నేడు ఢిల్లీలో జూకర్బర్గ్ మాటాముచ్చట..
న్యూఢిల్లీ: ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ బుధవారం ఢిల్లీలో ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఢిల్లీ ఐఐటీలో ఏర్పాటుచేయనున్న టౌన్హాల్ మీటింగ్లో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 900 మంది విద్యార్థులు పాల్గొనే అవకాశముంది. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జూకర్బర్గ్ సమాధానం ఇవ్వనున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన ఫేస్బుక్కు భారత్లో 13 కోట్లమంది యూజర్లు ఉన్నారు. యూజర్ల పరంగా భారత్ రెండోస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీలో బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు క్వశ్చన్-ఆన్సర్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మార్క్ జూకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఇదే తరహా టౌన్హాల్ మీటింగ్ ను కాలిఫోర్నియాలోని ఫేస్బుక్ క్యాంపస్లో నిర్వహించారు. ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశం కోసం భారత పర్యటనకు వచ్చిన మార్క్ జూకర్బర్గ్ మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహాల్ను సందర్శించారు. ఈ సందర్భంగా తాజ్ మహాల్ ఫొటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసి.. అత్యద్భుతమని వ్యాఖ్యానించారు.