‘కాల్ డ్రాప్స్’ టెల్కోలపై జరిమానా యోచన
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ కష్టాలు తగ్గే అవకాశాలు కనిపించకపోతుండటంతో.. టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ సమస్య మీద ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై టెల్కోల ప్రమోటర్లకు వ్యక్తిగత లేఖలు పంపాలని యోచిస్తోంది. ఒకవేళ సేవల నాణ్యత మెరుగుపడకపోయిన పక్షంలో లెసైన్సు నిబంధనల ప్రకారం పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఆపరేటర్లకు తెలియజేస్తామని టెలికం శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కాల్ డ్రాప్స్ సమస్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్.. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ వర్గాలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగానే దీనిపై ప్రధాని ప్రస్తావించిన సమస్యలను టెల్కోలకు తెలియజేయాలంటూ టెలికం శాఖ కార్యదర్శి రాకేశ్ గర్గ్‌కు ప్రసాద్ సూచించినట్లు సమాచారం. ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవడానికి తగినంత పెట్టుబడులు పెట్టడం లేదని ప్రసాద్ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కాల్ డ్రాప్స్ కష్టాలను తగ్గించే దిశగా నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు 30-45 రోజుల సమయం కావాలని టెలికం కంపెనీలు కోరినట్లు వివరించాయి. ప్రభుత్వం తన వంతు తోడ్పాటు అందిస్తుందని, ఆపరేటర్లు కూడా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమావేశం అనంతరం ప్రసాద్ తెలిపారు. ఫోన్ కాల్ మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అయిపోతుండటాన్ని కాల్ డ్రాప్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తగినంత స్పెక్ట్రం ఇవ్వకపోవడం వల్ల సేవలు మెరుగుపర్చలేకపోతున్నామంటూ టెల్కోలు ఆరోపిస్తుండగా.. టెలికం కంపెనీలు తగినంతగా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందంటూ కేంద్రం చెబుతోంది.