* టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడి
* టెల్కోల ప్లాన్లపై సీసీఐ విచారణకూ అవకాశం
న్యూఢిల్లీ: పక్షపాతరహితంగా అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్న ‘నెట్ న్యూ ట్రాలిటీ ’ అంశంపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దీన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోమవారం వెల్లడించారు.
జనవరిలో ఏర్పాటైన ఈ కమిటీ ‘నెట్ న్యూట్రాలిటీ’ ప్రయోజనాలు, ప్రతికూలతలు, పరిమితులపై మరో నెలరోజుల్లోగా (మే రెండో వారంలోగా) నివేదికను సమర్పించగలదని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోగలదని చెప్పారు. ఇంటర్నెట్ అనేది అత్యద్భుత ఆవిష్కరణల్లో ఒకటని, అది ఏ ఒక్క దేశానికో, సమాజానికో పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అట్టడుగు వర్గాల వారికి కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. మరోవైపు, కొన్ని యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకునేలా ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, యూనినార్ తదితర టెలికం ఆపరేటర్లు అందిస్తున్న స్కీమ్‌లపై గుత్తాధిపత్య ధోరణులను నియంత్రించే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా గత నెలలో నెట్‌న్యూట్రాలిటీపై చర్చాపత్రాన్ని రూపొందించింది.
ఇదీ వివాదం..
ఇంటర్నెట్ సర్వీసులు అందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసింది. ప్రోడక్టు డెవలపర్లు కొంత మొత్తం చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్ యూజర్లు ఉచితంగా వినియోగించుకునే విధంగా కొన్ని టెల్కోలు ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా యాప్స్, సైట్స్‌కి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అయితే, నెట్ విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్ న్యూట్రాలిటీ) టెల్కోలు ఈ విధంగా చేయడం వల్ల ఇతర సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎయిర్‌టెల్ జీరో పేరిట కొత్తగా డేటా ప్లాన్ ప్రవేశపెట్టిన టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌పైనా, ఇంటర్నెట్ డాట్‌ఆర్గ్ ప్రారంభించిన ఫేస్‌బుక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ పైనా విమర్శలు వస్తున్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛను కోరుకునే వారిలో లక్షమంది పైగా యూజర్లు ‘నెట్ న్యూట్రాలిటీ’ని కాపాడాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సేవ్‌దిఇంటర్నెట్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్ ద్వారా మెయిల్స్ పంపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ట్విటర్ ద్వారా నెట్ న్యూట్రాలిటీకి తన మద్దతు తెలిపారు. అయితే, తాము అందిస్తున్న కొత్త సర్వీసులు అన్ని వర్గాలకూ ప్రయోజనకరం అంటూ ఎయిర్‌టెల్ సమర్ధించుకుంది.
నెట్ న్యూట్రాలిటీపై నెలలో నివేదిక
Published Tue, Apr 14 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement
Advertisement