తటస్థ ‘నెట్’కే ట్రాయ్ ఓటు | TRAI rules in favour of Net neutrality | Sakshi
Sakshi News home page

తటస్థ ‘నెట్’కే ట్రాయ్ ఓటు

Published Tue, Feb 9 2016 12:56 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

తటస్థ ‘నెట్’కే ట్రాయ్ ఓటు - Sakshi

తటస్థ ‘నెట్’కే ట్రాయ్ ఓటు

►  ఫేస్‌బుక్‌కు చుక్కెదురు..
వెబ్‌సైటుకో రేటు కుదరదు
టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టీకరణ
చూసే వెబ్‌సైట్లను బట్టి చార్జీలు మార్చొద్దు
ఇంటర్‌నెట్ అందరికీ న్యూట్రల్‌గానే ఉండాలి
కొన్ని సైట్లే ఫ్రీగా ఇస్తామన్న ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బ
ఫ్రీ బేసిక్స్‌తో పాటు ‘ఎయిర్‌టెల్ జీరో’కూ షాక్
నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు కనిష్టంగా రూ.50,000 జరిమానా
గరిష్టంగా రూ.50 లక్షల వరకూ వసూలు

 
ఫ్రీ బేసిక్స్ పేరిట తాను ఎంపిక చేసిన కొన్ని వెబ్‌సైట్లను మొబైల్ వినియోగదారులకు ఉచితంగా ఇస్తానంటూ వందల కోట్ల రూపాయలతో ప్రచారం ఊదరగొట్టిన ‘ఫేస్‌బుక్’కు గట్టి దెబ్బ తగిలింది. ఫేస్‌బుక్‌తో జతకట్టిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు... ‘జీరో’ పేరిట కొన్ని వెబ్‌సైట్లు చూస్తే డేటా చార్జీలు ఉండవంటూ మినహాయించిన ఎయిర్‌టెల్‌కు కూడా షాక్ తగిలింది. దేశంలో ఇంటర్నెట్ సర్వీసులందించే ఏ సంస్థ కూడా.. కంటెంట్ (వెబ్‌సైట్లు) ఆధారంగా చార్జీల్లో ఎక్కువ తక్కువ వసూలు చేయకూడదని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) స్పష్టం చేసింది. అంటే ఇప్పటి మాదిరిగా ఏ సంస్థ అయినా తానందించే ఇంటర్‌నెట్ స్పీడు ఆధారంగా మాత్రమే రకరకాల చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే నిర్దిష్ట స్పీడుతో కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు ఆ పరిధిలో ఏ వెబ్‌సైట్‌ను చూసినా అవే చార్జీలు చెల్లిస్తాడు. అంతేతప్ప ఫేస్‌బుక్, వాట్సాప్‌లు మాత్రమే ఫ్రీగా ఇస్తామంటే కుదరదు. ఇదీ ట్రాయ్ స్పష్టం చేసిన నెట్‌న్యూట్రాలిటీ..
 
 న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సేవలకు సంబంధించి దుమారం రేపిన నెట్ న్యూట్రాలిటీ వివాదానికి ట్రాయ్ తెరదింపింది. నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. వివిధ సైట్ల వినియోగాన్ని బట్టి రకరకాల చార్జీలు విధించడం కుదరదని టెలికం కంపెనీలకు తేల్చి చెప్పింది. ఈ నిబంధన పాటించని పక్షంలో, ఎన్నాళ్లు ఉల్లంఘిస్తే అన్ని రోజులూ రోజుకు రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. డేటా సేవలకు సంబంధించి వివక్షాపూరిత టారిఫ్‌లను నిషేధిస్తూ రూపొందించిన 2016 నిబంధనావళిని సోమవారం ఢిల్లీలో ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ ఆవిష్కరించారు. ఇంటర్నెట్‌లో లభించే దేనికీ వివిధ రకాల టారిఫ్‌లు ఉండకూడదన్నది తమ ఉద్దేశమని, నిబంధనల్లో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశామని ఆయన తెలిపారు. కొత్త నిబంధనలను ఉల్లంఘించే పథకాలను ఆరు నెలల్లోగా కంపెనీలు ఉపసంహరించుకోవాలని శర్మ స్పష్టం చేశారు.
 
