ఫేస్ బుక్ పై కోపమా.. ట్రాయ్ పై అసహనమా?
న్యూఢిల్లీ: భారత్‌లో యూజర్లకు ఫ్రీ బేసిక్స్ ఇకపై అందుబాటులో ఉండదని ఫేస్‌బుక్ ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. ఆ మరుసటిరోజే.. తాను అమెరికాకు వెళ్లిపోతున్నానని భారత్ లో ఫేస్ బుక్ చీఫ్ గా పనిచేస్తున్న కీర్తిగా రెడ్డి ప్రకటించారు. అమెరికా నుంచి భారత్ వచ్చేటప్పుడే అనుకున్నాం.. ఏదో ఓ రోజు మా కుటుంబం మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్తుందని తెలుసునని పేర్కొన్నారు. ఏడాదిలోగా మళ్లీ భారత్ వచ్చే అవకాశం లేదని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్ (ఏపీఏసీ) విలియమ్ ఈస్టన్, డాన్ నియరీ, వీపీ ఆసియా పసిఫిక్ గా ఉన్న ఆమె కీర్తికాతో కలిసి ఫేస్ బుక్ లో పనిచేశారు. తన తర్వాత విలియమ్ ఈస్టన్ తన స్థానంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పోస్ట్ లో తెలిపారు.
'భారత్ లో ఫేస్ బుక్ తొలి ఉద్యోగిగా ఉన్నాను, ఆరేళ్లుగా ఇక్కడ పనిచేశాను. సంస్థ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటూ హైదరబాద్ నుంచి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాను' అని వివరించారు. మెన్లో పార్క్ లో ఫేస్ బుక్ కొత్త అవకాశాల కోసం పనిచేస్తానన్నారు. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా నిర్దిష్ట వెబ్‌సైట్లను ఉచితంగా అందించేలా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఫేస్‌బుక్ తలపెట్టిన ఈ సర్వీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ను బట్టి చార్జీలు విధించడం సరికాదంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయగా, ట్రాయ్ కూడా ఇందుకు అనుకూలంగా నిబంధనలు ప్రకటించింది. వివాదాస్పదమైన తమ ఫ్రీ బేసిక్స్ సర్వీసులను భారత్‌లో నిలిపివేయాలని ఫేస్‌బుక్ నిర్ణయించింది. ఆ మరుసటి రోజే భారత్ లో ఆ సంస్థ ముఖ్య అధికారిణి, డైరెక్టర్ కీర్తిగా రెడ్డి అమెరికాకు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించారు.