Call drop issue
-
కాల్ డ్రాప్స్, నెట్వర్క్ కాల్స్ సమస్యపై టెల్కోలతో ట్రాయ్ కీలక భేటి
న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చడం, 5జీ సర్వీసుల ప్రమాణాలను నిర్దేశించడం తదితర అంశాలకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళికపై చర్చించేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ఫిబ్రవరి 17న టెల్కోలతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా కాల్ డ్రాప్స్, వ్యాపారాలపరమైన అవాంఛిత కాల్స్, సందేశాలు మొదలైన వాటి గురించి కూడా చర్చించనుంది. ట్రాయ్ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తరచుగా సమావేశాల నిర్వహణ, చర్చా పత్రాలు, బహిరంగ చర్చలు మొదలైన మార్గాల్లో సేవల నాణ్యతను సమీక్షిస్తూ ఉంటామని, తగు చర్యలు తీసుకుంటూ ఉంటామని పేర్కొంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సర్వీసుల నాణ్యతను మెరుగు పర్చేందుకు తీసుకోతగిన చర్యలపై డిసెంబర్ 28న టెల్కోలతో టెలికం శాఖ సమావేశమైంది. 2022 నవంబర్ డేటా ప్రకారం 114 కోట్ల మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌తో భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉంది. ఇప్పటివరకూ 200 పైచిలుకు నగరాల్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. -
ఎయిర్‌టెల్‌పై టాలీవుడ్ హీరో సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు సుమంత్ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌పై అసహనం వ్యక్తం చేశారు. కస్టమర్లను విసిగిస్తున్న కాల్ డ్రాప్ సమస్యపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చురకలంటించారు. ట్విటర్ ద్వారా ఎయిర్ టెల్ కాల్ డ్రాపింగ్ ఇబ్బందిపై ఎయిర్టెల్ తీరును విమర్శిస్తూ స్పందించారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఎయిర్టెల్ కాల్ డ్రాప్ వ్యవహారం తనను ఎంత ఇబ్బంది పెడుతోందో సుమంత్ చెప్పకనే చెప్పారు . ‘ఎయిర్ టెల్ సమర్పించు.. కాల్ డ్రాపింగ్ అనే కళను రెగ్యులర్‌గా విజయవంతంగా ఉపయోగిస్తోంది... అభినందనలు..’ అంటూ ట్వీట్ చేశారు. అదీ టెలికాం కంపెనీల ప్రకటన తరహాలోనే ట్వీట్ చేయడం విశేషం. ఈ ట్వీట్ పై స్పందిస్తూ నెటిజన్లు కూడా తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు. కాగా టాలీవుడ్లో గోదావరి, గోల్కొండ హైస్కూలు సినిమాలతో ఆకట్టుకున్న సుమంత్ ఆ తరువాత చాలా గ్యాప్తీసుకున్నా...మళ్లీ రావా సినిమా విజయంతో తిరిగి ఫామ్‌లో కొచ్చాడనే చెప్పుకోవచ్చు. You've successfully perfected the art of call dropping regularly. Congratulations 👏🏼🙏🏽 @Airtel_Presence — Sumanth (@iSumanth) January 10, 2018 -
40వేల వైఫై హాట్‌స్పాట్స్: బీఎస్ఎన్ఎల్
ఇండోర్: దేశవ్యాప్తంగా 40,000 పైచిలుకు వై-ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. 4జీ సర్వీసులు అందించేందుకు కావల్సిన స్పెక్ట్రం తమ వద్ద లేదని, దీంతో ప్రత్యామ్నాయంగా వై-ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సర్వీసులు 4జీ కన్నా వేగంగా ఉంటాయన్నారు. ఈ స్కీము కింద ప్రస్తుతం 500 హాట్‌స్పాట్స్‌ను నెలకొల్పామని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటిని 2,500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని శ్రీవాస్తవ తెలిపారు. ఇక, టెలికం సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రూ. 5,500 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 25,000 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆరోగ్యానికి హానికరమైన రేడియేషన్ వస్తుందనే అపోహతో మొబైల్ టవర్ల ఏర్పాటుకు వ్యతిరేకత వస్తుండటం వల్ల కూడా కాల్ డ్రాప్ సమస్య తీవ్రమవుతుండటానికి కారణమన్నారు. -
కాల్ డ్రాప్‌కి రూపాయి పరిహారం..
టెల్కోలకు ట్రాయ్ ఆదేశం ♦ జనవరి 1 నుంచి అమల్లోకి ♦ దీనివల్ల రోజుకు రూ. 150 కోట్ల భారం.. ♦ టెలికం కంపెనీల ఆక్రోశం న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో డ్రాప్ అయిన ప్రతి కాల్కి టెలికం కంపెనీలు రూ. 1 చొప్పున మొబైల్ యూజర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రోజుకు గరిష్టంగా మూడు కాల్ డ్రాప్స్‌కి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు టెలికం వినియోగదారుల హక్కుల పరిరక్షణ నిబంధనలను సవరిస్తూ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. టెలికం నెట్‌వర్క్‌లో సమస్యల కారణంగా కాల్ పూర్తి కాకుండా మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అయిపోవడాన్ని కాల్ డ్రాప్‌గా వ్యవహరిస్తారు. ట్రాయ్ నిర్ణయాన్ని స్వాగతించిన టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్.. పెనాల్టీల భారం పడకుండా చూసుకునేందుకైనా టెల్కోలు ఇకపై సర్వీసులు మరింత మెరుగుపర్చుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్ డ్రాప్ సమస్య పరిష్కారంపై కంపెనీలు శ్రద్ధ పెట్టాలని, పెనాల్టీ విధించాల్సిన అవసరం తలెత్తకూడదని తాను ఆశిస్తున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం కాల్ డ్రాప్ అయిన పక్షంలో యూజరు ఖాతాకు జమ చేసిన పరిహారాన్ని సదరు కస్టమర్లకు నాలుగు గంటల్లోగా ఆపరేటరు తెలియజేయాల్సి ఉంటుంది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల విషయంలో తదుపరి బిల్లులో చూపించాల్సి ఉంటుంది. కీలకమైన ముంబై నగరంలో ఏ ఆపరేటరు కూడా కాల్ డ్రాప్స్ విషయంలో నిర్దేశిత ప్రమాణాలను పాటించడం లేదని ట్రాయ్ అధ్యయనంలో తేలింది. ఇక ఢిల్లీలోనూ కేవలం కొన్ని సంస్థలే ప్రమాణాలు పాటిస్తున్నాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ వంటి దిగ్గజాలూ ఈ విషయంలో వెనుకబడ్డాయి. ఇది సరైన పరిష్కారం కాదు: టెల్కోలు కొత్త నిబంధనలపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇది సరైన పరిష్కారమార్గం కాదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత పరిష్కారాలు కొత్త సమస్యలు దారి తీయొచ్చన్నారు. దేశంలో సగం మంది యూజర్లకు కాల్ డ్రాప్ సమస్య ఎదురైన పక్షంలో కనీసం రోజుకు రూ. 150 కోట్ల చొప్పున టెలికం కంపెనీలు పరి హారం కట్టాల్సి వస్తుందని సీవోఏఐ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టతనివ్వాలంటూ ట్రాయ్‌ను కోరనున్నట్లు మాథ్యూస్ చెప్పారు. అప్పటికీ స్పష్టత రాకుంటే, పరిహార భారం భారీగా ఉండే పక్షంలో అవసరమైతే అపీలేట్ ట్రిబ్యునల్ టీడీశాట్ కు కూడా వెడతామన్నారు. కాగా, మొబైల్ యూజరు సొంత ఆపరేటరు నెట్‌వర్క్‌లో లోపం కారణంగా కాల్ డ్రాప్ అయితేనే పరిహారం లభిస్తుందని ట్రాయ్ కార్యదర్శి సుధీర్ గుప్తా తెలిపారు. -
టెల్కోల కాల్ డ్రాప్స్‌పై యూజర్లకు పరిహారం!