  ‘‘కంటెంట్‌ను బట్టి డేటా సేవలకు రకరకాలుగా చార్జీలు విధించేలా ఇంటర్నెట్ కంపెనీలతో టెలికం సర్వీసు ప్రొవైడర్లు ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదు. అయితే, అత్యవసర సర్వీసులకు ఉపయోగపడే వాటి విషయంలో మాత్రం సర్వీసు ప్రొవైడర్లు కొంత టారిఫ్‌ను తగ్గించవచ్చు. ఈ ఎమర్జెన్సీ సర్వీసులు ఏమిటనేది కూడా మేం ప్రత్యేకంగా నిర్వచించలేం. ఇలాంటి వాటికి సంబంధించి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లే మాకు ఏడు పనిదినాల్లోగా వివరాలివ్వాలి’’ అని శర్మ వివరించారు.
 
 ఫేస్‌బుక్, ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ...
ఇంటర్నెట్ ఆధారిత కాల్స్‌కు వేరుగా చార్జీలు వసూలు చేయాలని 2014 డిసెంబర్లో ఎయిర్‌టెల్ నిర్ణయించడంతో నెట్ న్యూట్రాలిటీపై వివాదం రేగింది. అప్పటికి ఎయిర్‌టెల్ వెనక్కి తగ్గింది. ఆపై సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్’... ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ పేరిట తాను ఎంపిక చేసిన కొన్ని వెబ్‌సైట్లను ఫ్రీగా ఇస్తానంటూ ముందుకొచ్చింది. దాంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ జతకట్టింది. ‘అవసరమైన’ కొన్ని వెబ్‌సైట్లను ఫ్రీగా ఇవ్వటం వల్ల అందరికీ ఇంటర్నెట్ అందుతుందని, ఇంటర్నెట్‌కు అలవాటు పడతారు కనక తరవాత వారు పెయిడ్ వినియోగదారులుగా మారతారని ఫేస్‌బుక్ ప్రచారం చేసింది.
 
 ఒకవంక అందరికీ అలవాటు చేయటానికే ఇలా ఫ్రీగా ఇస్తున్నట్లు చెబుతూ... మరోవంక దేశంలో చాలా మంది ఇంటర్నెట్‌కు డబ్బులు ఖర్చుచేసే స్థితిలో లేరని, వారికోసమే ఇలా ఫ్రీగా ఇస్తున్నామని కూడా ప్రచారం చేసింది. అసలుకివి రెండూ ఒకదానితో ఒకటి పొసగని వాదనలు. వాస్తవానికైతే ఫేస్‌బుక్ తనకు నచ్చిన, తన నిబంధనలకు అంగీకరించిన అతికొద్ది సైట్లను అందరికీ ఫ్రీగా ఇవ్వటం ద్వారా... మిగిలిన సైట్లు ఎవ్వరూ చూడకుండా చేసి, ఇంటర్నెట్‌పై గుత్తాధిపత్యం సంపాదించటానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలొచ్చాయి. దీనిపై నిరసనలు రేగటంతో ఫేస్‌బుక్ వెనక్కి తగ్గింది. ఆ తరవాత ‘ఫ్రీ బేసిక్స్’ పేరిట ఇంటర్నెట్.ఆర్గ్ అనే కొత్త పేరుతో మరోసారి తెరపైకి తెచ్చింది. దానికోసం వందల కోట్ల రూపాయలతో మీడియాలో ప్రకటనలు కూడా ఇచ్చింది.

ఫ్రీబేసిక్స్ వ్యతిరేకులను విమర్శిస్తూ..  ఫేస్‌బుక్ తమకు మద్దతునివ్వాలంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించింది. ఫ్రీ బేసిక్స్‌కు మద్దతిస్తున్నట్లుగా ఫేస్‌బుక్ వాడకందార్లచేత ట్రాయ్‌కి మెసేజీలు కూడా పంపించింది. ట్రాయ్‌కి వచ్చిన 24 లక్షల కామెంట్లలో అత్యధికం ఫ్రీబేసిక్స్‌కు మద్దతుగానే ఉన్నాయి. ఇదంతా చూసిన ట్రాయ్... తాను నెట్ న్యూట్రాలిటీపై జనాన్ని అభిప్రాయం అడిగానని, వాళ్లంతా ఫ్రీబేసిక్స్‌కు మద్దతుగా సందేశాలెందుకు ఇస్తున్నారని ఆగ్రహం కూడా వ్యక్తంచేసింది. చివరకు తాజా నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలపై ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ‘‘ఫ్రీ బేసిక్స్‌తో మరింత మందికి ఇంటర్నెట్‌ను చేరువ చేయాలన్నదే మా లక్ష్యం. కానీ ట్రాయ్ నిబంధనలు మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేశాయి’’ అన్నారు. ఇంటర్నెట్ విస్తృతికి తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.
 
 ఎయిర్‌టెల్‌ది కూడా ఇలాంటి వ్యవహారమే. ఎయిర్‌టెల్ జీరో పేరిట ఇపుడు కొన్ని వెబ్‌సైట్లతో కూడిన ప్యాకేజీని చౌకగా అందిస్తోంది. తానే కొన్ని మ్యూజిక్ యాప్‌లు విడుదల చేసి... వాటిలో డౌన్‌లోడ్లకు తక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఇవన్నీ ట్రాయ్ నిర్ణయంతో వెనక్కి పోనున్నాయి. టెలికం కంపెనీలు ట్రాయ్ నిబంధనలపై స్పందిస్తూ... స్వేచ్ఛా విపణిలో తమ హక్కులపై దాడిగా దీన్ని వర్ణించాయి. ఇది దేశవ్యాప్తంగా నెట్ కనెక్టివిటీ విస్తృతికి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నాయి. అసలు నెట్ న్యూట్రాలిటీకి నిర్వచనం ఇవ్వకుండా ట్రాయ్ నిర్దిష్ట పథకాలను పూర్తిగా నిషేధించడం సరికాదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
 
 రెండేళ్ల తర్వాత సమీక్ష..
 స్వభావాన్ని బట్టి కొన్ని ప్రత్యేక పథకాలకు అనుమతి ఇవ్వవచ్చన్న టెలికం విభాగ అధికారుల కమిటీ సూచనలను కూడా ట్రాయ్ తోసిపుచ్చింది. టెల్కోలు సొంతంగా తమ కస్టమర్లకు మూవీ, మ్యూజిక్ యాప్స్ మొదలైన వాటిని తక్కువ రేట్లకే అందిస్తున్నాయి. దీనిపై స్పందించిన శర్మ... ‘‘నెట్‌పై అందుబాటులో ఉండే దేనికీ కూడా వివిధ రకాల చార్జీలు ఉండకూడదు. ఇంటర్నెట్‌లో ఏదైనా ఉచితంగా లభిస్తుంటే ఉచితంగానూ, చార్జీలు వర్తిస్తే చార్జీలు విధించేలాగానే నెట్ సర్వీసులుండాలి. తారతమ్యం ఉండకూడదు. ఈ నిబంధనలను రెండేళ్ల తర్వాత లేదా టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో అవసరమైతే అంతకన్నా ముందైనా సమీక్షించే  అవకాశం ఉంది’’ అని శర్మ తెలియజేశారు.
 
న్యూట్రాలిటీ మద్దతుదారుల హర్షం..
ట్రాయ్ నిర్ణయాన్ని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, ఐఏఎంఏఐ, తదితర పరిశ్రమ వర్గాలతో పాటు విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నెట్ న్యూట్రాలిటీ మద్దతుదారులు స్వాగతించారు. ఇది భారత్‌లోని ఇంటర్నెట్ యూజర్ల ఘన విజయమని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్వీటర్‌లో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నిబంధనలను ప్రశంసిస్తూ కాంగ్రెస్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మరోవైపు, ట్రాయ్ సరైన నిర్ణయం తీసుకుందని సాఫ్ట్‌వేర్ ఫ్రీడం లా సెంటర్ ఈడీ మిశి చౌదరి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement