భారత్ లో ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ బంద్
న్యూఢిల్లీ: వివిధ వెబ్‌సైట్లకు వివిధ రకాల చార్జీలు విధించకుండా నెట్ న్యూట్రాలిటీకి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మద్దతు పలికిన దరిమిలా.. వివాదాస్పదమైన తమ ఫ్రీ బేసిక్స్ సర్వీసులను భారత్‌లో నిలిపివేయాలని ఫేస్‌బుక్ నిర్ణయించింది. భారత్‌లో యూజర్లకు ఫ్రీ బేసిక్స్ ఇకపై అందుబాటులో ఉండదని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా నిర్దిష్ట వెబ్‌సైట్లను ఉచితంగా అందించేలా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఫేస్‌బుక్ తలపెట్టిన ఈ సర్వీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ను బట్టి చార్జీలు విధించడం సరికాదంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయగా, ట్రాయ్ కూడా ఇందుకు అనుకూలంగా నిబంధనలు ప్రకటించింది.
‘వలసవాద’ కామెంట్లపై ఆంద్రీసెన్ సారీ ..
వలసవాద వ్యతిరేక భావజాలం పేరిట ప్రతీదాన్ని వ్యతిరేకించడం వల్లే భారత్ నష్టపోతోందంటూ చేసిన వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ బోర్డు సభ్యుడు మార్క్ ఆంద్రీసెన్ క్షమాపణ చెప్పారు. భారత రాజకీయాలు, ఆర్థికాంశాలపై ట్వీటర్‌లో తాను చేసిన వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో కూడుకున్నవని పేర్కొన్నారు. తాను నూటికి నూరు శాతం వలసవాదానికి వ్యతిరేకినని, భారత్ సహా ప్రతి దేశంలోనూ స్వాతంత్య్రం.. స్వేచ్ఛకే తన మద్దతు అని ఆంద్రీసెన్ వివరించారు. ఫ్రీ బేసిక్స్ వంటి పథకాలకు వ్యతిరేకంగా ట్రాయ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆంద్రీసెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ... ఆంద్రీసెన్ వ్యాఖ్యలతో కంపెనీకి సంబంధం లేదన్నారు. భారతదేశమన్నా, భారతీయులన్నా తనకు అపార గౌరవమని, అనేక సంవత్సరాలుగా వారు తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.