ట్రాయ్ ప్రతిపాదన న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’... కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించటానికి సన్నద్ధమవుతోంది. టెల్కోలు వాటి నెట్వర్క్ సామర్థ్యపు వివరాలను క్రమానుగతంగా తెలియజేయటంతో పాటు, కాల్ డ్రాప్స్‌పై యూజర్లకు పరిహారం చెల్లించే విధంగా నిబంధనలను రూపొందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని ప్రతిపాదనలను తయారుచేసింది. వీటి ప్రకారం.. సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డ్రాప్స్‌పై వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. టెల్కోలు కాల్ డ్రాప్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేయాలి. కాల్ డ్రాప్ సందర్భంలో టెల్కోలు యూజర్ల నుంచి ఎలాంటి చార్జీలను వసూలు చేయకూడదు. అంటే కాల్ డ్రాప్ సమయంలో కట్ అయ్యే బ్యాలెన్స్‌ను టెల్కోలు యూజర్ల ఆకౌంట్‌కు బదిలీ చేయాలి. ట్రాయ్ తన ప్రతిపాదనలపై సెప్టెంబర్ 28 వరకు ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది. కాగా కాల్ డ్రాప్ సమస్య వినియోగదారులదే కాబట్టి వారికి పరిహారం అందాలని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. టెల్కోలు నాణ్యమైన సేవలను అందించడంలో విఫలమైతే... అప్పుడు ట్రాయ్ వాటిపై జరిమానా విధిస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. టెలికం సర్వీస్ ప్రాంతంలో ఒక నెట్వర్క్ సంబంధిత అన్ని కాల్స్‌లో కాల్ డ్రాప్ వాటా 2 శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లోని చాలా టెల్కోలు కాల్ డ్రాప్స్ సంబంధిత ప్రమాణాలను పాటించడం లేదని ట్రాయ్ పేర్కొంది. కాల్ డ్రాప్ సమస్య అనేది సామర్థ్యపు నిరోధానికి సంబంధించినది కాదని, కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సైట్ల ఏర్పాటుకు లేక స్పెక్ట్రమ్ కొరతకు సంబంధించిందని సీఓఏఐ అభిప్రాయపడింది. -
‘కాల్ డ్రాప్స్’ టెల్కోలపై జరిమానా యోచన
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ కష్టాలు తగ్గే అవకాశాలు కనిపించకపోతుండటంతో.. టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ సమస్య మీద ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై టెల్కోల ప్రమోటర్లకు వ్యక్తిగత లేఖలు పంపాలని యోచిస్తోంది. ఒకవేళ సేవల నాణ్యత మెరుగుపడకపోయిన పక్షంలో లెసైన్సు నిబంధనల ప్రకారం పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఆపరేటర్లకు తెలియజేస్తామని టెలికం శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కాల్ డ్రాప్స్ సమస్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్.. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వర్గాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే దీనిపై ప్రధాని ప్రస్తావించిన సమస్యలను టెల్కోలకు తెలియజేయాలంటూ టెలికం శాఖ కార్యదర్శి రాకేశ్ గర్గ్‌కు ప్రసాద్ సూచించినట్లు సమాచారం. ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవడానికి తగినంత పెట్టుబడులు పెట్టడం లేదని ప్రసాద్ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కాల్ డ్రాప్స్ కష్టాలను తగ్గించే దిశగా నెట్వర్క్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు 30-45 రోజుల సమయం కావాలని టెలికం కంపెనీలు కోరినట్లు వివరించాయి. ప్రభుత్వం తన వంతు తోడ్పాటు అందిస్తుందని, ఆపరేటర్లు కూడా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమావేశం అనంతరం ప్రసాద్ తెలిపారు. ఫోన్ కాల్ మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అయిపోతుండటాన్ని కాల్ డ్రాప్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తగినంత స్పెక్ట్రం ఇవ్వకపోవడం వల్ల సేవలు మెరుగుపర్చలేకపోతున్నామంటూ టెల్కోలు ఆరోపిస్తుండగా.. టెలికం కంపెనీలు తగినంతగా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందంటూ కేంద్రం చెబుతోంది. -
టెల్కోల స్పెక్ట్రం షేరింగ్‌కు ఆమోదం
న్యూఢిల్లీ : కాల్ డ్రాప్ సమస్యను తగ్గించే దిశగా ఒకే బ్యాండ్‌విడ్త్‌లో టెలికం స్పెక్ట్రం షేరింగ్ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. టెలికం సంస్థలు స్పెక్ట్రంను పరస్పరం ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే స్పెక్ట్రం లీజింగ్‌కు మాత్రం అనుమతించలేదు. అటు టెలికం రంగంలో స్థిరీకరణకు కీలకమైన స్పెక్ట్రం ట్రేడింగ్ నిబంధనలపైనా నిర్ణయం తీసుకోలేదు. ఒకే తరహా బ్యాండ్‌లో స్పెక్ట్రం కలిగి ఉన్న రెండు టెలికం కంపెనీలు మాత్రమే షేరింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. మార్కెట్ రేటు చెల్లించి తీసుకున్న స్పెక్ట్రంను కూడా షేరింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మొబైల్ టవర్లు వంటి వాటిని మాత్రం టెలికం ఆపరేటర్లు షేర్ చేసుకోవడానికి వీలుంది.