Free Basics
-
ఫ్రీ బేసిక్స్‌ను అనుమతించలేదు
న్యూఢిల్లీ: ‘నేను కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉండగా ఫేస్‌బుక్‌కు చెందిన ఫ్రీ బేసిక్స్ విధానానికి అనుమతి ఇవ్వలేదు’ అని న్యాయశాఖ, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం చెప్పారు. ‘ప్రజలు ఇంటర్నెట్ను వినియోగించుకునేందుకు వారికి ఉన్న హక్కును నిరాకరించలేం. ఫ్రీ బేసిక్స్ కింద కొన్ని వెబ్సైట్లను మాత్రమే ఉచితంగా అందిస్తామని ఫేస్బుక్ చెప్పింది. భారత్ ఇలాంటి విధానాలను ఆమోదించదు’ అని ప్రసాద్ డిజిటల్ ఇండియా సదస్సులో అన్నారు. ఇంటర్నెట్ సమానత్వంపై అమెరికా తన వైఖరిని నిర్ణయించుకోవాలని ఆయన కోరారు. ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రకాల ఇంటర్నెట్ సేవలు అందించాల్సిందేననీ, ఇది రాజీలేని అంశమని భారత్ మొదటి రోజు నుంచీ వాదిస్తోందన్నారు. కొన్ని వెబ్సైట్లను ఉచితంగా, మరికొన్ని వెబ్సైట్లను చార్జీలు చెల్లించి బ్రౌజ్ చేసేలా రిలయన్స్‌తో కలసి ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్‌ను, ఎయిర్టెల్ ‘ఎయిర్టెల్ జీరో’ విధానాన్ని గతంలో తీసుకురావడం తెలిసిందే. ఆ తర్వాత ఇలా ఒక్కో వెబ్‌సైట్‌కు ఒక్కో స్పీడ్‌ను, రేటును నిర్ణయించడం వివక్ష కిందకు వస్తుందనీ, ఇలాంటి వాటిని తాము ఉపేక్షించబోమంటూ భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వాటిని నిషేధించింది. నెట్ సమానత్వానికి అనుకూలంగా ట్రాయ్ సిఫార్సులు చేసింది. వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ఫేస్బుక్ టార్గెట్ ఏంటి..?
గతంలో ఫ్రీ బేసిక్స్ పేరిట సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ అందిస్తామంటూ విమర్శలపాలైన ఫేస్బుక్.. మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తో కలిసి ‘ఎక్స్‌ప్రెస్ వైఫై’ అంటూ దూసుకొస్తోంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ వైఫైతో మొబైల్‌కి, సిస్టంకి అత్యంత తక్కువ ధరల్లో కనెక్ట్ కావచ్చంటూ ప్రచారం చేస్తోంది. దాదాపు 125 లొకేషన్లలో ఈ ఎక్స్‌ప్రెస్ వైఫై ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు అందుబాటులోకి రానప్పటికీ డిజిటల్ వోచర్స్ ద్వారా వినియోగదారులు డేటా ప్యాక్‌లు కొనాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లను మరింత బలోపేతం చేయడంతోపాటు స్థిరమైన రాబడికి తోడ్పడుతుందన్నది ఫేస్బుక్ వాదన. అయితే ధరల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. -
ఫేస్ బుక్ పై కోపమా.. ట్రాయ్ పై అసహనమా?
న్యూఢిల్లీ: భారత్‌లో యూజర్లకు ఫ్రీ బేసిక్స్ ఇకపై అందుబాటులో ఉండదని ఫేస్బుక్ ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. ఆ మరుసటిరోజే.. తాను అమెరికాకు వెళ్లిపోతున్నానని భారత్ లో ఫేస్ బుక్ చీఫ్ గా పనిచేస్తున్న కీర్తిగా రెడ్డి ప్రకటించారు. అమెరికా నుంచి భారత్ వచ్చేటప్పుడే అనుకున్నాం.. ఏదో ఓ రోజు మా కుటుంబం మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్తుందని తెలుసునని పేర్కొన్నారు. ఏడాదిలోగా మళ్లీ భారత్ వచ్చే అవకాశం లేదని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్ (ఏపీఏసీ) విలియమ్ ఈస్టన్, డాన్ నియరీ, వీపీ ఆసియా పసిఫిక్ గా ఉన్న ఆమె కీర్తికాతో కలిసి ఫేస్ బుక్ లో పనిచేశారు. తన తర్వాత విలియమ్ ఈస్టన్ తన స్థానంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పోస్ట్ లో తెలిపారు. 'భారత్ లో ఫేస్ బుక్ తొలి ఉద్యోగిగా ఉన్నాను, ఆరేళ్లుగా ఇక్కడ పనిచేశాను. సంస్థ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటూ హైదరబాద్ నుంచి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాను' అని వివరించారు. మెన్లో పార్క్ లో ఫేస్ బుక్ కొత్త అవకాశాల కోసం పనిచేస్తానన్నారు. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా నిర్దిష్ట వెబ్సైట్లను ఉచితంగా అందించేలా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఫేస్బుక్ తలపెట్టిన ఈ సర్వీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ను బట్టి చార్జీలు విధించడం సరికాదంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయగా, ట్రాయ్ కూడా ఇందుకు అనుకూలంగా నిబంధనలు ప్రకటించింది. వివాదాస్పదమైన తమ ఫ్రీ బేసిక్స్ సర్వీసులను భారత్‌లో నిలిపివేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. ఆ మరుసటి రోజే భారత్ లో ఆ సంస్థ ముఖ్య అధికారిణి, డైరెక్టర్ కీర్తిగా రెడ్డి అమెరికాకు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించారు. -
భారత్ లో ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ బంద్
న్యూఢిల్లీ: వివిధ వెబ్సైట్లకు వివిధ రకాల చార్జీలు విధించకుండా నెట్ న్యూట్రాలిటీకి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మద్దతు పలికిన దరిమిలా.. వివాదాస్పదమైన తమ ఫ్రీ బేసిక్స్ సర్వీసులను భారత్‌లో నిలిపివేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. భారత్‌లో యూజర్లకు ఫ్రీ బేసిక్స్ ఇకపై అందుబాటులో ఉండదని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా నిర్దిష్ట వెబ్సైట్లను ఉచితంగా అందించేలా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఫేస్బుక్ తలపెట్టిన ఈ సర్వీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ను బట్టి చార్జీలు విధించడం సరికాదంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయగా, ట్రాయ్ కూడా ఇందుకు అనుకూలంగా నిబంధనలు ప్రకటించింది. ‘వలసవాద’ కామెంట్లపై ఆంద్రీసెన్ సారీ .. వలసవాద వ్యతిరేక భావజాలం పేరిట ప్రతీదాన్ని వ్యతిరేకించడం వల్లే భారత్ నష్టపోతోందంటూ చేసిన వ్యాఖ్యలపై ఫేస్బుక్ బోర్డు సభ్యుడు మార్క్ ఆంద్రీసెన్ క్షమాపణ చెప్పారు. భారత రాజకీయాలు, ఆర్థికాంశాలపై ట్వీటర్లో తాను చేసిన వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో కూడుకున్నవని పేర్కొన్నారు. తాను నూటికి నూరు శాతం వలసవాదానికి వ్యతిరేకినని, భారత్ సహా ప్రతి దేశంలోనూ స్వాతంత్య్రం.. స్వేచ్ఛకే తన మద్దతు అని ఆంద్రీసెన్ వివరించారు. ఫ్రీ బేసిక్స్ వంటి పథకాలకు వ్యతిరేకంగా ట్రాయ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆంద్రీసెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ... ఆంద్రీసెన్ వ్యాఖ్యలతో కంపెనీకి సంబంధం లేదన్నారు. భారతదేశమన్నా, భారతీయులన్నా తనకు అపార గౌరవమని, అనేక సంవత్సరాలుగా వారు తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. -
ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ దుకాణం బంద్!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ చార్జీల విషయంలో ఎంతమాత్రం వివక్ష ఉండరాదన్న ట్రాయ్ నిర్ణయంతో సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ భారత్‌లో తన ఫ్రీబేసిక్స్ ప్రచారాన్ని రద్దుచేసుకుంది. 'భారత్‌లోని ప్రజలకు ఫ్రీబేసిక్స్ పథకం అందుబాటులో ఉండబోదు' అని ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు గురువారం వెల్లడించారు. ఫ్రీ బేసిక్స్ పథకంలో భాగంగా ఫేస్‌బుక్‌ను ఉచితంగా అందిస్తున్న మొబైల్ ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పటికే దీనిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఫ్రీ బేసిక్స్‌ను వెనుకకు తీసుకోవాలని నిర్ణయించింది. వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా మొబైల్ ఇంటర్నెట్ చారీలు విధించాలన్న మొబైల్ ఆపరేటర్లు, ఫేస్బుక్ ప్రతిపాదనను భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఫేస్బుక్ వంటి కొన్ని వెబ్సైట్లను అందించేందుకు ఫ్రీబేసిక్స్ పేరిట మొబైల్ ఆపరేటర్లతో ఒప్పందం చేసుకోవాలని ఫేస్బుక్ భావించింది. ఇందుకోసం భారత్‌లో తీవ్రంగా ప్రచారం కూడా చేసింది. అయితే ఫ్రీబేసిక్స్ పేరిట కొన్ని వెబ్సైట్లను మాత్రమే అనుమతించడం ఇంటర్నెట్ సమానత్వానికి వ్యతిరేకమంటూ స్వచ్ఛంద కార్యకర్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమానంగా అందేందుకు వీలుగా.. డాటా చార్జీల్లో వివక్షకు తెరదించుతూ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. యాక్సెస్ పొందే కంటెంట్ ఆధారంగా భిన్నమైన ధరలతో ఎవరైనా ఇంటర్నెట్ చార్జీల్లో వివక్షకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తామని ట్రాయ్ హెచ్చరించింది. -
తటస్థతే విజేత!
భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రవహించే సమా చారాన్ని అంతరాల దొంతరల్లో బంధించి దాన్ని దారీ తెన్నూ లేకుండా చేయాలను కున్నవారు ఓటమిపాలయ్యారు. సర్వ స్వతంత్రమైన, స్వేచ్ఛాపూరితమైన ఇంటర్నెట్ వ్యవస్థ కోసం ఉద్యమించినవారికే అంతిమ విజయం దక్కింది. ఇంటర్నెట్ సేవల్లో వివక్షాపూరిత విధానాలు చెల్లవని టెలికాం నియంత్రణా వ్యవస్థ ట్రాయ్ సోమవారం తేల్చిచెప్పింది. వర్తమానకాలంలో ఇంటర్నెట్ ఒక వ్యసనంగా, నిత్యావసరంగా పరిణమించడం కాదనలేని సత్యం. ఫేస్బుక్, గూగుల్, ట్విటర్ వంటి సంస్థలు చూస్తుండగానే లక్షల కోట్లకు పడగలెత్తడం ఇందువల్లే. కొన్ని ఎత్తుగడలతో ఈ లాభాలను మరిన్ని వందల రెట్లు పెంచుకోవచ్చునని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ భావించిన పర్యవసానంగా ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ఆవిర్భవించింది. అవసరమైన కొన్ని వెబ్సైట్లను ఉచితంగా అందించ డమే దీని ప్రధానోద్దేశమంటూ ఊరించి తీసుకొచ్చిన ఈ కొత్త ఆలోచనను ఆదిలోనే అందరూ తిప్పికొట్టారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదన్న ఉద్యమం బయ ల్దేరింది. భారత్‌లో ‘ఉచితం’ అని పేరు పెడితే ఎలాంటి అనుచిత విధానాన్నయినా చలామణి చేయడం సాధ్యమన్న ఆలోచనతో కావొచ్చు... ఈమధ్యే ‘ఫ్రీ బేసిక్స్’ పేరిట ఫేస్బుక్ వివిధ రకాల మాధ్యమాల్లో వాణిజ్య ప్రకటనలతో హోరెత్తించింది. అందుకు వందలాది కోట్లు ఖర్చు చేసింది. ఇంటర్నెట్కు విధించాలనుకుంటున్న పరిమితులకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి చేసిన ఈ ప్రయత్నం కొంతమేర సఫలమైంది కూడా. ఈ పోకడలపై దృష్టి సారించి, దీనిపై ఒక విధానాన్ని ప్రకటించే పనిలో నిమగ్నమైన ట్రాయ్‌కు ‘ఫ్రీ బేసిక్స్’ను ఆమోదించే లక్షలాది సందేశాలు చేరాయి. అయితే తమ పరిశీలన ఇంటర్నెట్కు పరిమితులు ఉండవచ్చునా లేదా అన్న అంశంపైనే తప్ప... ‘ఫ్రీ బేసిక్స్’ అనుకూల, వ్యతిరేక అభిప్రాయాల సేకరణకు కాదని ట్రాయ్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పి గాలి తీసింది. ట్రాయ్ వెలువరించిన నిర్ణయం ఇటీవలికాలంలో ఎన్నదగినది. ఇంటర్నెట్లో లభించే డేటాకు దాని అవసరాన్నిబట్టి వేర్వేరు ధరలు నిర్ణయించి వసూలు చేయొచ్చునన్నది ‘ఫ్రీ బేసిక్స్’లోని ఆంతర్యం. ఒకవైపు ఉచితం అంటూనే అటు వినియోగదారుడినుంచీ, ఇటు వెబ్సైట్ సంస్థనుంచీ ఏకకాలంలో డబ్బు గుంజడం ఈ విధానంలో కీలకాంశం. ఫలితంగా వారు డిమాండ్ చేసిన సొమ్ము చెల్లించగల సంస్థలు సైబర్ ప్రపంచంలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వెలగబెడతాయి. ఆ వెబ్సైట్లే వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. అలాగే టెలికాం సంస్థలు అడిగిన మేర చెల్లించగలిగే వినియోగదారులకే నిర్దేశిత వెబ్సైట్ లభ్యమవు తుంది. మిగిలినవారికి అది తెరుచుకోదు. మరోవిధంగా చెప్పాలంటే మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ‘వీఐపీ సంస్కృతి’ ఇంటర్నెట్లో చొరబడుతుంది. డబ్బుతో ధగధగలాడే సంస్థలు మెరుపు వేగంతో వినియోగదారులకు చేరతాయి. అది సాధ్య పడని సంస్థలు మందగమనంతో మిగిలిపోతాయి. వినియోగదారులకు ఎంతకీ తెరుచుకోవు. ఇప్పుడు స్కైప్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఉచితంగా లభించే సేవలు కొనుక్కోవడం తప్పనిసరవుతుంది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఇంటర్నెట్లో ఎలాంటి వివక్షకూ తావు లేకుండా అన్ని రకాల డేటా అందరికీ అందుబాటులో ఉంటున్నది. అందువల్ల ప్రపంచంలో ఏమూలనున్నవారైనా తమ అభిప్రాయా లనూ, ఆలోచనలనూ, ఉద్దేశాలనూ స్వేచ్ఛగా ప్రపంచం ముందు ఉంచగలుగుతు న్నారు. ఏ అన్యాయమైనా, అక్రమమైనా జనం ముందు... దృశ్యరూపంలో కావొచ్చు, అక్షరాల్లో కావొచ్చు క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. వారిలో ఆగ్రహావేశా లను రగిలిస్తున్నది. వారిని కార్యాచరణకు పురిగొల్పుతున్నది. ఔత్సాహికులెందరో తమ సృజనాత్మకతను చాటి లబ్ధిపొందుతున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారు సైతం అందరికీ చేరువకాగలుగుతున్నారు. వివిధ రకాల ధరవరలు నిర్ణయిం చడంవల్ల ఇలాంటివన్నీ సామాన్య పౌరులకు దూరమవుతాయి. డబ్బే దేన్నయినా నిర్దేశిస్తుంది. ఈ ప్రమాదాన్ని ట్రాయ్ తాజా నిర్ణయం నివారించగలిగింది. పౌరులు అప్రమత్తంగా లేకుంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. నిరుడు జనవరిలో ఒకరిద్దరు ప్రారంభించిన ‘తటస్థ ఇంటర్నెట్’ ఉద్యమం చూస్తుండగానే నలువైపులా విస్తరించింది. ఈ సైబర్ ఉద్యమకారులు ఎప్పుడూ ఒకచోట కలుసుకు న్నది లేదు. డాక్టర్లు, న్యాయవాదులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, సాఫ్ట్వేర్ నిపుణులు, పాత్రికేయులు, కళాకారులు, రచయితలు... ఇంకా ఎందరెందరో తమ తమ వృత్తులను కొనసాగిస్తూనే తటస్థ ఇంటర్నెట్ అవసరాన్ని అందరికీ అర్ధమ య్యేలా విశదీకరించారు. అందులో పొంచివున్న ప్రమాదాలను విప్పిచెప్పారు. ఇప్పటికైతే ఇది సెల్ఫోన్లకే, అందులో వాడే యాప్‌లకే పరిమితమైనా...చాలా త్వరగానే అన్నిటిలోకీ చొచ్చుకొచ్చి సమాచార ప్రసారానికి గుదిబండలా మారు తుందని వివరించగలిగారు. అందువల్ల కలిగే నష్టాలను విప్పిచెప్పారు. ఇంట ర్నెట్‌కు ఖరీదు కట్టే షరాబులొస్తే ఏమవుతుందో ఎవరికి తోచిన రూపాల్లో వారు చెప్పారు. వీడియోల ద్వారా, కార్టూన్లద్వారా చైతన్యం తెచ్చారు. ఈ ఉద్య మంలో అందరూ కార్యకర్తలే. నాయకులు లేరు. ఇంతమంది ఇన్నివిధాల చేయబట్టే... అన్నివైపులనుంచీ తీవ్ర వ్యతిరేకత రాబట్టే ట్రాయ్ సరైన నిర్ణయం తీసుకోగలిగింది. మన దేశంలో సాగిన తటస్థ ఇంటర్నెట్ ఉద్యమం అమెరికా, యూరప్ దేశాల పౌరుల్లో కూడా పునరాలోచన తీసుకురాగలిగింది. ఆ విషయంలో తమ ప్రభు త్వాలు తీసుకున్న నిర్ణయాలను మార్చేలా అక్కడ ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ట్రాయ్ నిబంధనల ప్రకారం తటస్థ ఇంటర్నెట్కు భిన్నంగా వ్యవహరించే సంస్థలకు రోజుకు రూ. 50,000 నుంచి రూ. 50 లక్షల వరకూ జరిమానా విధించే వీలుంటుంది. ఇంటర్నెట్లో లభించే ఏ రకం డేటాకైనా వివిధ రకాల టారిఫ్‌లు ఉండరాదని ట్రాయ్ తాజా నిబంధనావళి స్పష్టం చేస్తున్నది. అయితే అవసరమైన సందర్భాల్లో సర్వీసు ప్రొవైడర్లు కొన్ని సేవలకు టారిఫ్‌ను తగ్గించ వచ్చునని చెబుతోంది. ట్రాయ్ తీర్పు శృంఖలాలులేని ఇంటర్నెట్ను కోరుకునేవారి విజయం. భావప్రకటనాస్వేచ్ఛను గౌరవించేవారందరి విజయం. అప్రమత్తంగా ఉంటే ఎలాంటి అక్రమాన్నయినా అడ్డుకోవచ్చునని ఈ విజయం నిరూపించింది. -
తటస్థ ‘నెట్’కే ట్రాయ్ ఓటు
► ఫేస్‌బుక్‌కు చుక్కెదురు.. ► వెబ్‌సైటుకో రేటు కుదరదు ► టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టీకరణ ► చూసే వెబ్సైట్లను బట్టి చార్జీలు మార్చొద్దు ► ఇంటర్నెట్ అందరికీ న్యూట్రల్‌గానే ఉండాలి ► కొన్ని సైట్లే ఫ్రీగా ఇస్తామన్న ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బ ► ఫ్రీ బేసిక్స్‌తో పాటు ‘ఎయిర్టెల్ జీరో’కూ షాక్ ► నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు కనిష్టంగా రూ.50,000 జరిమానా ► గరిష్టంగా రూ.50 లక్షల వరకూ వసూలు ఫ్రీ బేసిక్స్ పేరిట తాను ఎంపిక చేసిన కొన్ని వెబ్సైట్లను మొబైల్ వినియోగదారులకు ఉచితంగా ఇస్తానంటూ వందల కోట్ల రూపాయలతో ప్రచారం ఊదరగొట్టిన ‘ఫేస్బుక్’కు గట్టి దెబ్బ తగిలింది. ఫేస్‌బుక్‌తో జతకట్టిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు... ‘జీరో’ పేరిట కొన్ని వెబ్సైట్లు చూస్తే డేటా చార్జీలు ఉండవంటూ మినహాయించిన ఎయిర్‌టెల్‌కు కూడా షాక్ తగిలింది. దేశంలో ఇంటర్నెట్ సర్వీసులందించే ఏ సంస్థ కూడా.. కంటెంట్ (వెబ్సైట్లు) ఆధారంగా చార్జీల్లో ఎక్కువ తక్కువ వసూలు చేయకూడదని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) స్పష్టం చేసింది. అంటే ఇప్పటి మాదిరిగా ఏ సంస్థ అయినా తానందించే ఇంటర్నెట్ స్పీడు ఆధారంగా మాత్రమే రకరకాల చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే నిర్దిష్ట స్పీడుతో కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు ఆ పరిధిలో ఏ వెబ్‌సైట్‌ను చూసినా అవే చార్జీలు చెల్లిస్తాడు. అంతేతప్ప ఫేస్బుక్, వాట్సాప్‌లు మాత్రమే ఫ్రీగా ఇస్తామంటే కుదరదు. ఇదీ ట్రాయ్ స్పష్టం చేసిన నెట్న్యూట్రాలిటీ.. న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సేవలకు సంబంధించి దుమారం రేపిన నెట్ న్యూట్రాలిటీ వివాదానికి ట్రాయ్ తెరదింపింది. నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. వివిధ సైట్ల వినియోగాన్ని బట్టి రకరకాల చార్జీలు విధించడం కుదరదని టెలికం కంపెనీలకు తేల్చి చెప్పింది. ఈ నిబంధన పాటించని పక్షంలో, ఎన్నాళ్లు ఉల్లంఘిస్తే అన్ని రోజులూ రోజుకు రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. డేటా సేవలకు సంబంధించి వివక్షాపూరిత టారిఫ్‌లను నిషేధిస్తూ రూపొందించిన 2016 నిబంధనావళిని సోమవారం ఢిల్లీలో ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆవిష్కరించారు. ఇంటర్నెట్లో లభించే దేనికీ వివిధ రకాల టారిఫ్‌లు ఉండకూడదన్నది తమ ఉద్దేశమని, నిబంధనల్లో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశామని ఆయన తెలిపారు. కొత్త నిబంధనలను ఉల్లంఘించే పథకాలను ఆరు నెలల్లోగా కంపెనీలు ఉపసంహరించుకోవాలని శర్మ స్పష్టం చేశారు. ‘‘కంటెంట్‌ను బట్టి డేటా సేవలకు రకరకాలుగా చార్జీలు విధించేలా ఇంటర్నెట్ కంపెనీలతో టెలికం సర్వీసు ప్రొవైడర్లు ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదు. అయితే, అత్యవసర సర్వీసులకు ఉపయోగపడే వాటి విషయంలో మాత్రం సర్వీసు ప్రొవైడర్లు కొంత టారిఫ్‌ను తగ్గించవచ్చు. ఈ ఎమర్జెన్సీ సర్వీసులు ఏమిటనేది కూడా మేం ప్రత్యేకంగా నిర్వచించలేం. ఇలాంటి వాటికి సంబంధించి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లే మాకు ఏడు పనిదినాల్లోగా వివరాలివ్వాలి’’ అని శర్మ వివరించారు. ఫేస్బుక్, ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ... ఇంటర్నెట్ ఆధారిత కాల్స్‌కు వేరుగా చార్జీలు వసూలు చేయాలని 2014 డిసెంబర్లో ఎయిర్టెల్ నిర్ణయించడంతో నెట్ న్యూట్రాలిటీపై వివాదం రేగింది. అప్పటికి ఎయిర్టెల్ వెనక్కి తగ్గింది. ఆపై సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’... ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ పేరిట తాను ఎంపిక చేసిన కొన్ని వెబ్సైట్లను ఫ్రీగా ఇస్తానంటూ ముందుకొచ్చింది. దాంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ జతకట్టింది. ‘అవసరమైన’ కొన్ని వెబ్సైట్లను ఫ్రీగా ఇవ్వటం వల్ల అందరికీ ఇంటర్నెట్ అందుతుందని, ఇంటర్నెట్కు అలవాటు పడతారు కనక తరవాత వారు పెయిడ్ వినియోగదారులుగా మారతారని ఫేస్బుక్ ప్రచారం చేసింది. ఒకవంక అందరికీ అలవాటు చేయటానికే ఇలా ఫ్రీగా ఇస్తున్నట్లు చెబుతూ... మరోవంక దేశంలో చాలా మంది ఇంటర్నెట్కు డబ్బులు ఖర్చుచేసే స్థితిలో లేరని, వారికోసమే ఇలా ఫ్రీగా ఇస్తున్నామని కూడా ప్రచారం చేసింది. అసలుకివి రెండూ ఒకదానితో ఒకటి పొసగని వాదనలు. వాస్తవానికైతే ఫేస్బుక్ తనకు నచ్చిన, తన నిబంధనలకు అంగీకరించిన అతికొద్ది సైట్లను అందరికీ ఫ్రీగా ఇవ్వటం ద్వారా... మిగిలిన సైట్లు ఎవ్వరూ చూడకుండా చేసి, ఇంటర్నెట్పై గుత్తాధిపత్యం సంపాదించటానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలొచ్చాయి. దీనిపై నిరసనలు రేగటంతో ఫేస్బుక్ వెనక్కి తగ్గింది. ఆ తరవాత ‘ఫ్రీ బేసిక్స్’ పేరిట ఇంటర్నెట్.ఆర్గ్ అనే కొత్త పేరుతో మరోసారి తెరపైకి తెచ్చింది. దానికోసం వందల కోట్ల రూపాయలతో మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చింది. ఫ్రీబేసిక్స్ వ్యతిరేకులను విమర్శిస్తూ.. ఫేస్బుక్ తమకు మద్దతునివ్వాలంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించింది. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతిస్తున్నట్లుగా ఫేస్బుక్ వాడకందార్లచేత ట్రాయ్‌కి మెసేజీలు కూడా పంపించింది. ట్రాయ్‌కి వచ్చిన 24 లక్షల కామెంట్లలో అత్యధికం ఫ్రీబేసిక్స్‌కు మద్దతుగానే ఉన్నాయి. ఇదంతా చూసిన ట్రాయ్... తాను నెట్ న్యూట్రాలిటీపై జనాన్ని అభిప్రాయం అడిగానని, వాళ్లంతా ఫ్రీబేసిక్స్‌కు మద్దతుగా సందేశాలెందుకు ఇస్తున్నారని ఆగ్రహం కూడా వ్యక్తంచేసింది. చివరకు తాజా నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలపై ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ‘‘ఫ్రీ బేసిక్స్‌తో మరింత మందికి ఇంటర్నెట్ను చేరువ చేయాలన్నదే మా లక్ష్యం. కానీ ట్రాయ్ నిబంధనలు మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేశాయి’’ అన్నారు. ఇంటర్నెట్ విస్తృతికి తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. ఎయిర్‌టెల్‌ది కూడా ఇలాంటి వ్యవహారమే. ఎయిర్టెల్ జీరో పేరిట ఇపుడు కొన్ని వెబ్సైట్లతో కూడిన ప్యాకేజీని చౌకగా అందిస్తోంది. తానే కొన్ని మ్యూజిక్ యాప్‌లు విడుదల చేసి... వాటిలో డౌన్లోడ్లకు తక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఇవన్నీ ట్రాయ్ నిర్ణయంతో వెనక్కి పోనున్నాయి. టెలికం కంపెనీలు ట్రాయ్ నిబంధనలపై స్పందిస్తూ... స్వేచ్ఛా విపణిలో తమ హక్కులపై దాడిగా దీన్ని వర్ణించాయి. ఇది దేశవ్యాప్తంగా నెట్ కనెక్టివిటీ విస్తృతికి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నాయి. అసలు నెట్ న్యూట్రాలిటీకి నిర్వచనం ఇవ్వకుండా ట్రాయ్ నిర్దిష్ట పథకాలను పూర్తిగా నిషేధించడం సరికాదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్ల తర్వాత సమీక్ష.. స్వభావాన్ని బట్టి కొన్ని ప్రత్యేక పథకాలకు అనుమతి ఇవ్వవచ్చన్న టెలికం విభాగ అధికారుల కమిటీ సూచనలను కూడా ట్రాయ్ తోసిపుచ్చింది. టెల్కోలు సొంతంగా తమ కస్టమర్లకు మూవీ, మ్యూజిక్ యాప్స్ మొదలైన వాటిని తక్కువ రేట్లకే అందిస్తున్నాయి. దీనిపై స్పందించిన శర్మ... ‘‘నెట్‌పై అందుబాటులో ఉండే దేనికీ కూడా వివిధ రకాల చార్జీలు ఉండకూడదు. ఇంటర్నెట్లో ఏదైనా ఉచితంగా లభిస్తుంటే ఉచితంగానూ, చార్జీలు వర్తిస్తే చార్జీలు విధించేలాగానే నెట్ సర్వీసులుండాలి. తారతమ్యం ఉండకూడదు. ఈ నిబంధనలను రెండేళ్ల తర్వాత లేదా టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో అవసరమైతే అంతకన్నా ముందైనా సమీక్షించే అవకాశం ఉంది’’ అని శర్మ తెలియజేశారు. న్యూట్రాలిటీ మద్దతుదారుల హర్షం.. ట్రాయ్ నిర్ణయాన్ని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, ఐఏఎంఏఐ, తదితర పరిశ్రమ వర్గాలతో పాటు విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నెట్ న్యూట్రాలిటీ మద్దతుదారులు స్వాగతించారు. ఇది భారత్‌లోని ఇంటర్నెట్ యూజర్ల ఘన విజయమని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నిబంధనలను ప్రశంసిస్తూ కాంగ్రెస్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మరోవైపు, ట్రాయ్ సరైన నిర్ణయం తీసుకుందని సాఫ్ట్వేర్ ఫ్రీడం లా సెంటర్ ఈడీ మిశి చౌదరి పేర్కొన్నారు. -
ఫేస్‌బుక్‌కు భారీ ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో కంటెంట్ ఆధారంగా వేర్వేరు డాటా చార్జీలు ఉండాలన్న చర్చకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పుల్ స్టాప్ పెట్టింది. వేర్వేరు కంటెంట్ యాక్సెస్ పొందేందుకు వినియోగదారులకు వేర్వేరు డాటా చార్జీలు ఉంచాలన్న కంపెనీల ప్రతిపాదనను ట్రాయ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ మేరకు ట్రాయ్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎయిర్టెల్ జీరో, ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రచారానికి పెద్ద ఎదురుదెబ్బ కానున్నాయి. గతకొద్ది నెలలుగా ఫ్రీ బేసిక్స్ పేరిట ఫేస్బుక్ భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడమే కాకుండా.. ఈ పథకాన్ని కాపాడాలంటూ తన సోషల్ మీడియా సైట్లో నెటిజన్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రచారం ద్వారా ఫ్రీ బేసిక్స్ విషయంలో ఏకంగా ట్రాయ్‌తో ఫేస్బుక్ అమీతుమీకి దిగింది. అయినప్పటికీ వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా డాటా చార్జీలు ఉండాలన్న ప్రతిపాదనను ట్రాయ్ తిరస్కరించింది. ఈ విషయంలో డాటా చార్జీల్లో వివక్ష చూపుతూ ఏ మొబైల్ ఆపరేటర్ అయినా ముందస్తు ఒప్పందం చేసుకుంటే తీవ్ర చర్యలు తప్పవని ట్రాయ్ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఫేస్బుక్ ఫ్రీ బేసిక్ ప్రచారాన్ని స్వచ్ఛంద కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సమానత్వానికి ఇది వ్యతిరేకమని, 'ఫ్రీ బేసిక్స్' పేరిట ఇంటర్నెట్ సేవలపై గుత్తాధిపత్యానికి ఫేస్బుక్ ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫేస్‌బుక్‌పై ధ్వజమెత్తిన ట్రాయ్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్రీ బేసిక్ అంశంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వ్యవహరిస్తున్న తీరుపై భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతుగా తన యూజర్ల చేత ఫేస్బుక్ ట్రాయ్‌కి ఈమెయిల్స్ పంపించడాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ విషయంలో ఫేస్బుక్ తనపై చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పికొడుతూ ఘాటైన బహిరంగ లేఖను ట్రాయ్ రాసింది. ఫేస్బుక్ వ్యవహారాలకు సంబంధించి ఇండియా, దక్షిణ, మధ్య ఆసియా డైరెక్టర్ అంఖీ దాస్ పేరిట రాసిన ఈ లేఖలో ఆ వెబ్సైట్ తీరును ట్రాయ్ ఏకీపారేసింది. 'డాటా సర్వీసులకు విభిన్నమైన ధరలు' అంశంపై ట్రాయ్ సంధించిన నాలుగు ప్రశ్నలకు తన యూజర్ల తరఫున ఫేస్బుక్ తెలిపిన ప్రతిస్పందన.. అది ప్రజల స్పందన కాబోదని, ఫ్రీబేసిక్స్ కు మద్దతుగా ఫేస్బుక్ తన యూజర్ల స్పందనను ప్రజా స్పందనగా చిత్రించడానికి అది ప్రయత్నిస్తున్నదని ఈ లేఖలో ట్రాయ్ పేర్కొంది. తనకు ఉన్న భారీ యూజర్ల సామర్థ్యాన్ని ఫేస్బుక్ ఫ్రీ బేసిక్కు మద్దతుగా ఉపయోగించుకుంటున్నదని, ఈ వ్యవహారంలో పారదర్శకమైన నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా అర్థవంతమైన సంప్రదింపుల ప్రక్రియ కొనసాగకుండా.. కేవలం మెజారిటేరియన్ ఓపినియన్ పోల్‌లా ఇది కొనసాగాలని ఫేస్బుక్ భావిస్తున్నదని ట్రాయ్ ఈ లేఖలో మండిపడింది. ఫేస్బుక్ చర్యలను ఆమోదిస్తే.. భారత్‌లో విధాన నిర్ణయాలపై తీవ్ర ప్రమాదకరమైన ప్రభావాలు పడే అవకాశముందని ట్రాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫేస్బుక్ తన యూజర్ల తరఫున స్వయం నియమిత అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నదని, యూజర్లందరి తరఫున మూకుమ్మడిగా మాట్లాడేందుకు ఫేస్‌బుక్‌కు ఎలాంటి అధికారం లేదని ట్రాప్ తేల్చి చెప్పింది. గ్రామీణ ప్రాంతాల వారికి ఉచిత ఇంటర్నెట్ పేరిట ఫేస్బుక్ ముందుకు తీసుకొచ్చిన 'ఫ్రీబేసిక్స్' ప్రచారాన్ని ఇంటర్నెట్ సమానత్వ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
మొబైల్ డాటా సర్వీసులపై మీ అభిప్రాయం ఏమిటి?
ట్రాయ్ ఆధ్వర్యంలో రేపు బహిరంగ చర్చ న్యూఢిల్లీ: మొబైల్ డాటా సర్వీసుల కోసం విభిన్న ధరలు నిర్ణయించే విషయమై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఈ నెల 21న బహిరంగ చర్చ నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ న్యూట్రాలిటీ (సమానత్వం) విషయంలో డాటా సర్వీసుల ధర అన్నది కీలకాంశం కావడంతో ఈ విషయంలో స్టేక్‌హోల్డర్స్ అంతా తమ అభిప్రాయాన్ని తెలుపాలని కోరింది. 'డాటా సర్వీసులకు విభిన్నమైన ధరలు' అనే పత్రంపై నిర్వహించే ఈ బహిరంగ చర్చలో ఆసక్తి కలిగిన వ్యక్తులంతా పాల్గొనాలని కోరుతూ ట్రాయ్ ఒక నోటిఫికేషన్ జారీచేసింది. న్యూఢిల్లీలోని పీహెచ్డీ హౌస్‌లో ఈ చర్చ జరుగుతోంది. డాటా సర్వీసులకు విభిన్నమైన ధరలు ఉండాలని టెలికం ఆపరేటర్లు కోరుతుండగా.. విభిన్న ధరలతో టెలికం ఆపరేటర్ల ఆధిపత్యం ఉండరాదని ఇంటర్నెట్ సమానత్వం కోసం పోరాడుతున్న ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఫేస్బుక్ ఫ్రీబేసిక్స్ పేరుతో భారీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సమానత్వం కోసం ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. -
ఆంక్షలతో ఇంటర్నెట్ అందకుండా చేయొద్దు!
ట్రాయ్ ‘నెట్ న్యూట్రాలిటీ’ నిబంధనలపై ఫేస్బుక్ న్యూఢిల్లీ: ఇంటర్నెట్పై విధించే ఆంక్షలు, నియంత్రణల వల్ల... ప్రజలందరికీ ఇంటర్నెట్ అందకూడని పరిస్థితి ఏర్పడ కూడదని ఫేస్బుక్ సంస్థ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. పలు వెబ్సైట్లు, సర్వీసులను ఉచితంగా అందించేలా తీసుకువచ్చిన ‘ఫ్రీబేసిక్స్’ ప్లాట్‌ఫామ్‌కు మద్దతు కూడగట్టడంలో భాగంగా ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీ నిబంధనలపై ఆ సంస్థ ఈమెయిల్ యుద్ధం ప్రారంభించింది. ‘ఫ్రీబేసిక్స్’ ప్లాట్‌ఫామ్‌కు అనుమతివ్వడమంటే ఇంటర్నెట్లో కొన్ని సంస్థలు, వెబ్సైట్లకు గుత్తాధిపత్యం ఇవ్వడమేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ‘ఇంటర్నెట్ తటస్థత (నెట్ న్యూట్రాలిటీ)’కు ఫ్రీ బేసిక్స్ భంగకరమంటూ ట్రాయ్ పలు నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అయితే ఈ అంశంలో ప్రజాభిప్రాయం సేకరించేందుకు సిద్ధమైంది. దీనికి గురువారంతో గడువు ముగుస్తోంది కూడా. ఈ నేపథ్యంలో ఫ్రీబేసిక్స్‌కు మద్దతు కూడగట్టుకునేందుకు ఫేస్బుక్ సంస్థ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలు ఇవ్వడంతోపాటు ఈమెయిల్ ప్రచారాన్నీ చేపట్టింది. -
ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్‌కు ట్రాయ్ ఝలక్
న్యూఢిల్లీ: ఫ్రీ బేసిక్స్ సర్వీసుకు మద్దతు కూడగట్టుకునేందుకు ఉధృత ప్రచారం సాగిస్తున్న సోషల్ నెట్వర్క్ ఫేస్‌బుక్‌కు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. నెట్ న్యూట్రాలిటీ పై అభిప్రాయాలు పంపమంటే ఫ్రీ బేసిక్స్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున కామెంట్స్ రావడంపై ట్రాయ్ స్పందించింది. న్యూట్రాలిటీపై చర్చాపత్రంలో ప్రస్తావించిన నిర్దిష్ట అంశాలపై స్పందించాలి తప్ప ఫ్రీ బేసిక్స్‌కు అనుకూలంగా ఫేస్బుక్ రూపొందించిన నమూనా (టెంప్లేట్) పంపితే కుదరదని పేర్కొంది. సదరు అంశాలపై అభిప్రాయాలు తెలపాలంటూ ఆయా ఈమెయిల్స్‌ను పంపినవారికి సూచించాలని నిర్ణయించింది. ‘మేము విభిన్న చార్జీల విధానం, న్యూట్రాలిటీ (ఇంటర్నెట్ సేవల్లో టెల్కోలు తటస్థ వైఖరితో వ్యవహరించడం) గురించి అడిగితే.. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతు పలుకుతూ బోలెడన్ని మెయిల్స్ వచ్చాయి. ఇది.. మేం అడిగిన ప్రశ్న ఒకటైతే.. వారు మరో ప్రశ్నకు జవాబు రాసినట్లుగా ఉంది. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతు పలకడమనేది.. మేం అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇచ్చినట్లవుతుందనేది అర్థం చేసుకోవడం కష్టంగా మారింది’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఈ కామెంట్స్‌ను బుట్టదాఖలు చేయొచ్చని, కానీ మెయిల్స్ చేసిన వారు అందుకోసం ఎంతో కొంత సమయం వెచ్చించి ఉంటారు కనుక... అభిప్రాయాలు పంపేందుకు గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. -
ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ సేవల నిలిపివేత
కైరో: భారత్‌లో ఫేస్బుక్ ఫ్రీబేసిక్స్ అమలుచేసే అంశంపై చెలరేగుతున్న దుమారం నిత్యం వార్తా పత్రికల్లో గమనిస్తున్నదే. అయితే ఇప్పటికే ఫ్రీ బేసిక్స్ సర్వీస్ రుచి చూసిన ఈజిప్టులో మాత్రం దీనిని నిలిపేయాలని అధికారులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఈజిప్టులో ఫేస్బుక్ పార్ట్నర్ టెలికామ్ సంస్థ 'ఎతిసలాద్ ఈజిప్ట్'ను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈజిప్టులో ఫ్రీ బేసిక్స్ సర్వీస్ కావాలని 30 లక్షల మంది కోరగా ప్రస్తుతం 10 లక్షల మందికి ఈ సేవలు అందుతున్నాయి. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఈ సేవలను ఇప్పుడు నిషేధించడం చర్చనీయాంశం అయింది. ఈ సర్వీస్‌ను ఎందుకు నిలిపేస్తున్నారనే విషయమై అధికారులు ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ఎలాగైనా ఈ సేవలను మళ్లీ పునరుద్ధరిస్తామని ఫేస్బుక్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ ద్వారా కమ్యూనికేషన్, ఆరోగ్యం, విద్య, ఉపాధి లాంటి కొన్ని ప్రత్యేక విభాగాల్లో నెట్ సేవలను వినియోగదారులకు ఉచితంగా అందించాలని ఫేస్బుక్ భావిస్తోంది. ఇండియాలో ఈ సేవలను అందించేందుకు ఫేస్బుక్ సంస్థ రిలయన్స్‌తో చేతులు కలిపింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. ఐఐటీ, ఐఐఎస్సీల ప్రొఫెసర్లు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. దీనివల్ల మన ఫోన్లో ఉండే యాప్‌ల మీద ఫేస్బుక్ నియంత్రణ పెరిగిపోతుందని కూడా అంటున్నారు. -
ఫ్రీ బేసిక్స్ వద్దు: ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: ఫ్రీ బేసిక్స్, డిఫరెన్షియల్ డేటా తదితర ప్రయోగాలకు వ్యతిరేకంగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) గళమెత్తింది. ఇవి నెట్ న్యూట్రాలిటీ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. వివిధ డేటా సేవలకు వివిధ రకాల చార్జీల (డిఫరెన్షియల్ డేటా) ప్రతిపాదనకు సంబంధించి ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంపై ఈ మేరకు ఐఏఎంఏఐ తమ అభిప్రాయాలు తెలియజేసింది. చర్చాపత్రంలో మొత్తం మూడు విధానాలు ఉండగా.. అందులో మొదటిది టెలికం సంస్థ నిర్దిష్ట డెవలపర్ల నుంచి ఫీజులు తీసుకుని వారి వెబ్సైట్లను యూజర్లకు ఉచితంగా అందించడం. రెండోది.. ఫేస్బుక్ వంటి సంస్థలు నిర్దిష్ట వెబ్సైట్లను ఎంపిక చేసి, టెలికం సంస్థల భాగస్వామ్యంతో వాటిని ఉచితంగా అందించడం. ఇక మూడోది.. యాప్స్‌ను బట్టి టెలికం సంస్థలు డేటా చార్జీలు వసూలు చేయడం. ఈ మూడు విధానాలు కూడా నెట్ విషయంలో కస్టమరుకు అందుబాటులో ఉండే ఐచ్ఛికాలను తగ్గించేసేవేనని ఐఏఎంఏఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉచిత ఇంటర్నెట్ అనేది డేటారూపంలో ఉండాలే తప్ప నిర్దిష్ట కంటెంట్‌పరంగా ఉండకూడదని తెలిపింది. డేటా చార్జీల ప్రమేయం లేకుండా నిర్దిష్ట యాప్‌లను ఉచితంగా అందించే వేదికగా సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ ప్రవేశపెట్టిన ఫ్రీ బేసిక్స్ సర్వీసు వివాదాస్పదమైన దరిమిలా ట్రాయ్ ఈ విధానాలపై చర్చాపత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. -
ఫ్రీ బేసిక్స్‌పై అనుమానమేల: జుకెర్బెర్గ్
'ఫ్రీ బేసిక్స్'.. గత కొన్ని రోజులుగా భారతదేశంలో విపరీతంగా చర్చిస్తున్న అంశం. ఫేస్బుక్ దీన్ని బాగా ప్రమోట్ చేస్తుంటే, మన దేశంలో మాత్రం దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్చోపచర్చలు సాగుతున్నాయి. మొబైల్ ఫోన్ల ద్వారా కొన్ని వెబ్సైట్లను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఈ ఫ్రీ బేసిక్స్ వల్ల సాధ్యమవుతుంది. దీంతో అందరికీ ఎంతో కొంత వరకు ఇంటర్నెట్ అందుతుందన్నది ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ వాదన. అయితే ఫేస్బుక్ సహా కొన్ని సైట్లు మాత్రమే అందుబాటులోకి రావడం సరికాదని, మొత్తం ఇంటర్నెట్నే అందరికీ ఉచితంగా అందించాలని అంటున్నారు. కానీ జుకెర్బెర్గ్ మాత్రం లైబ్రరీ, ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ పాఠశాలల్లా బేసిక్ ఇంటర్నెట్ సర్వీసులు అందరికీ అందించాలని వాదిస్తున్నారు. భారతదేశంలో దాదాపు ఏడాదిగా దీనిపై చర్చలు జరగడం ఆశ్చర్యకరమని చెప్పాడు. ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి బదులు దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, అంటే వాళ్లు దాదాపు వంద కోట్ల మందికి ఇంటర్నెట్ అందకుండా చేస్తున్నారని అన్నాడు. అయితే ప్రజలు గట్టిగా కావాలని అడుగుతున్న నెట్ న్యూట్రాలిటీకి, ఫ్రీ బేసిక్స్‌కు చాలా తేడా ఉంది. ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ, అన్ని సైట్లకూ ఉచితంగా యాక్సెస్ ఉండాలన్నది నెట్ న్యూట్రాలిటీ కావాలంటున్నవాళ్ల వాదన. కానీ ఫేస్బుక్ మాత్రం ఫ్రీ బేసిక్స్ కావాలంటూ తన సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది, చేయిస్తోంది. ఇప్పటికే దాదాపు 32 లక్షల మంది ప్రజలు ఫ్రీ బేసిక్స్‌ను నిషేధించవద్దంటూ ట్రాయ్‌కి పిటిషన్లు పెట్టారు. మీ ఫ్రెండ్స్ ఈ పిటిషన్ పెట్టారు, మీరు కూడా చేరండంటూ ఫేస్బుక్ యూజర్లకు పదే పదే మెసేజిలు, నోటిఫికేషన్లు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామీణ భారతానికి ఇంటర్నెట్ ఉచితంగా అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని, దీన్నినిషేధించవద్దని జుకెర్బెర్గ్ కోరుతున్నాడు. -
ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ యాప్‌లో మరిన్ని వెబ్సైట్లు
న్యూఢిల్లీ: అందరికీ ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ‘ఫ్రీ బేసిక్స్’ (గతంలో ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్) యాప్ పరిధిని భారత్‌లో మరింత విస్తరించింది సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్. ఫ్రీ బేసిక్స్‌లో ప్రస్తుతం 32 యాప్స్, వెబ్‌సైట్స్ అం దుబాటులో ఉండగా.. తాజాగా ఈ సంఖ్యను 80కి పెంచింది. వైద్యం, విద్య, ఉద్యోగావకాశాలు వంటి సమాచారం అందించే యాప్స్, వెబ్‌సైట్స్ వీటిలో ఉన్నాయి. ఆర్‌కామ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఫ్రీ బేసిక్స్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.