న్యూఢిల్లీ: ‘నేను కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉండగా ఫేస్‌బుక్‌కు చెందిన ఫ్రీ బేసిక్స్ విధానానికి అనుమతి ఇవ్వలేదు’ అని న్యాయశాఖ, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం చెప్పారు. ‘ప్రజలు ఇంటర్నెట్‌ను వినియోగించుకునేందుకు వారికి ఉన్న హక్కును నిరాకరించలేం. ఫ్రీ బేసిక్స్ కింద కొన్ని వెబ్‌సైట్లను మాత్రమే ఉచితంగా అందిస్తామని ఫేస్‌బుక్ చెప్పింది. భారత్ ఇలాంటి విధానాలను ఆమోదించదు’ అని ప్రసాద్ డిజిటల్ ఇండియా సదస్సులో అన్నారు. ఇంటర్నెట్ సమానత్వంపై అమెరికా తన వైఖరిని నిర్ణయించుకోవాలని ఆయన కోరారు.
ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రకాల ఇంటర్నెట్ సేవలు అందించాల్సిందేననీ, ఇది రాజీలేని అంశమని భారత్ మొదటి రోజు నుంచీ వాదిస్తోందన్నారు. కొన్ని వెబ్‌సైట్లను ఉచితంగా, మరికొన్ని వెబ్‌సైట్లను చార్జీలు చెల్లించి బ్రౌజ్ చేసేలా రిలయన్స్‌తో కలసి ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌ను, ఎయిర్‌టెల్ ‘ఎయిర్‌టెల్ జీరో’ విధానాన్ని గతంలో తీసుకురావడం తెలిసిందే. ఆ తర్వాత ఇలా ఒక్కో వెబ్‌సైట్‌కు ఒక్కో స్పీడ్‌ను, రేటును నిర్ణయించడం వివక్ష కిందకు వస్తుందనీ, ఇలాంటి వాటిని తాము ఉపేక్షించబోమంటూ భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వాటిని నిషేధించింది. నెట్ సమానత్వానికి అనుకూలంగా ట్రాయ్ సిఫార్సులు చేసింది. వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment