ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ దుకాణం బంద్!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ చార్జీల విషయంలో ఎంతమాత్రం వివక్ష ఉండరాదన్న ట్రాయ్ నిర్ణయంతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ భారత్‌లో తన ఫ్రీబేసిక్స్ ప్రచారాన్ని రద్దుచేసుకుంది. 'భారత్‌లోని ప్రజలకు ఫ్రీబేసిక్స్ పథకం అందుబాటులో ఉండబోదు' అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు గురువారం వెల్లడించారు. ఫ్రీ బేసిక్స్ పథకంలో భాగంగా ఫేస్‌బుక్‌ను ఉచితంగా అందిస్తున్న మొబైల్ ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పటికే దీనిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఫ్రీ బేసిక్స్‌ను వెనుకకు తీసుకోవాలని నిర్ణయించింది.
వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా మొబైల్ ఇంటర్నెట్ చారీలు విధించాలన్న మొబైల్ ఆపరేటర్లు, ఫేస్‌బుక్ ప్రతిపాదనను భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఫేస్‌బుక్ వంటి కొన్ని వెబ్‌సైట్లను అందించేందుకు ఫ్రీబేసిక్స్ పేరిట మొబైల్ ఆపరేటర్లతో ఒప్పందం చేసుకోవాలని ఫేస్‌బుక్ భావించింది. ఇందుకోసం భారత్‌లో తీవ్రంగా ప్రచారం కూడా చేసింది. అయితే ఫ్రీబేసిక్స్ పేరిట కొన్ని వెబ్‌సైట్లను మాత్రమే అనుమతించడం ఇంటర్నెట్ సమానత్వానికి వ్యతిరేకమంటూ స్వచ్ఛంద కార్యకర్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమానంగా అందేందుకు వీలుగా.. డాటా చార్జీల్లో వివక్షకు తెరదించుతూ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. యాక్సెస్ పొందే కంటెంట్ ఆధారంగా భిన్నమైన ధరలతో ఎవరైనా ఇంటర్నెట్ చార్జీల్లో వివక్షకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తామని ట్రాయ్ హెచ్చరించింది.