Telecom Minister Ravi Shankar Prasad
-
టెలికం మంత్రితో టాటా సన్స్ చంద్రశేఖరన్ భేటీ
న్యూఢిల్లీ: టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టెలికం శాఖ మదింపు ప్రకారం గతంలో టాటా గ్రూపు అందించిన టెలికం సేవలపై బకాయిలు రూ.14,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, టాటా గ్రూపు రూ.2,197 కోట్ల వరకు చెల్లింపులు చేసింది. వాస్తవ బకాయిలు ఈ మేరకేనని స్పష్టం చేసింది. దీంతో టాటా మదింపును ప్రశ్నిస్తూ.. పూర్తి బకాయిల చెల్లింపును కోరుతూ టెలికం శాఖ మరో నోటీసును జారీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో టెలికం మంత్రితో చంద్రశేఖరన్ భేటీ కావడం ప్రాధాన్యం నెలకొంది. 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రశేఖరన్ స్పందించకుండానే వెళ్లిపోయారు. చదవండి : టెలికంలో అసాధారణ సంక్షోభం వోడాఫోన్ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్ ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం -
2017 నుంచి అన్ని ఫోన్లకూ పానిక్ బటన్
న్యూఢిల్లీ: ప్రమాద సమయాల్లో అత్యవసర ఫోన్‌కాల్స్‌ను మరింత సులభంగా చేసేందుకు వీలుగా 2017 జనవరి 1 నుంచి భారత్‌లో అమ్మే అన్ని ఫోన్లకు పానిక్ బటన్ ఉండాల్సిందేనన్న నిబంధనను తీసుకొచ్చినట్లు టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2018 జనవరి 1 నుంచి జీపీఎస్ కూడా కచ్చితంగా ఉండాలన్నారు. ఏప్రిల్ 22న విడుదలైన ఒక ప్రకటన ప్రకారం ఫీచర్ ఫోన్లలో 5 లేదా 9 నంబరు బటన్లను అత్యవసర కాల్స్ చేసే పానిక్ బటన్‌గా వాడాలి. -
వచ్చే ఏడాది 50 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వచ్చే ఏడాది 50 కోట్లకు చేరుతుందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం 40 కోట్ల ఇంటర్నెట్ యూజర్లున్నారని చెప్పారు. ప్రస్తుత జోరు చేస్తే వచ్చే ఏడాదిలోనే ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలియజేశారు. రానున్న సంవత్సరాల్లో ఆప్టికల్ ఫైబర్ ద్వారా రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక గ్రామాన్ని డిజిటల్ విలేజ్‌గా ఎంపిక చేసి, టెక్నాలజీ సాయంతో విద్యా, ఆరోగ్య సరంక్షణ సేవలందిస్తామని, వర్చువల్ క్లాస్‌రూమ్‌గా పనిచేసేలా రిసోర్స్ సెంటర్‌గా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దుతామని, వై-ఫై సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. -
‘కాల్ డ్రాప్స్’ టెల్కోలపై జరిమానా యోచన
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ కష్టాలు తగ్గే అవకాశాలు కనిపించకపోతుండటంతో.. టెలికం ఆపరేటర్లపై జరిమానా విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ సమస్య మీద ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై టెల్కోల ప్రమోటర్లకు వ్యక్తిగత లేఖలు పంపాలని యోచిస్తోంది. ఒకవేళ సేవల నాణ్యత మెరుగుపడకపోయిన పక్షంలో లెసైన్సు నిబంధనల ప్రకారం పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఆపరేటర్లకు తెలియజేస్తామని టెలికం శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కాల్ డ్రాప్స్ సమస్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్.. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వర్గాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే దీనిపై ప్రధాని ప్రస్తావించిన సమస్యలను టెల్కోలకు తెలియజేయాలంటూ టెలికం శాఖ కార్యదర్శి రాకేశ్ గర్గ్‌కు ప్రసాద్ సూచించినట్లు సమాచారం. ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవడానికి తగినంత పెట్టుబడులు పెట్టడం లేదని ప్రసాద్ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కాల్ డ్రాప్స్ కష్టాలను తగ్గించే దిశగా నెట్వర్క్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు 30-45 రోజుల సమయం కావాలని టెలికం కంపెనీలు కోరినట్లు వివరించాయి. ప్రభుత్వం తన వంతు తోడ్పాటు అందిస్తుందని, ఆపరేటర్లు కూడా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమావేశం అనంతరం ప్రసాద్ తెలిపారు. ఫోన్ కాల్ మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అయిపోతుండటాన్ని కాల్ డ్రాప్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తగినంత స్పెక్ట్రం ఇవ్వకపోవడం వల్ల సేవలు మెరుగుపర్చలేకపోతున్నామంటూ టెల్కోలు ఆరోపిస్తుండగా.. టెలికం కంపెనీలు తగినంతగా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందంటూ కేంద్రం చెబుతోంది. -
100 కోట్ల మార్క్‌ను దాటిన టెలిఫోన్ కనెక్షన్లు
న్యూఢిల్లీ: భారత్‌లో టెలిఫోన్ కనెక్షన్లు 100 కోట్ల మార్క్‌ను దాటాయి. వీటిలో మొబైల్ కనెక్షన్లు 98 కోట్లుగా ఉన్నాయి. ఈ విషయాన్ని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ టెక్నాలజీ సెంటర్ సీ-డాట్ రూపొందించిన లాంగ్ డిస్టెన్స్ వై-ఫై సిస్టమ్, సోలార్ పవర్ వై-ఫై సిస్టమ్, 100 జీబీపీఎస్ ఓఎఫ్సీ లింక్ తదితర టెలికం నెట్వర్క్ ఉత్పత్తుల ఆవిష్కరణలో భాగంగా ఆయన ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. కొత్త కనెక్షన్ల సంఖ్య ప్రతి నెలా 50-70 లక్షల వరకు ఉందని పేర్కొన్నారు. దేశంలో 30 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 50 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెల చివరకు దేశం లో 99.9 కోట్ల ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో వైర్లెస్/మొబైల్ కనెక్షన్ల సంఖ్య 97.3 కోట్లు. -
చిన్న పట్టణాల్లో బీపీవో సెంటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బీపీవో విధానాన్ని ఖరారు చేసినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 48,000 సీట్ల ఏర్పాటుకు అనుమతించినట్లు వివరించారు. జనాభా ఆధారంగా కాల్ సెంటర్లలో సీట్లను వివిధ రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కాల్ సెంటర్ల ఏర్పాటు కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించనున్నట్లు ఆయన వివరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా కాల్ సెంటర్ల కార్యకలాపాలు ప్రారంభమైతే ఐటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని వివరించారు. -
ఇండియా పోస్ట్ యాప్ షురూ
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ యాప్‌ను టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ యాప్‌లో ట్రాకింగ్, తపాలా శాఖ కార్యాలయ వివరాలు తెలుసుకోవడం, పోస్టేజ్ క్యాల్కులేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖను దేశ ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారని చెప్పారు. చివరకు మావోయిస్టులు కూడా ఎక్కడ ప్రజల మద్దతు కోల్పోతామేమోనని తపాలా నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. ఈ-కామర్స్ రంగంలో ఇండియా పోస్ట్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఈ-కామర్స్ సంస్థలు ఇండియా పోస్ట్ సేవలను వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. తపాలా శాఖలో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని హామీ ఇచ్చారు. ఇండియా పోస్ట్ దాదాపు 1.55 లక్షల తపాలా కార్యాలయాలను కలిగి ఉంది. వీటిలో 1.39 లక్షల కార్యాలయాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. -
నెట్ న్యూట్రాలిటీపై నెలలో నివేదిక
* టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడి * టెల్కోల ప్లాన్లపై సీసీఐ విచారణకూ అవకాశం న్యూఢిల్లీ: పక్షపాతరహితంగా అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్న ‘నెట్ న్యూ ట్రాలిటీ ’ అంశంపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దీన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోమవారం వెల్లడించారు. జనవరిలో ఏర్పాటైన ఈ కమిటీ ‘నెట్ న్యూట్రాలిటీ’ ప్రయోజనాలు, ప్రతికూలతలు, పరిమితులపై మరో నెలరోజుల్లోగా (మే రెండో వారంలోగా) నివేదికను సమర్పించగలదని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోగలదని చెప్పారు. ఇంటర్నెట్ అనేది అత్యద్భుత ఆవిష్కరణల్లో ఒకటని, అది ఏ ఒక్క దేశానికో, సమాజానికో పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అట్టడుగు వర్గాల వారికి కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. మరోవైపు, కొన్ని యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకునేలా ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, యూనినార్ తదితర టెలికం ఆపరేటర్లు అందిస్తున్న స్కీమ్‌లపై గుత్తాధిపత్య ధోరణులను నియంత్రించే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా గత నెలలో నెట్‌న్యూట్రాలిటీపై చర్చాపత్రాన్ని రూపొందించింది. ఇదీ వివాదం.. ఇంటర్నెట్ సర్వీసులు అందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసింది. ప్రోడక్టు డెవలపర్లు కొంత మొత్తం చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్ యూజర్లు ఉచితంగా వినియోగించుకునే విధంగా కొన్ని టెల్కోలు ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా యాప్స్, సైట్స్‌కి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అయితే, నెట్ విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు ఈ విధంగా చేయడం వల్ల ఇతర సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎయిర్టెల్ జీరో పేరిట కొత్తగా డేటా ప్లాన్ ప్రవేశపెట్టిన టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌పైనా, ఇంటర్నెట్ డాట్‌ఆర్గ్ ప్రారంభించిన ఫేస్బుక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైనా విమర్శలు వస్తున్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛను కోరుకునే వారిలో లక్షమంది పైగా యూజర్లు ‘నెట్ న్యూట్రాలిటీ’ని కాపాడాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సేవ్దిఇంటర్నెట్డాట్ఇన్ వెబ్సైట్ ద్వారా మెయిల్స్ పంపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ట్విటర్ ద్వారా నెట్ న్యూట్రాలిటీకి తన మద్దతు తెలిపారు. అయితే, తాము అందిస్తున్న కొత్త సర్వీసులు అన్ని వర్గాలకూ ప్రయోజనకరం అంటూ ఎయిర్టెల్ సమర్ధించుకుంది.