మనం బ్రిటిష్ పాలనలో ఉంటేనే బాగుండేదట!
భారత్‌పై ఫేస్‌బుక్ సభ్యుడి అక్కసు!
న్యూయార్క్: మొబైల్ ఇంటర్నెట్ టారీఫ్‌లో వివక్షకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌పై ఓ ఫేస్‌బుక్ బోర్డు మెంబర్ ఒకరు తీవ్ర అక్కసు వెళ్లగక్కాడు. భారత్ నిర్ణయం పెట్టుబడిదారులకు వ్యతిరేకమని, భారత్ ఇంకా బ్రిటిష్ పాలనలో ఉంటేనే బాగుండేదని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ఫేస్‌బుక్ బోర్డు మెంబర్ అయిన మార్క్ అండ్రీస్సెన్ ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. అతని పార్ట్‌నర్ బెనెడిక్ట్ ఎవన్స్ కూడా ట్రాయ్ నిర్ణయంపై తన విద్వేషాన్ని వెళ్లగక్కాడు.
ఆన్‌లైన్‌లో పొందే సమాచారం ఆధారంగా ఇంటర్నెట్ సేవలకు భిన్నమైన చార్జీలు వర్తింపచేయాలని పేర్కొంటూ ఫేస్‌బుక్‌తోపాటు కొందరు మొబైల్ ఆపరేటర్లు ప్రచారం చేశారు. ఫేస్‌బుక్ ఏకంగా ఫ్రీబేసిక్స్ పేరిట భారీ ప్రకటనలతో ఈ విషయంలో ప్రచారం చేసింది. అయితే ఇంటర్నెట్ సమాచారాన్ని పొందే విషయంలో ఇలాంటి వివక్షలకు ఎంతమాత్రం అంగీకరించబోమని భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తేల్చిచెప్పడంతో వాటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్ ప్రచారానికి తెరపడింది. ట్రాయ్ నిర్ణయాన్ని సామాజిక కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ఇంటర్నెట్ సమానత్వానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఫేస్‌బుక్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.