టెల్కోల కాల్ డ్రాప్స్‌పై యూజర్లకు పరిహారం!
ట్రాయ్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’... కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించటానికి సన్నద్ధమవుతోంది. టెల్కోలు వాటి నెట్‌వర్క్ సామర్థ్యపు వివరాలను క్రమానుగతంగా తెలియజేయటంతో పాటు, కాల్ డ్రాప్స్‌పై యూజర్లకు పరిహారం చెల్లించే విధంగా నిబంధనలను రూపొందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని ప్రతిపాదనలను తయారుచేసింది. వీటి ప్రకారం.. సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డ్రాప్స్‌పై వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. టెల్కోలు కాల్ డ్రాప్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేయాలి. కాల్ డ్రాప్ సందర్భంలో టెల్కోలు యూజర్ల నుంచి ఎలాంటి చార్జీలను వసూలు చేయకూడదు.
అంటే కాల్ డ్రాప్ సమయంలో కట్ అయ్యే బ్యాలెన్స్‌ను టెల్కోలు యూజర్ల ఆకౌంట్‌కు బదిలీ చేయాలి. ట్రాయ్ తన ప్రతిపాదనలపై సెప్టెంబర్ 28 వరకు ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది. కాగా కాల్ డ్రాప్ సమస్య వినియోగదారులదే కాబట్టి వారికి పరిహారం అందాలని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. టెల్కోలు నాణ్యమైన సేవలను అందించడంలో విఫలమైతే... అప్పుడు ట్రాయ్ వాటిపై జరిమానా విధిస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. టెలికం సర్వీస్ ప్రాంతంలో ఒక నెట్‌వర్క్ సంబంధిత అన్ని కాల్స్‌లో కాల్ డ్రాప్ వాటా 2 శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లోని చాలా టెల్కోలు కాల్ డ్రాప్స్ సంబంధిత ప్రమాణాలను పాటించడం లేదని ట్రాయ్ పేర్కొంది. కాల్ డ్రాప్ సమస్య అనేది సామర్థ్యపు నిరోధానికి సంబంధించినది కాదని, కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సైట్ల ఏర్పాటుకు లేక స్పెక్ట్రమ్ కొరతకు సంబంధించిందని సీఓఏఐ అభిప్రాయపడింది.