భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రవహించే సమా చారాన్ని అంతరాల దొంతరల్లో బంధించి దాన్ని దారీ తెన్నూ లేకుండా చేయాలను కున్నవారు ఓటమిపాలయ్యారు. సర్వ స్వతంత్రమైన, స్వేచ్ఛాపూరితమైన ఇంటర్నెట్ వ్యవస్థ కోసం ఉద్యమించినవారికే అంతిమ విజయం దక్కింది. ఇంటర్నెట్ సేవల్లో వివక్షాపూరిత విధానాలు చెల్లవని టెలికాం నియంత్రణా వ్యవస్థ ట్రాయ్ సోమవారం తేల్చిచెప్పింది.
వర్తమానకాలంలో ఇంటర్నెట్ ఒక వ్యసనంగా, నిత్యావసరంగా పరిణమించడం కాదనలేని సత్యం. ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్ వంటి సంస్థలు చూస్తుండగానే లక్షల కోట్లకు పడగలెత్తడం ఇందువల్లే. కొన్ని ఎత్తుగడలతో ఈ లాభాలను మరిన్ని వందల రెట్లు పెంచుకోవచ్చునని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ భావించిన పర్యవసానంగా ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ఆవిర్భవించింది. అవసరమైన కొన్ని వెబ్‌సైట్లను ఉచితంగా అందించ డమే దీని ప్రధానోద్దేశమంటూ ఊరించి తీసుకొచ్చిన ఈ కొత్త ఆలోచనను ఆదిలోనే అందరూ తిప్పికొట్టారు.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదన్న ఉద్యమం బయ ల్దేరింది. భారత్‌లో ‘ఉచితం’ అని పేరు పెడితే ఎలాంటి అనుచిత విధానాన్నయినా చలామణి చేయడం సాధ్యమన్న ఆలోచనతో కావొచ్చు... ఈమధ్యే ‘ఫ్రీ బేసిక్స్’ పేరిట ఫేస్‌బుక్ వివిధ రకాల మాధ్యమాల్లో వాణిజ్య ప్రకటనలతో హోరెత్తించింది. అందుకు వందలాది కోట్లు ఖర్చు చేసింది. ఇంటర్నెట్‌కు విధించాలనుకుంటున్న పరిమితులకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి చేసిన ఈ ప్రయత్నం కొంతమేర సఫలమైంది కూడా.
ఈ పోకడలపై దృష్టి సారించి, దీనిపై ఒక విధానాన్ని ప్రకటించే పనిలో నిమగ్నమైన ట్రాయ్‌కు ‘ఫ్రీ బేసిక్స్’ను ఆమోదించే లక్షలాది సందేశాలు చేరాయి. అయితే తమ పరిశీలన ఇంటర్నెట్‌కు పరిమితులు ఉండవచ్చునా లేదా అన్న అంశంపైనే తప్ప... ‘ఫ్రీ బేసిక్స్’ అనుకూల, వ్యతిరేక అభిప్రాయాల సేకరణకు కాదని ట్రాయ్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పి గాలి తీసింది.
ట్రాయ్ వెలువరించిన నిర్ణయం ఇటీవలికాలంలో ఎన్నదగినది. ఇంటర్నెట్‌లో లభించే డేటాకు దాని అవసరాన్నిబట్టి వేర్వేరు ధరలు నిర్ణయించి వసూలు చేయొచ్చునన్నది ‘ఫ్రీ బేసిక్స్’లోని ఆంతర్యం. ఒకవైపు ఉచితం అంటూనే అటు వినియోగదారుడినుంచీ, ఇటు వెబ్‌సైట్ సంస్థనుంచీ ఏకకాలంలో డబ్బు గుంజడం ఈ విధానంలో కీలకాంశం. ఫలితంగా వారు డిమాండ్ చేసిన సొమ్ము చెల్లించగల సంస్థలు సైబర్ ప్రపంచంలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వెలగబెడతాయి. ఆ వెబ్‌సైట్లే వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. అలాగే టెలికాం సంస్థలు అడిగిన మేర చెల్లించగలిగే వినియోగదారులకే నిర్దేశిత వెబ్‌సైట్ లభ్యమవు తుంది. మిగిలినవారికి అది తెరుచుకోదు. మరోవిధంగా చెప్పాలంటే మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ‘వీఐపీ సంస్కృతి’ ఇంటర్నెట్‌లో చొరబడుతుంది. డబ్బుతో ధగధగలాడే సంస్థలు మెరుపు వేగంతో వినియోగదారులకు చేరతాయి. అది సాధ్య పడని సంస్థలు మందగమనంతో మిగిలిపోతాయి. వినియోగదారులకు ఎంతకీ తెరుచుకోవు. ఇప్పుడు స్కైప్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఉచితంగా లభించే సేవలు కొనుక్కోవడం తప్పనిసరవుతుంది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఇంటర్నెట్‌లో ఎలాంటి వివక్షకూ తావు లేకుండా అన్ని రకాల డేటా అందరికీ అందుబాటులో ఉంటున్నది.
అందువల్ల ప్రపంచంలో ఏమూలనున్నవారైనా తమ అభిప్రాయా లనూ, ఆలోచనలనూ, ఉద్దేశాలనూ స్వేచ్ఛగా ప్రపంచం ముందు ఉంచగలుగుతు న్నారు. ఏ అన్యాయమైనా, అక్రమమైనా జనం ముందు... దృశ్యరూపంలో కావొచ్చు, అక్షరాల్లో కావొచ్చు క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. వారిలో ఆగ్రహావేశా లను రగిలిస్తున్నది. వారిని కార్యాచరణకు పురిగొల్పుతున్నది. ఔత్సాహికులెందరో తమ సృజనాత్మకతను చాటి లబ్ధిపొందుతున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారు సైతం అందరికీ చేరువకాగలుగుతున్నారు. వివిధ రకాల ధరవరలు నిర్ణయిం చడంవల్ల ఇలాంటివన్నీ సామాన్య పౌరులకు దూరమవుతాయి. డబ్బే దేన్నయినా నిర్దేశిస్తుంది. ఈ ప్రమాదాన్ని ట్రాయ్ తాజా నిర్ణయం నివారించగలిగింది.
పౌరులు అప్రమత్తంగా లేకుంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. నిరుడు జనవరిలో ఒకరిద్దరు ప్రారంభించిన ‘తటస్థ ఇంటర్నెట్’ ఉద్యమం చూస్తుండగానే నలువైపులా విస్తరించింది. ఈ సైబర్ ఉద్యమకారులు ఎప్పుడూ ఒకచోట కలుసుకు న్నది లేదు. డాక్టర్లు, న్యాయవాదులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, పాత్రికేయులు, కళాకారులు, రచయితలు... ఇంకా ఎందరెందరో తమ తమ వృత్తులను కొనసాగిస్తూనే తటస్థ ఇంటర్నెట్ అవసరాన్ని అందరికీ అర్ధమ య్యేలా విశదీకరించారు. అందులో పొంచివున్న ప్రమాదాలను విప్పిచెప్పారు. ఇప్పటికైతే ఇది సెల్‌ఫోన్లకే, అందులో వాడే యాప్‌లకే పరిమితమైనా...చాలా త్వరగానే అన్నిటిలోకీ చొచ్చుకొచ్చి సమాచార ప్రసారానికి గుదిబండలా మారు తుందని వివరించగలిగారు.
అందువల్ల కలిగే నష్టాలను విప్పిచెప్పారు. ఇంట ర్నెట్‌కు ఖరీదు కట్టే షరాబులొస్తే ఏమవుతుందో ఎవరికి తోచిన రూపాల్లో వారు చెప్పారు. వీడియోల ద్వారా, కార్టూన్లద్వారా చైతన్యం తెచ్చారు. ఈ ఉద్య మంలో అందరూ కార్యకర్తలే. నాయకులు లేరు. ఇంతమంది ఇన్నివిధాల చేయబట్టే... అన్నివైపులనుంచీ తీవ్ర వ్యతిరేకత రాబట్టే ట్రాయ్ సరైన నిర్ణయం తీసుకోగలిగింది. మన దేశంలో సాగిన తటస్థ ఇంటర్నెట్ ఉద్యమం అమెరికా, యూరప్ దేశాల పౌరుల్లో కూడా పునరాలోచన తీసుకురాగలిగింది. ఆ విషయంలో తమ ప్రభు త్వాలు తీసుకున్న నిర్ణయాలను మార్చేలా అక్కడ ఒత్తిళ్లు వస్తున్నాయి.
ఇప్పుడు ట్రాయ్ నిబంధనల ప్రకారం తటస్థ ఇంటర్నెట్‌కు భిన్నంగా వ్యవహరించే సంస్థలకు రోజుకు రూ. 50,000 నుంచి రూ. 50 లక్షల వరకూ జరిమానా విధించే వీలుంటుంది. ఇంటర్నెట్‌లో లభించే ఏ రకం డేటాకైనా వివిధ రకాల టారిఫ్‌లు ఉండరాదని ట్రాయ్ తాజా నిబంధనావళి స్పష్టం చేస్తున్నది. అయితే అవసరమైన సందర్భాల్లో సర్వీసు ప్రొవైడర్లు కొన్ని సేవలకు టారిఫ్‌ను తగ్గించ వచ్చునని చెబుతోంది. ట్రాయ్ తీర్పు శృంఖలాలులేని ఇంటర్నెట్‌ను కోరుకునేవారి విజయం. భావప్రకటనాస్వేచ్ఛను గౌరవించేవారందరి విజయం. అప్రమత్తంగా ఉంటే ఎలాంటి అక్రమాన్నయినా అడ్డుకోవచ్చునని ఈ విజయం నిరూపించింది.
తటస్థతే విజేత!
Published Wed, Feb 10 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement
Advertisement