ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌కు ట్రాయ్ ఝలక్
న్యూఢిల్లీ: ఫ్రీ బేసిక్స్ సర్వీసుకు మద్దతు కూడగట్టుకునేందుకు ఉధృత ప్రచారం సాగిస్తున్న సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్‌కు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. నెట్ న్యూట్రాలిటీ పై అభిప్రాయాలు పంపమంటే ఫ్రీ బేసిక్స్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున కామెంట్స్ రావడంపై ట్రాయ్ స్పందించింది. న్యూట్రాలిటీపై చర్చాపత్రంలో ప్రస్తావించిన నిర్దిష్ట అంశాలపై స్పందించాలి తప్ప ఫ్రీ బేసిక్స్‌కు అనుకూలంగా ఫేస్‌బుక్ రూపొందించిన నమూనా (టెంప్లేట్) పంపితే కుదరదని పేర్కొంది.
సదరు అంశాలపై అభిప్రాయాలు తెలపాలంటూ ఆయా ఈమెయిల్స్‌ను పంపినవారికి సూచించాలని నిర్ణయించింది. ‘మేము విభిన్న చార్జీల విధానం, న్యూట్రాలిటీ (ఇంటర్నెట్ సేవల్లో టెల్కోలు తటస్థ వైఖరితో వ్యవహరించడం) గురించి అడిగితే.. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతు పలుకుతూ బోలెడన్ని మెయిల్స్ వచ్చాయి. ఇది.. మేం అడిగిన ప్రశ్న ఒకటైతే.. వారు మరో ప్రశ్నకు జవాబు రాసినట్లుగా ఉంది. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతు పలకడమనేది.. మేం అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇచ్చినట్లవుతుందనేది అర్థం చేసుకోవడం కష్టంగా మారింది’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఈ కామెంట్స్‌ను బుట్టదాఖలు చేయొచ్చని, కానీ మెయిల్స్ చేసిన వారు అందుకోసం ఎంతో కొంత సమయం వెచ్చించి ఉంటారు కనుక... అభిప్రాయాలు పంపేందుకు గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు.