ఫేస్‌బుక్‌పై ధ్వజమెత్తిన ట్రాయ్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్రీ బేసిక్ అంశంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వ్యవహరిస్తున్న తీరుపై భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతుగా తన యూజర్ల చేత ఫేస్‌బుక్ ట్రాయ్‌కి ఈమెయిల్స్ పంపించడాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ విషయంలో ఫేస్‌బుక్ తనపై చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పికొడుతూ ఘాటైన బహిరంగ లేఖను ట్రాయ్ రాసింది.
ఫేస్‌బుక్ వ్యవహారాలకు సంబంధించి ఇండియా, దక్షిణ, మధ్య ఆసియా డైరెక్టర్ అంఖీ దాస్ పేరిట రాసిన ఈ లేఖలో ఆ వెబ్‌సైట్ తీరును ట్రాయ్ ఏకీపారేసింది. 'డాటా సర్వీసులకు విభిన్నమైన ధరలు' అంశంపై ట్రాయ్ సంధించిన నాలుగు ప్రశ్నలకు తన యూజర్ల తరఫున ఫేస్‌బుక్ తెలిపిన ప్రతిస్పందన.. అది ప్రజల స్పందన కాబోదని, ఫ్రీబేసిక్స్ కు మద్దతుగా ఫేస్‌బుక్ తన యూజర్ల స్పందనను ప్రజా స్పందనగా చిత్రించడానికి అది ప్రయత్నిస్తున్నదని ఈ లేఖలో ట్రాయ్ పేర్కొంది. తనకు ఉన్న భారీ యూజర్ల సామర్థ్యాన్ని ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్‌కు మద్దతుగా ఉపయోగించుకుంటున్నదని, ఈ వ్యవహారంలో పారదర్శకమైన నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా అర్థవంతమైన సంప్రదింపుల ప్రక్రియ కొనసాగకుండా.. కేవలం మెజారిటేరియన్ ఓపినియన్ పోల్‌లా ఇది కొనసాగాలని ఫేస్‌బుక్ భావిస్తున్నదని ట్రాయ్ ఈ లేఖలో మండిపడింది.
ఫేస్‌బుక్ చర్యలను ఆమోదిస్తే.. భారత్‌లో విధాన నిర్ణయాలపై తీవ్ర ప్రమాదకరమైన ప్రభావాలు పడే అవకాశముందని ట్రాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్ తన యూజర్ల తరఫున స్వయం నియమిత అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నదని, యూజర్లందరి తరఫున మూకుమ్మడిగా మాట్లాడేందుకు ఫేస్‌బుక్‌కు ఎలాంటి అధికారం లేదని ట్రాప్ తేల్చి చెప్పింది. గ్రామీణ ప్రాంతాల వారికి ఉచిత ఇంటర్నెట్ పేరిట ఫేస్‌బుక్ ముందుకు తీసుకొచ్చిన 'ఫ్రీబేసిక్స్' ప్రచారాన్ని ఇంటర్నెట్ సమానత్వ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.