Internet System
-
అదే జరిగితే ఇంటర్నెట్ బంద్
Solar Super Strom: ‘‘సౌర తుపాను వచ్చేస్తోంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం’’ అంటూ గత కొంతకాలంగా భూమికి దడ పుట్టిస్తున్న ప్రచారం, సైంటిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జులై మధ్యలో ‘సౌర తుపాను’ దాటేసిందన్న కొన్ని మీడియా హౌజ్‌ల కథనాలు.. ఉత్తవేనని తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సౌర తుపాను ముప్పు మాత్రం భూమికి పొంచి ఉందని.. అది జరిగితే మాత్రం ఇంటర్నెట్ ఆగిపోయి కోలుకోలేని నష్టం చవిచూడాల్సి వస్తోందని చెప్తున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్‌కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి. ‘సౌర తుపానుల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థపై ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు మొత్తం వ్యవస్థ ఆగిపోతుంది. ఇది కరోనా మహమ్మారిలాగే విరుచుకుపడొచ్చు’ అని ఆమె చెప్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉంటుందని అబూ జ్యోతి చెబుతున్నారు. My SIGCOMM talk on the impact of solar superstorms on the Internet infrastructure is now online: https://t.co/L6Nl2Yygcs There were many interesting questions in the Q&A session. Paper: https://t.co/Wsv4RC2pbZ https://t.co/Y9ElvF7fTa — Sangeetha Abdu Jyothi (@sangeetha_a_j) August 29, 2021 సిగ్‌కామ్ 2021(SIGCOMM 2021) పేరుతో జరిగిన డేటా కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సౌర తుపానుల మీద ఆమె సమర్పించిన ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సౌర తుపాన్ గనుక భూమిని తాకితే.. ఆ ప్రభావంతో గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోనుందని ఆమె అంటున్నారు. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరించడం విశేషం. చదవండి: సౌర తుపాన్‌తో అప్పుడు ఆఫీసులు కాలిపోయాయి కరోనా తరహాలోనే.. సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు చూపెడుతుంది? ఎన్నిరోజుల్లో తిరిగి యధాస్థితికి తీసుకురావొచ్చు అనే విషయాలపై మాత్రం ఇప్పుడే అంచనాకి రాలేం. ఒక రకంగా ఇది కరోనా మహమ్మారి లాంటిది. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా లేదు. నష్టం కూడా ఊహించినదానికంటే భారీగానే ఉంటుంది అని ఆమె అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిజంగా సౌరతుపాను గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చని ఆమె అంటున్నారు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనే చెప్తున్నారు. అయితే అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుందని చెప్తున్నారామె. సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. చదవండి: సౌర తుపాను వేగం ఎంతంటే.. -
బిట్కాయిన్లతో.. ఇంటర్నెట్కు ముప్పు: బీఐఎస్
జ్యూరిక్: బిట్కాయిన్ల వంటి డిజిటల్ కరెన్సీలతో ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) హెచ్చరించింది. వీటివల్ల స్టోరేజీతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాలపరమైన సమస్యలు తలెత్తుతాయని ఒక నివేదికలో పేర్కొంది. కంప్యూటర్స్ ద్వారా ప్రాసెస్ అయ్యే ఈ డిజిటల్ కరెన్సీల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం స్మార్ట్‌ఫోన్స్, సాధారణ కంప్యూటర్స్‌తో పాటు సూపర్ కంప్యూటర్స్కి కూడా అలవి కాని పరిస్థితి తలెత్తుతుందని, ఫలితంగా మొత్తం సర్వర్ల వ్యవస్థ అంతా నిల్చిపోయే ముప్పు ఉందని బీఐఎస్ తెలిపింది. సార్వభౌమ కరెన్సీలకు భిన్నమైన ఈ కరెన్సీలు విశ్వసనీయమైనవి కావని పేర్కొంది. వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులన్నింటికీ సెంట్రల్ బ్యాంకుగా బీఐఎస్‌ను పరిగణిస్తారు. ప్రస్తుతం 1.7 కోట్ల బిట్కాయిన్లు చలామణీలో ఉన్నాయి. బిట్కాయిన్ల వ్యవస్థలో ఈ సంఖ్య 2.1 కోట్లకు మించడానికి లేదు. కొన్నేళ్ల క్రితం కేవలం కొన్ని సెంట్స్ స్థాయిలో ఉన్న బిట్‌కాయిన్ విలువ గతేడాది ఆఖర్లో ఏకంగా 19,500 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన వారిని కుబేరులుగా మార్చేసింది. భారత్ సహా పలు దేశాల్లో వీటిపై ఆంక్షలు ఉన్నాయి. -
నేటి నుంచి ఐకాన్ సదస్సు
- హెచ్ఐసీసీ వేదికగా జరిగే సదస్సుకు 80 దేశాల ప్రతినిధుల రాక - 5న హాజరుకానున్న కేంద్ర మంత్రి రవిశంకర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: హెచ్ఐసీసీ వేదికగా నేటి నుంచి ఐకాన్(ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్) 57వ సదస్సు జరుగనుంది. ఇంటర్నెట్కు సంబంధించి ముఖాముఖి చర్చలు, ఐరాస తరహాలో కొత్త వ్యవస్థ, స్థానిక భాషల్లో వెబ్ అడ్రస్‌ల ఏర్పాటు వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సదస్సులో చర్చించనున్నారు. ఇంటర్నెట్ గవర్నెన్స్‌లో వెబ్సైట్లకు ఐటీ అడ్రస్, నంబర్లు కేటాయించే ఐకాన్ అంతర్జాతీయ సంస్థ, కేంద్ర, రాష్ట్రాల సహకారంతో నేటి నుంచి 9 వరకు జరగనున్న ఈ సదస్సులో సుమారు 3,500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. వీరిలో 80 దేశాలకు చెందిన సుమారు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశాలున్నాయని అంచనా. ఐకాన్ సంస్థలో భారత్‌సహా 165 దేశాలకు సభ్యత్వముంది. ప్రతి ఏటా ఒక్కో చోట ఐకాన్ సదస్సు నిర్వహిస్తుండగా ఈసారి హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా మారింది. ఈనెల 5న జరిగే కార్యక్రమంలో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు పాల్గొననున్నారు. పలువురు అంతర్జాతీయ ఐటీ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సులో ఇంటర్నెట్ వినియోగదారులు, డిజిటల్ ఇండియా కార్యక్రమాలకు ఉపయోగపడేలా వినూత్న నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశ జనాభాలో ప్రస్తుతం మూడో వంతు ఇంటర్నెట్ పరిధిలో ఉండగా, రాబోయే రోజుల్లో సగం జనాభా నెట్ పరిధిలోకి వస్తారని రాష్ట్ర ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యవస్థ నియంత్రణ అధికారం అమెరికా చేతుల్లోనే ఉండగా, తాజాగా ఒప్పంద గడువు ముగుస్తుండటంతో ఐక్యరాజ్యసమితి తరహాలో ఇంటర్నెట్ను నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఐటీ ప్రముఖులు హాజరయ్యే ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ తెలంగాణ, టీ హబ్ కార్యక్రమాలను వివరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. -
తటస్థతే విజేత!
భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రవహించే సమా చారాన్ని అంతరాల దొంతరల్లో బంధించి దాన్ని దారీ తెన్నూ లేకుండా చేయాలను కున్నవారు ఓటమిపాలయ్యారు. సర్వ స్వతంత్రమైన, స్వేచ్ఛాపూరితమైన ఇంటర్నెట్ వ్యవస్థ కోసం ఉద్యమించినవారికే అంతిమ విజయం దక్కింది. ఇంటర్నెట్ సేవల్లో వివక్షాపూరిత విధానాలు చెల్లవని టెలికాం నియంత్రణా వ్యవస్థ ట్రాయ్ సోమవారం తేల్చిచెప్పింది. వర్తమానకాలంలో ఇంటర్నెట్ ఒక వ్యసనంగా, నిత్యావసరంగా పరిణమించడం కాదనలేని సత్యం. ఫేస్బుక్, గూగుల్, ట్విటర్ వంటి సంస్థలు చూస్తుండగానే లక్షల కోట్లకు పడగలెత్తడం ఇందువల్లే. కొన్ని ఎత్తుగడలతో ఈ లాభాలను మరిన్ని వందల రెట్లు పెంచుకోవచ్చునని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ భావించిన పర్యవసానంగా ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ఆవిర్భవించింది. అవసరమైన కొన్ని వెబ్సైట్లను ఉచితంగా అందించ డమే దీని ప్రధానోద్దేశమంటూ ఊరించి తీసుకొచ్చిన ఈ కొత్త ఆలోచనను ఆదిలోనే అందరూ తిప్పికొట్టారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదన్న ఉద్యమం బయ ల్దేరింది. భారత్‌లో ‘ఉచితం’ అని పేరు పెడితే ఎలాంటి అనుచిత విధానాన్నయినా చలామణి చేయడం సాధ్యమన్న ఆలోచనతో కావొచ్చు... ఈమధ్యే ‘ఫ్రీ బేసిక్స్’ పేరిట ఫేస్బుక్ వివిధ రకాల మాధ్యమాల్లో వాణిజ్య ప్రకటనలతో హోరెత్తించింది. అందుకు వందలాది కోట్లు ఖర్చు చేసింది. ఇంటర్నెట్కు విధించాలనుకుంటున్న పరిమితులకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి చేసిన ఈ ప్రయత్నం కొంతమేర సఫలమైంది కూడా. ఈ పోకడలపై దృష్టి సారించి, దీనిపై ఒక విధానాన్ని ప్రకటించే పనిలో నిమగ్నమైన ట్రాయ్‌కు ‘ఫ్రీ బేసిక్స్’ను ఆమోదించే లక్షలాది సందేశాలు చేరాయి. అయితే తమ పరిశీలన ఇంటర్నెట్కు పరిమితులు ఉండవచ్చునా లేదా అన్న అంశంపైనే తప్ప... ‘ఫ్రీ బేసిక్స్’ అనుకూల, వ్యతిరేక అభిప్రాయాల సేకరణకు కాదని ట్రాయ్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పి గాలి తీసింది. ట్రాయ్ వెలువరించిన నిర్ణయం ఇటీవలికాలంలో ఎన్నదగినది. ఇంటర్నెట్లో లభించే డేటాకు దాని అవసరాన్నిబట్టి వేర్వేరు ధరలు నిర్ణయించి వసూలు చేయొచ్చునన్నది ‘ఫ్రీ బేసిక్స్’లోని ఆంతర్యం. ఒకవైపు ఉచితం అంటూనే అటు వినియోగదారుడినుంచీ, ఇటు వెబ్సైట్ సంస్థనుంచీ ఏకకాలంలో డబ్బు గుంజడం ఈ విధానంలో కీలకాంశం. ఫలితంగా వారు డిమాండ్ చేసిన సొమ్ము చెల్లించగల సంస్థలు సైబర్ ప్రపంచంలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వెలగబెడతాయి. ఆ వెబ్సైట్లే వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. అలాగే టెలికాం సంస్థలు అడిగిన మేర చెల్లించగలిగే వినియోగదారులకే నిర్దేశిత వెబ్సైట్ లభ్యమవు తుంది. మిగిలినవారికి అది తెరుచుకోదు. మరోవిధంగా చెప్పాలంటే మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ‘వీఐపీ సంస్కృతి’ ఇంటర్నెట్లో చొరబడుతుంది. డబ్బుతో ధగధగలాడే సంస్థలు మెరుపు వేగంతో వినియోగదారులకు చేరతాయి. అది సాధ్య పడని సంస్థలు మందగమనంతో మిగిలిపోతాయి. వినియోగదారులకు ఎంతకీ తెరుచుకోవు. ఇప్పుడు స్కైప్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఉచితంగా లభించే సేవలు కొనుక్కోవడం తప్పనిసరవుతుంది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఇంటర్నెట్లో ఎలాంటి వివక్షకూ తావు లేకుండా అన్ని రకాల డేటా అందరికీ అందుబాటులో ఉంటున్నది. అందువల్ల ప్రపంచంలో ఏమూలనున్నవారైనా తమ అభిప్రాయా లనూ, ఆలోచనలనూ, ఉద్దేశాలనూ స్వేచ్ఛగా ప్రపంచం ముందు ఉంచగలుగుతు న్నారు. ఏ అన్యాయమైనా, అక్రమమైనా జనం ముందు... దృశ్యరూపంలో కావొచ్చు, అక్షరాల్లో కావొచ్చు క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. వారిలో ఆగ్రహావేశా లను రగిలిస్తున్నది. వారిని కార్యాచరణకు పురిగొల్పుతున్నది. ఔత్సాహికులెందరో తమ సృజనాత్మకతను చాటి లబ్ధిపొందుతున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారు సైతం అందరికీ చేరువకాగలుగుతున్నారు. వివిధ రకాల ధరవరలు నిర్ణయిం చడంవల్ల ఇలాంటివన్నీ సామాన్య పౌరులకు దూరమవుతాయి. డబ్బే దేన్నయినా నిర్దేశిస్తుంది. ఈ ప్రమాదాన్ని ట్రాయ్ తాజా నిర్ణయం నివారించగలిగింది. పౌరులు అప్రమత్తంగా లేకుంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. నిరుడు జనవరిలో ఒకరిద్దరు ప్రారంభించిన ‘తటస్థ ఇంటర్నెట్’ ఉద్యమం చూస్తుండగానే నలువైపులా విస్తరించింది. ఈ సైబర్ ఉద్యమకారులు ఎప్పుడూ ఒకచోట కలుసుకు న్నది లేదు. డాక్టర్లు, న్యాయవాదులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, సాఫ్ట్వేర్ నిపుణులు, పాత్రికేయులు, కళాకారులు, రచయితలు... ఇంకా ఎందరెందరో తమ తమ వృత్తులను కొనసాగిస్తూనే తటస్థ ఇంటర్నెట్ అవసరాన్ని అందరికీ అర్ధమ య్యేలా విశదీకరించారు. అందులో పొంచివున్న ప్రమాదాలను విప్పిచెప్పారు. ఇప్పటికైతే ఇది సెల్ఫోన్లకే, అందులో వాడే యాప్‌లకే పరిమితమైనా...చాలా త్వరగానే అన్నిటిలోకీ చొచ్చుకొచ్చి సమాచార ప్రసారానికి గుదిబండలా మారు తుందని వివరించగలిగారు. అందువల్ల కలిగే నష్టాలను విప్పిచెప్పారు. ఇంట ర్నెట్‌కు ఖరీదు కట్టే షరాబులొస్తే ఏమవుతుందో ఎవరికి తోచిన రూపాల్లో వారు చెప్పారు. వీడియోల ద్వారా, కార్టూన్లద్వారా చైతన్యం తెచ్చారు. ఈ ఉద్య మంలో అందరూ కార్యకర్తలే. నాయకులు లేరు. ఇంతమంది ఇన్నివిధాల చేయబట్టే... అన్నివైపులనుంచీ తీవ్ర వ్యతిరేకత రాబట్టే ట్రాయ్ సరైన నిర్ణయం తీసుకోగలిగింది. మన దేశంలో సాగిన తటస్థ ఇంటర్నెట్ ఉద్యమం అమెరికా, యూరప్ దేశాల పౌరుల్లో కూడా పునరాలోచన తీసుకురాగలిగింది. ఆ విషయంలో తమ ప్రభు త్వాలు తీసుకున్న నిర్ణయాలను మార్చేలా అక్కడ ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ట్రాయ్ నిబంధనల ప్రకారం తటస్థ ఇంటర్నెట్కు భిన్నంగా వ్యవహరించే సంస్థలకు రోజుకు రూ. 50,000 నుంచి రూ. 50 లక్షల వరకూ జరిమానా విధించే వీలుంటుంది. ఇంటర్నెట్లో లభించే ఏ రకం డేటాకైనా వివిధ రకాల టారిఫ్‌లు ఉండరాదని ట్రాయ్ తాజా నిబంధనావళి స్పష్టం చేస్తున్నది. అయితే అవసరమైన సందర్భాల్లో సర్వీసు ప్రొవైడర్లు కొన్ని సేవలకు టారిఫ్‌ను తగ్గించ వచ్చునని చెబుతోంది. ట్రాయ్ తీర్పు శృంఖలాలులేని ఇంటర్నెట్ను కోరుకునేవారి విజయం. భావప్రకటనాస్వేచ్ఛను గౌరవించేవారందరి విజయం. అప్రమత్తంగా ఉంటే ఎలాంటి అక్రమాన్నయినా అడ్డుకోవచ్చునని ఈ విజయం నిరూపించింది. -
చెన్నై ఐటీ కేరాఫ్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: చెన్నై నగరం నడి సంద్రంగా మారడంతో అక్కడి ఐటీ పరిశ్రమ ఆసాంతం షట్‌డౌన్ అయింది. దాదాపు అన్ని ఐటీ కంపెనీలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ఆన్లైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. టెలిఫోన్, మొబైల్ నెట్వర్క్ ఎక్కడికక్కడ ధ్వంసమవ్వడంతో కుటుంబ సభ్యులకు తమ క్షేమ సమాచారాన్ని అందించేందుకు కూడా వీల్లేకుండా పోయింది. ఆన్లైన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులతో చర్చించేందుకు ఎటువంటి అవకాశం లేకుండా సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. చాలా ప్రాంతాల్లో రోజుల తరబడి విద్యుత్ లేకపోవడంతో చిమ్మ చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఐటీ ప్రాంగణాల్లో ఉండే ఆహ్లాదకర వాతావరణం, అత్యాధునిక సదుపాయాలు సమూలంగా తుడిచిపెట్టుకు పోయాయి. దీంతో చెన్నై ఐటీ పరిశ్రమ హైదరాబాద్ బాట పట్టింది. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టినా, చిన్నా భిన్నమైన ఐటీ పరిశ్రమ తిరిగి కోలుకునేందుకు కనీసం ఆర్నెల్లు పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమప్రాజెక్ట్లకు సంబంధించిన క్రిటికల్ రిసోర్స్ పర ్సన్లను ఇప్పటికే హైదరాబాద్ రప్పించాయి. చెన్నైలో స్థిర నివాసముంటున్న ఐటీ నిపుణులు మినహాయిస్తే, మిగిలిన వారిలో ఎక్కువశాతం హైదరాబాద్‌కు వలసబాట పట్టారు. నగరానికి క్రిటికల్ రిసోర్స్.. ప్రతి ఐటీ కంపెనీకి క్రిటికల్ రిసోర్స్ పర్సన్లే ఎంతో కీలకం. ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఒక క్రిటికల్ రిసోర్స్ పర్సన్‌కు సరైన పని వాతావరణాన్ని కల్పించగలిగితే, క్రిందిస్థాయిలో కనీసం 500 నుంచి వెయ్యిమంది వరకు ఉద్యోగులు పనిచేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం చెన్నై నగరంలో పని వాతావరణ పూర్తిగా పాడైనందున ప్రముఖ కంపెనీలన్నీ తమ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన క్రిటికల్ రిసోర్స్ పర్సన్లను హైదరాబాద్ రప్పిస్తున్నాయి. వారి హోదాలను బట్టి స్టార్ హోటళ్లలోనూ, తమ సొంత, అద్దె గెస్ట్‌హౌస్‌ల్లోనూ వారికి వసతి కల్పిస్తున్నాయి. మెయిన్ సర్వర్ నుంచి వీపీఎన్ యాక్సిస్ ద్వారా వారంతా పనిచేసేందుకు వీలు కలుగుతుంది. ఇటువంటి పని వాతావరణం ఉండే.. హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లా, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ తదితర స్టార్ హోటళ్లు, పలు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌ల నుంచి ఇప్పటికే చాలామంది క్రిటికల్ రిసోర్స్ పర్సన్లు కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. బాధితులకు టిటా బాసట చెన్నై నగరంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా దెబ్బతినడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా..తదితర రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు వలసబాట పట్టారు. వీరిలో ఎక్కువమంది హైదరాబాద్ నగరమే త మ తదుపరి మజిలీకి అనువైనదిగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఇప్పటికిప్పడు హైదరాబాద్‌కు వలస వచ్చే వేలాదిమందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేనందున, కనీసం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులకైనా ఇక్కడున్న కంపెనీల్లో అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఐటీ అసోసియేషన్(టిటా) ముందుకొచ్చింది. అధునాతన సదుపాయాలు కల్గిన టి-హబ్ ద్వారా కొందరికి పనిచేసేందుకు అవకాశాల కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా వివిధ కంపెనీల్లో ఉన్న ఖాళీలను వలస వచ్చిన వారితో భర్తీ చే సే విధంగా చూడాలని టిటాలో సభ్యులుగా ఉన్న 10వేలమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అసోయేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. గూగుల్ డాక్ ద్వారా బాధితులకు సాయం వరదల కారణంగా సర్వం కోల్పోయిన చెన్నై నగర వాసులకు తమ వంతు చేయూతనందించేందుకు కూడా టిటా ముందుకొచ్చింది. చెన్నై ప్రభుత్వం ఏర్పాటు చేసిన గూగుల్ డాక్ ద్వారా హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వంతు సాయాన్ని అందించాలని తమ అసోసియేషన్ సభ్యుల ద్వారా పిలుపునిచ్చింది. దీంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగులు అడ్హాక్ కమిటీలుగా ఏర్పడి తాము సేకరించిన సొమ్ముతో దుస్తులు, షూస్.. తదితర వస్తువులను కొని వివరాలను గూగుల్ డాక్లో ఎంటర్ చేస్తున్నారు. గూగుల్ డాక్‌లోని వివరాలతో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌లతో చెన్నైలోని హెల్ప్‌లైన్స్ కాంటాక్ట్ చేసి సదరు వస్తువులను సేకరించి బాధితులకు అందజేస్తున్నాయి. స్వచ్ఛందంగా సేవలందించండి.. చెన్నైలో వరద బాధిత ఐటీ ఉద్యోగులకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకు రావాలని హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని సహచర ఉద్యోగులకు తెలంగాణ ఐటీ అసోసియేషన్ (టిటా) సభ్యులకు పిలుపునిస్తున్నాం. అదనపు పనిగంటలు చేయడం ద్వారా వచ్చిన వేతనాన్ని బాధితులకే వెచ్చించాలని కోరుతున్నాం. బాధిత ప్రాంతాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ పరిమితిని వారానికి పెంచమని ఐటీ కంపెనీలన్నింటికీ సూచిస్తున్నాం. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లి అక్కడ్నుంచే పనిచేసేందుకు అవకాశం కల్పిస్తే మేలు. ఉద్యోగినుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే వారి కి ఒక నెలరోజుల పాటు సెలవు ఇవ్వాలి. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వలస వస్తు న్న వారికి స్థానికంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు లభ్యమయ్యేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి, చెన్నైలో చిన్నాభిన్నమైన రోడ్డు రవాణా వ్యవస్థను వీలైనంత త్వరగా మెరుగు పరచాలని అక్కడి ప్రభుత్వానికి టిటా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. -సందీప్ కుమార్ మక్తాల, ‘టిటా’ అధ్యక్షుడు బీసీపీతో అదనపు పని గంటలు ప్రముఖ కంపెనీలైన ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్..తదితర కంపెనీలు బిజినెస్ కంటిన్యూ ప్లాన్(బీసీపీ) అగ్రిమెంట్‌ను అమలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో పనిచేసేందుకు అవకాశం లేనందున, అక్కడ ఒక ఉద్యోగి చేసే ఎనిమిది గంటల పనిని హైదరాబాద్‌లోని తమ కంపెనీ ఉద్యోగులకే రెండేసి గంటల చొప్పున అప్పగిస్తున్నాయి. బీసీపీ అగ్రిమెంట్ మేరకు ఒక ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినపుడు వేరొక ప్రాంతంలో ఉద్యోగులు పనిచేసే అదనపు పనిగంటలు పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని టెక్నాలజీ నిపుణులు పనిభారాన్ని పంచుకోవడంతో చెన్నైలోని తోటి ఉద్యోగులకు వేతనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు.. ఉద్యోగులు చేసిన అదనపు పనికి గాను కొన్ని కంపెనీలు అదనంగా వేతనాన్ని చెల్లిస్తున్నాయి. అదన పు పనిగంటల ద్వారా వచ్చిన వేతనాన్ని దాదాపుగా అన్ని కంపెనీల ఉద్యోగులు చెన్నైలోని వరద బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ► గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్..దక్షిణ భారత దేశంలో వరదల నేపథ్యంలో ప్రఖ్యాత ఐటీ కంపెనీ గూగుల్ తాజాగా క్రైసిస్ రెస్పాన్స్ టూల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎమర్జన్సీ సేవల వివరాలు, హెల్ప్‌లైన్ కేంద్రాలు, వసతి సదుపాయాలు, ఆయా ప్రాంతాల మ్యాప్‌లను పొందుపరిచింది. స్థానికంగా వార్తలను, వీడియోలనూ అప్లోడ్ చేస్తోంది. ఈ సదుపాయాన్ని గూగుల్ ఉచితంగా అందిస్తోంది. ► ప్రఖ్యాత సామాజిక మాథ్యమ సంస్థ ఫేస్బుక్ తమ చెకిన్ ఆప్షన్లో ‘సేఫ్టీ చెక్ ఫీచర్’ను తాజాగా ప్రవేశపెట్టింది. దీని ద్వారా స్నేహితులకు, బంధువులకు బాధితులు తమ యోగక్షేమాలను పంచుకునేందుకు వీలు కలుగుతోంది. ► పేటీఎం కంపెనీ చెన్నై వాసుల కోసం రూ.30 మొబైల్ రీచార్జ్‌లను ఉచితంగా అందిస్తోంది. ఎంటీఎస్ ఒక జీబీ డేటాను మూడు రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది.