ఆంక్షలతో ఇంటర్నెట్ అందకుండా చేయొద్దు!
ట్రాయ్ ‘నెట్ న్యూట్రాలిటీ’ నిబంధనలపై ఫేస్‌బుక్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌పై విధించే ఆంక్షలు, నియంత్రణల వల్ల... ప్రజలందరికీ ఇంటర్నెట్ అందకూడని పరిస్థితి ఏర్పడ కూడదని ఫేస్‌బుక్ సంస్థ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. పలు వెబ్‌సైట్లు, సర్వీసులను ఉచితంగా అందించేలా తీసుకువచ్చిన ‘ఫ్రీబేసిక్స్’ ప్లాట్‌ఫామ్‌కు మద్దతు కూడగట్టడంలో భాగంగా ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీ నిబంధనలపై ఆ సంస్థ ఈమెయిల్ యుద్ధం ప్రారంభించింది. ‘ఫ్రీబేసిక్స్’ ప్లాట్‌ఫామ్‌కు అనుమతివ్వడమంటే ఇంటర్నెట్‌లో కొన్ని సంస్థలు, వెబ్‌సైట్లకు గుత్తాధిపత్యం ఇవ్వడమేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ‘ఇంటర్నెట్ తటస్థత (నెట్ న్యూట్రాలిటీ)’కు ఫ్రీ బేసిక్స్ భంగకరమంటూ ట్రాయ్ పలు నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అయితే ఈ అంశంలో ప్రజాభిప్రాయం సేకరించేందుకు సిద్ధమైంది. దీనికి గురువారంతో గడువు ముగుస్తోంది కూడా. ఈ నేపథ్యంలో ఫ్రీబేసిక్స్‌కు మద్దతు కూడగట్టుకునేందుకు ఫేస్‌బుక్ సంస్థ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలు ఇవ్వడంతోపాటు ఈమెయిల్ ప్రచారాన్నీ చేపట్టింది.