్పష్టత రాకుంటే, పరిహార భారం భారీగా ఉండే పక్షంలో అవసరమైతే అపీలేట్ ట్రిబ్యునల్ టీడీశాట్ కు కూడా వెడతామన్నారు. కాగా, మొబైల్ యూజరు సొంత ఆపరేటరు నెట్‌వర్క్‌లో లోపం కారణంగా కాల్ డ్రాప్ అయితేనే పరిహారం లభిస్తుందని ట్రాయ్ కార్యదర్శి సుధీర్ గుప్తా తెలిపారు.