ఫ్రీ బేసిక్స్‌పై అనుమానమేల: జుకెర్‌బెర్గ్
'ఫ్రీ బేసిక్స్'.. గత కొన్ని రోజులుగా భారతదేశంలో విపరీతంగా చర్చిస్తున్న అంశం. ఫేస్‌బుక్ దీన్ని బాగా ప్రమోట్ చేస్తుంటే, మన దేశంలో మాత్రం దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్చోపచర్చలు సాగుతున్నాయి. మొబైల్ ఫోన్ల ద్వారా కొన్ని వెబ్‌సైట్లను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఈ ఫ్రీ బేసిక్స్ వల్ల సాధ్యమవుతుంది. దీంతో అందరికీ ఎంతో కొంత వరకు ఇంటర్‌నెట్ అందుతుందన్నది ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బెర్గ్ వాదన. అయితే ఫేస్‌బుక్ సహా కొన్ని సైట్లు మాత్రమే అందుబాటులోకి రావడం సరికాదని, మొత్తం ఇంటర్‌నెట్‌నే అందరికీ ఉచితంగా అందించాలని అంటున్నారు. కానీ జుకెర్‌బెర్గ్ మాత్రం లైబ్రరీ, ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ పాఠశాలల్లా బేసిక్ ఇంటర్‌నెట్ సర్వీసులు అందరికీ అందించాలని వాదిస్తున్నారు. భారతదేశంలో దాదాపు ఏడాదిగా దీనిపై చర్చలు జరగడం ఆశ్చర్యకరమని చెప్పాడు. ఉచిత ఇంటర్‌నెట్ సేవలు అందించే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి బదులు దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, అంటే వాళ్లు దాదాపు వంద కోట్ల మందికి ఇంటర్‌నెట్ అందకుండా చేస్తున్నారని అన్నాడు.
అయితే ప్రజలు గట్టిగా కావాలని అడుగుతున్న నెట్ న్యూట్రాలిటీకి, ఫ్రీ బేసిక్స్‌కు చాలా తేడా ఉంది. ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ, అన్ని సైట్లకూ ఉచితంగా యాక్సెస్ ఉండాలన్నది నెట్ న్యూట్రాలిటీ కావాలంటున్నవాళ్ల వాదన. కానీ ఫేస్‌బుక్ మాత్రం ఫ్రీ బేసిక్స్ కావాలంటూ తన సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది, చేయిస్తోంది. ఇప్పటికే దాదాపు 32 లక్షల మంది ప్రజలు ఫ్రీ బేసిక్స్‌ను నిషేధించవద్దంటూ ట్రాయ్‌కి పిటిషన్లు పెట్టారు. మీ ఫ్రెండ్స్ ఈ పిటిషన్ పెట్టారు, మీరు కూడా చేరండంటూ ఫేస్‌బుక్ యూజర్లకు పదే పదే మెసేజిలు, నోటిఫికేషన్లు వస్తున్నాయి. ప్రధానంగా గ్రామీణ భారతానికి ఇంటర్‌నెట్ ఉచితంగా అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని, దీన్నినిషేధించవద్దని జుకెర్‌బెర్గ్ కోరుతున్నాడు.