'నెట్ యాక్సెస్ లేనివాళ్ల సంగతి ఏమిటి?'
న్యూఢిల్లీ: 'ఇంటర్నెట్ న్యూట్రాలిటీకి మేం పూర్తిగా మద్దతునిస్తాం. ప్రపంచవ్యాప్తంగా నెట్ న్యూట్రాలిటీని ఉండాలని మేం కోరుతున్నాం. అదే సమయంలో ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు మేం పనిచేస్తున్నాం'అని ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఇంటర్నెట్ న్యూట్రాలిటీ (సమానత్వాని)కి ఫేస్బుక్ ఆధ్వర్యంలోని ఇంటర్నెట్.ఓఆర్జీ మద్దతునిస్తుందా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఇంటర్నెట్ వినియోగంలో ఎలాంటి వివక్ష, ఆంక్షలు లేకుండా, అందరికీ ఇంటర్నెట్ సేవలు ఒకేరకంగా అపరిమితంగా అందించాలని కోరుతూ ఇంటర్నెట్ న్యూట్రాలిటీ ఉద్యమం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 'ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవాళ్లే ఇంటర్నెట్ న్యూట్రాలిటీ కోసం ఆన్లైన్ పిటిషన్ల ద్వారా ఉద్యమిస్తున్నారు. నెట్ సదుపాయం లేనివాళ్లు సంగతి ఏమిటి.. వారు తమకు యాక్సెస్ కావాలంటూ పిటిషన్పై సంతకం చేయలేరు కదా' అని పేర్కొన్నారు. ఢిల్లీ ఐఐటీలో విద్యార్థులతో ముచ్చటిస్తూ జుకర్బర్గ్ తెలిపిన కీలకాంశాలివి..
- ఆఫ్రికాలో కొత్త తరహా పాఠశాలలు ప్రవేశపెట్టేందుకు మేం పెట్టుబడులు పెడుతున్నాం. భారత్కు కూడా వీటిని తీసుకువస్తామని ఆశిస్తున్నా.
- ఆఫ్గనిస్థాన్లో భూకంపం సమయంలో దాదాపు 30 లక్షలమందికిపైగా తాము సురక్షితంగా ఉన్నామని ఫేస్బుక్లో చెప్పారు. ప్రజలతో అనుసంధానం కావాలన్న మా మిషన్ లక్ష్యం ఇదే.
- భారత్కు చెందిన చాలామంది ఫేస్బుక్, మా అనుబంధ సంస్థ వాట్సప్ ను వినియోగిస్తున్నారు. నాణెనికి మరోవైపు చూస్తే భారత్లో ఇప్పటికీ చాలామందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు.
- ఇంటర్నెట్ ద్వారా విద్య, ఆరోగ్య సమాచారం, ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ప్రతి పది మందికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తే ఒకరికి ఉద్యోగ అవకాశం ఏర్పడుతుంది. తద్వారా అతను పేదరికం నుంచి బయటపడతాడని మా పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఈ విషయంలో భారత్కు ఎంతో అవకాశముంది.
- ఇంటర్నెట్ కనెక్టివిటీ, యాక్సెస్ ఉంటే పేద విద్యార్థులకు మరింత మెరుగైన పాఠశాలలను అందించవచ్చు.
- స్కూళ్లు, ఆస్పత్రులు అందుబాటులో లేనివారికి మా టెక్నాలజీ ద్వారా సహాయం చేయాలని భావిస్తున్నాం.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న కట్టడాలన్నీ యుద్ధ విజయాలను పురస్కరించుకొని నిర్మించిన స్మారకాలే. కానీ తాజ్మహల్ మాత్రం ప్రేమ చిహ్నం. అందుకే అది నన్ను అబ్బురపరిచింది.
టెక్నాలజీ.. సూపర్ న్యాచురల్ పవర్!
మీకు మానవాతీత శక్తులు వస్తే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు జుకర్బర్గ్ బదులిస్తూ.. టెక్నాలజీ అందుబాటులో ఉంటే చాలు మీకోసం మీరు ఎలాంటి మానవాతీత శక్తులైన రూపొందించవచ్చు అని పేర్కొన్నారు.