సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: వినియోగదారుల హక్కులకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం కృత్రిమ మేధని వినియోగిస్తుండటం శుభపరిణామమని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్(ఎన్‌సీఆర్‌డీ) అధ్యక్షుడు జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ‘వినియోగదారుల హక్కులు, రక్షణ’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు.
దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శులు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు, వినియోగదారుల గ్రూపులు, ఎన్జీవోలు హాజరయ్యారు. వినియోగదారుల రక్షణ ఫ్రేమ్‌వర్క్, డెవలప్‌మెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్, ప్రెస్ మానిటరింగ్, లీగల్ మెట్రాలజీ యాక్ట్–2009 తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జస్టిస్ సాహి మాట్లాడుతూ వినియోగదారుల కమిషన్ గత ఏడాది 1.26 లక్షల కేసులు పరిష్కరించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1.36 లక్షల కేసులు పరిష్కరించడం శుభపరిణామమని చెప్పారు. కేసుల పరిష్కారం కోసం కాన్ఫోనెట్ 2.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. దీనిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. వినియోగదారులు 17 ప్రాంతీయ భాషల్లో ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. ప్రతి నెలా వినియోగదారుల హక్కుల కంట్రోల్ రూమ్‌కు లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలకు తమ హక్కుల పట్ల అవగాహన పెరిగిందని, ఇది స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్, ప్రత్యేక కార్యదర్శి నిధి ఖరే, ఏపీ ప్రభుత్వ కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను కాపాడటంతోపాటు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆయా రాష్ట్రాల సహకారంతో పని చేస్తోందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా తూనికలు, కొలతల పరికరాలను విక్రయించడానికి అంతర్జాతీయంగా ఆమోదించిన ఓఐఎంఎల్ సర్టిఫికెట్‌లను జారీ చేసే అథారిటీని పొందిన 13వ దేశంగా భారత్‌ను జాబితాలో చేర్చడంలో కృషి చేసిన లీగల్ మెట్రాలజీ విభాగానికి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment